వారే నిజమైన ‘జాతిరత్నాలు’.. త్వరలోనే సీక్వెల్
ABN, First Publish Date - 2021-03-20T03:07:43+05:30
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకుడు. మహాశివరాత్రి
నవీన్ పోలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం 'జాతిరత్నాలు'. ఫరియా అబ్దుల్లా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి అనుదీప్ కేవీ దర్శకుడు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం.. సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ చిత్రంతో నిర్మాతగా తన సత్తా ఏంటో చూపించారు 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ బ్లాక్ బస్టర్ హిట్‌గా ఈ చిత్రం దూసుకుపోతుండటంతో.. చిత్రయూనిట్ విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రియదర్శి మాట్లాడుతూ.. ''నాలుగేండ్ల ముందు పెళ్లి చూపులు వచ్చినప్పుడు ఇలాంటి కామెడీ సినిమా ఇంకా వస్తదా? అనుకున్నాను. కానీ జాతిరత్నాలు సినిమా వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. నా పెళ్లాం కంటే ఎక్కువగా రాహుల్‌తో కలిసి ఉంటున్నాను. సినిమా కోసం మేం ఎంత కష్టపడ్డామన్నది మీకు (ఆడియెన్స్) అనవసరం. మీకు సంతోషకరమైన క్షణాలు ఇవ్వాలనే ఎంతో మంది కష్టపడుతుంటారు. ఈ సినిమాను నిర్మించిన స్వప్నా, ప్రియాంక, నాగ్ అశ్విన్‌లకు థ్యాంక్స్. అమెరికాలో ఉన్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్‌కు కూడా చెబుతున్నాం. న్యూయార్క్‌కు వస్తున్నాం. మేం ముగ్గురం కలిసి ఎప్పటికీ ఇలానే ఉంటాం. అందరికీ థ్యాంక్స్" అని అన్నారు.
రాహుల్ రామకృష్ణ మాట్లాడుతూ.. ''ఈ సినిమా హిట్ అవ్వడానికి కారణం అనుదీప్. ఈయన ప్రభావం మా జీవితాలపై చాలా పడింది. మధ్యలో కరోనా వచ్చింది. మనం అసలు ఇక నవ్వుతామో లేదో అనుకున్నా. సీటు చింపుకునేలా నవ్వుతారని వరంగల్ ఈవెంట్‌లో చెప్పాను. అలానే జరుగుతోంది. థియేటర్ ఓనర్లు ఫోన్ చేసి నన్ను డబ్బులు అడుగుతున్నారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమాను ఇంత సక్సెస్ చేసినందుకు ప్రేక్షకులకు థ్యాంక్స్" అని అన్నారు.
నవీన్ పొలిశెట్టి మాట్లాడుతూ.. ''రెస్పాన్స్ చూసి నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి. ప్రమోషన్స్‌లో మేమే కనిపిస్తాం. మేం కనిపించే జాతి రత్నాలు. కానీ నాగ్ అశ్విన్, ప్రియాంక, స్వప్నాలే నిజమైన జాతి రత్నాలు. అనుదీప్ జీవితాన్ని చదివాడు. చాలా గట్టిగా మానవత్వం నేర్చుకున్నాడు. దాని కంటే పెద్ద డిగ్రీ లేదు. ఇది మా అందరికీ ఎంతో ముఖ్యమైన సినిమా. దర్శకుడు అనుదీప్ నాకు ఓ సోదరుడు లాంటివాడు. మొదటి సినిమానే అయినా కూడా ఫరియా అద్భుతంగా నటించింది. నరేష్ గారిని చూసి ఎంతో నేర్చుకున్నాం. మా సినిమాలో భాగస్వామి అయినందుకు నరేష్ గారికి థ్యాంక్స్. రదన్ తన సంగీతంతో ప్రాణం పోశాడు. చాలా రోజుల తరువాత ఎంతో నవ్వామని ఎయిర్ పోర్ట్‌లో ఓ సెక్యూరిటీ గార్డ్ చెప్పిన మాటలకంటే పెద్ద బ్లాక్ బస్టర్ ఏది ఉండదు. ఎంతో మంది ఆశీస్సులతో ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఏజెంట్‌గా ఒప్పుకున్నారు.. చిచోరేలో యాసిడ్ అంటే ఒప్పుకున్నారు.. ఇప్పుడు జోగిపేట్ శ్రీకాంత్ అంటే కూడా ఓకే అన్నారు. ఈ ప్రేమ, సపోర్ట్ ఎప్పుడూ ఉండాలి. హీరోది ఏ ఫ్యామిలీ అంటే మీ(ఆడియెన్స్) ఫ్యామిలీ అని చెప్పండి" అని అన్నారు. ఇక స్టేజ్ మీదే దర్శకుడు, హీరోలు అందరూ కలిసి జాతి రత్నాలు సీక్వెల్ గురించి ప్రకటించేశారు. త్వరలోనే జాతి రత్నాలు సీక్వెల్ ఉంటుందని తెలిపారు.