బంతి కృష్ణంరాజు కోర్టులో!
ABN, First Publish Date - 2021-07-17T04:24:11+05:30
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ మరో కొత్త మలుపు తీసుకోనుంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని ‘మా’ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకే వదిలేసినట్లు.....
- రాజీ ప్రయత్నాలు ముమ్మరం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల ప్రక్రియ మరో కొత్త మలుపు తీసుకోనుంది. ఎన్నికలు ఎప్పుడు జరపాలనే విషయంపై తుది నిర్ణయాన్ని ‘మా’ క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజుకే వదిలేసినట్లు విశ్వసనీయవర్గాలు తెలియజేశాయి. మరో వైపు విభేదాలు మరింత ముదరకుండా కొందరు పెద్దలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
‘మా’లోని సభ్యుల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించటానికి.. కార్యక్రమాలు సజావుగా జరిగేలా చూడటానికి 2019లో కృష్ణంరాజు అధ్యక్షతన క్రమశిక్షణ సంఘాన్ని ఏర్పాటు చేశారు. చిరంజీవి, మురళీమోహన్, జయసుధ, మోహన్‌బాబు ఈ సంఘంలో సభ్యులు. ‘మా’లో తలెత్తిన విభేదాల పరిష్కారంలో ఈ సంఘానిదే తుదినిర్ణయం. ఈ మేరకు ఎగ్జిక్యూటివ్ కమిటీలో కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. అయితే సుమారు నాలుగు నెలల క్రితం చిరంజీవి క్రమశిక్షణ సంఘ సభ్యత్వానికి రాజీనామా చేశారు. కానీ దీనిని ఇతర సభ్యులు ఇంకా అంగీకరించలేదు. అధికారికంగా ఆయన ఆ పదవిలో కొనసాగుతున్నట్లే లెక్క.
ప్రస్తుత ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీ పదవీకాలం ఈ ఏడాది మార్చిలో ముగిసింది. అయితే కోవిడ్ వల్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ ఎన్నికలు ఎప్పుడు జరుపుతారంటూ కొందరు సభ్యులు ‘మా’ అధ్యక్షుడికి లేఖలు రాశారు. ఈ లేఖలను కృష్ణంరాజుకు పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఎన్నికలు ఎప్పడు జరపాలనే విషయంపై అభిప్రాయాలను చెప్పాలంటూ కృష్ణంరాజు మిగిలిన నలుగురు సభ్యులను కోరినట్లు వర్గాలు వెల్లడించాయి. వీరి నుంచి సమాధానాలు వచ్చిన తర్వాత ఆయన తుది నిర్ణయం వెల్లడించే అవకాశముంది. ‘మా’ నిబంధనల ఆధారంగా చూస్తే- అదే తుది నిర్ణయమవుతుంది.
సంధి ప్రయత్నాలు ముమ్మరం..
ఒక వేళ వచ్చే మార్చి వరకు ‘మా’ ఎన్నికలు జరగకపోతే - అప్పటి దాకా ఒక తాత్కాలిక కమిటీని నియమించాలనే ప్రతిపాదన కూడా తెరమీదకు వచ్చినట్లు సమాచారం. ఎన్నికల కోసం రంగంలో దిగిన రెండు ప్యానల్స్ ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకోకుండా చూడటం.. పెండింగ్‌లో ఉన్న ‘మా’ కార్యకలాపాలను పూర్తిచేయటం.. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరిగేలా చూడటం ఈ కమిటీ ప్రధాన బాధ్యతలుగా పేర్కొంటున్నారు. ఈ కమిటీకి ఒక ప్రముఖ సినీ నటిని అధ్యక్షురాలిగా నియమించాలనే ప్రతిపాదన వచ్చినట్లు.. దానిని ఆమె తిరస్కరించినట్లు సమాచారం.