జై... జై... నాయిక!

ABN , First Publish Date - 2021-12-29T09:26:51+05:30 IST

మన కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి. కానీ... హీరోయిన్‌ లేకపోతే బండి నడవదు. సినిమా అంటేనే గ్లామర్‌. ఆ గ్లామర్‌ హీరోయిన్‌తోనే సాధ్యం. అందుకే నాయిక పాత్రలకు అంత డిమాండ్‌....

జై... జై... నాయిక!

మన కథలన్నీ హీరోల చుట్టూనే తిరుగుతాయి. కానీ... హీరోయిన్‌ లేకపోతే బండి నడవదు. సినిమా అంటేనే గ్లామర్‌. ఆ గ్లామర్‌ హీరోయిన్‌తోనే సాధ్యం. అందుకే నాయిక పాత్రలకు అంత డిమాండ్‌. తెలుగులో స్టార్‌ కథానాయికగా మారడం కష్టం కానీ, ఒక్కసారి అంతటి పేరొస్తే- ఇక వాళ్లని అందుకోవడం ఎవరి తరమూ కాదు. స్వతహాగా తెలుగు చిత్రసీమకు నాయికల కొరత ఎక్కువ. అందుకే కాస్త ప్రతిభ ఉండి, అందంగా కనిపించే కథానాయిక దొరికితే చాలు. వాళ్లని అందలం ఎక్కించేయడానికి రెడీగా ఉంటారు దర్శక నిర్మాతలు. ఓ మంచి కథ దొరకడం దర్శకులకు ఎంత కష్టమో, ఓ కథానాయికని వెదికి పట్టుకోవడం కూడా అంతే కష్టం. ఎందుకంటే... టాలీవుడ్‌లో మహా అయితే ఓ అరడజను మంది స్టార్‌ హీరోయిన్లు  ఉన్నారేమో.? వాళ్ల చుట్టూనే చిత్రసీమ తిరుగుతుంటుంది. అందుకే కథానాయికలకు అంత డిమాండ్‌. 2021లో కూడా స్టార్‌ కథానాయికల హవా కనిపించింది. వాళ్లు తమదైన ముద్ర వేయగలిగారు. ఆ లెక్కలు ఒక్కసారి చూసుకుంటే...


అగ్ర హీరో సినిమా అంటే కచ్చితంగా స్టార్‌ కథానాయికని వెదికి పట్టుకోవాల్సిందే. అప్పుడే తెరపై జోడీ చూడముచ్చటగా ఉంటుంది. ఓ కథ సెట్‌ అయ్యిందంటే.. ముందు కథానాయిక ఎవరు? అనే ప్రశ్న మొదలవుతుంది. అక్కడి నుంచి అన్వేషణ ఆరంభం. మన హీరోయిన్లు ఇప్పుడు కోలీవుడ్‌, బాలీవుడ్‌ అంటూ దేశమంతా చక్కర్లు కొడుతుంటారు కాబట్టి, వాళ్ల కాల్షీట్లు ఎప్పటికీ హాట్‌ కేకులే. వాళ్ల డిమాండ్‌ తో పాటుగా పారితోషికమూ పెరిగిపోతుంటుంది. అయినా సరే, మన నిర్మాతలు వెనుకంజ వేయడం లేదు. ఈయేడాది కూడా స్టార్‌ హీరోయిన్లు భారీ పారితోషికాలు అందుకున్నారు. చక చకా సినిమాలు చేశారు. శ్రుతి హాసన్‌ ఖాతాలో ఈ యేడాది రెండు హిట్లు పడ్డాయి. సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్‌’, వేసవిలో విడుదలైన ‘వకీల్‌ సాబ్‌’ రెండూ మంచి విజయాల్ని అందుకున్నాయి. వాటిలో శ్రుతినే నాయిక. ఈ యేడాది ‘పిట్టకథలు’ అనే వెబ్‌ సిరీస్‌ కూడా చేశారామె. నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రంలోనూ తను కథానాయికగా ఎంపిక అయ్యారని టాక్‌. సాయి పల్లవి హవా ఈ యేడాది కూడా కొనసాగింది. తను నటించిన ‘లవ్‌ స్టోరీ’, ‘శ్యామ్‌ సింగరాయ్‌’ మంచి విజయాలు సాధించాయి. ఎప్పటిలానే... తన పాత్రకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే నటించారామె. ఈ యేడాది ఓ వెబ్‌ సిరీస్‌ కూడా చేశారు.


2021లో సమంత పెద్దగా కనిపించలేదు. ‘పుష్ప’లో ఐటెమ్‌ గీతంలో మెరిశారు. ఈ పాట సూపర్‌ హ్టిటయ్యింది. తన కెరీర్‌లో చేసిన తొలి ప్రత్యేక గీతం ఇదే. ఈ పాట కోసం సమంత భారీ పారితోషికం అందుకున్నారని టాక్‌. తన చేతిలో ‘యశోద’, ‘శాకుంతలం’ చిత్రాలున్నాయి. తమిళంలోనూ ఓ సినిమా చేస్తున్నారు. దీంతో పాటుగా ‘ఆహా’లో ఓ టాక్‌ షో చేశారు సమంత. అది బాగా పాపులర్‌ అయ్యింది.


తమన్నా నుంచి ఈ యేడాది రెండు సినిమాలొచ్చాయి. ‘సిటీమార్‌’లో తన స్వభావానికి విరుద్ధంగా సీరియస్‌ పాత్రలో కనిపించారు తమన్నా. ఈ సినిమా కోసం తెలంగాణ యాసలో డైలాగులు పలికారు. ‘మాస్ర్టో’లో నెగెటివ్‌ ఛాయలున్న పాత్రలో మెప్పించారు. ఆమె నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధంగా ఉంది. 


వరుస విజయాలతో ఫుల్‌ స్వింగ్‌లో ఉన్న నాయిక పూజా హెగ్డే. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌’లో తన పాత్ర ఆకట్టుకుంది. ఆమె నటించిన ‘రాధే శ్యామ్‌’ ఈ సంక్రాంతికి విడుదల కానుంది. పూజా నటించిన ‘ఆచార్య’ కూడా ఈ యేడాదే విడుదల కావాల్సింది. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఫిబ్రవరి 4న వస్తోంది. వీటితో పాటు తమిళంలో విజయ్‌ సరసన నటిస్తోంది. ఓ హిందీ సినిమా కూడా చేస్తోంది. 2022లోనూ పూజా కెరీర్‌ జెడ్‌ స్పీడులో సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యేడాది ముచ్చటగా మూడు సినిమాలు చేశారు రష్మిక. అందులో ఓ కన్నడ, ఓ తమిళ సినిమా కూడా ఉంది. తెలుగులో తను నటించిన చిత్రం ‘పుష్ప’. ఇందులో శ్రీవల్లిగా ఆమె నటన ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం పూర్తి డీ గ్లామర్‌ పాత్రలో కనిపించారామె. ఈ యేడాదే హిందీలోనూ అరంగేట్రం చేశారు. తను ప్రస్తుతం రెండు హిందీ చిత్రాల్లో నటిస్తున్నారు. తెలుగులో శర్వానంద్‌ తో కలిసి ‘ఆడవాళ్లూ మీకు జోహార్లు’లో నటించారు. 2022లో ఈచిత్రం విడుదల కానుంది. ఈ యేడాది రకుల్‌ ప్రయాణం బిజీ బిజీగా సాగింది. ‘చెక్‌’, ‘కొండపొలం’ చిత్రాలు విడుదలయ్యాయి. ‘చెక్‌’ నిరాశ పరిచినా ‘కొండపొలెం’లో ఓబులమ్మగా ఆమె నటన ఆకట్టుకుంది. హిందీలో దాదాపుగా అరడజను చిత్రాలు రకుల్‌ చేతిలో ఉన్నాయి. ‘ఇండియన్‌ 2’లోనూ ఆమె నటిస్తోంది. 


Updated Date - 2021-12-29T09:26:51+05:30 IST