మ్యాస్ట్రో 45 సంగీత వసంతాలు

ABN , First Publish Date - 2021-05-15T14:40:15+05:30 IST

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఈయన సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి మే 14వ తేదీకి 45 వసంతాలు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన తొలి చిత్రం...

మ్యాస్ట్రో 45 సంగీత వసంతాలు

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని ప్రఖ్యాత సంగీత దర్శకుల్లో ఇళయరాజా ఒకరు. ఈయన సినీ సంగీత ప్రపంచంలోకి ప్రవేశించి మే 14వ తేదీకి 45 వసంతాలు. ఇళయరాజా సంగీతం సమకూర్చిన తొలి చిత్రం ‘అణ్ణ కిళి’. ఈ చిత్రం విడుదలై నేటికి 45 యేళ్ళు. సీనియర్‌ నిర్మాత పంచు అరుణాచలం ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇళయరాజా అనే పేరు కూడా ఆయనే పెట్టారు. ఆ రోజుల్లో చిత్ర పరిశ్రమలో ఏ.ఎం.రాజా అనే   సంగీత దర్శకుడు ఉండేవారు. దీంతో రాజా పేరును ‘ఇళయరాజా’గా నిర్మాత పంచు అరుణాచలం మార్చారు. ఇళయరాజా.. సొంతూరు ప్రస్తుతం తేని జిల్లాలోని పన్నైపురం. ఈయన జీవా అనే మహిళన వివాహం చేసుకోగా వీరికి ముగ్గురు సంతానం. వీరు కార్తీక్‌ రాజా, యవన్‌ శంకర్‌ రాజా, భవధారణి. వీళ్ళంతా సంగీత దర్శకులుగా, గాయకులుగా రాణిస్తున్నారు. ఇళయరాజా సోదరుడే సంగీత దర్శకుడు గంగైఅమరన్‌. 


తన తొలి చిత్రం ‘అన్నకిళి’ నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖారానికి చేరుకున్న ఇళయరాజా... 45 యేళ్ళ సినీ సంగీత కెరీర్‌లో ఆయన చేయని ప్రయోగాలు లేవు.. అందుకోని అవార్డులు రివార్డులు లేవు. ఈయన 45 యేళ్ళ సినీ జీవితంలో వేలాది చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించగా, ఎన్నో పాటలను కూడా పాడారు. 1970 నుంచి మూడు దశాబ్దాల వరకు సంగీత సామ్రాజ్యంలో తిరుగులేని చక్రవర్తిగా కొనసాగారు. ఆ తర్వాత కొత్త దర్శకుల రాకతో ఆయన ప్రాభవం తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ.. ఇప్పటికే ఇళయరాజా సంగీతానికి ఉండే ఆ ప్రత్యేకతే వేరు. ఆయన సంగీత మేథస్సును గుర్తించి 1988లో అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధి ఇళయరాజాకు ‘ఇసైఙ్ఞాని’ (సంగీత ఙ్ఞాని) అన బిరుదు ప్రదానం చేశారు. ఈయనకు 2010లో పద్మభూషణ్‌, 2018లో పద్మవిభూషణ్‌ పురస్కాలతో కేంద్రం సత్కరించింది. ఇక ఆయన అందుకున్న నంది అవార్డులు, జాతీయ పురస్కారాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ప్రత్యేక పురస్కారాలు లెక్కేలేదు. ఇలా... ఈ సంగీత ఙ్ఞాని సినీ జగత్తులో 45 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ఇపుడు కూడా ఆయన పదికి పైగా సినిమాలకు సంగీతం సమకూరుస్తూ, తనలో ఏమాత్రం చేవ తగ్గలేదని నిరూపిస్తూ యువ సంగీతదర్శకులతో పోటీ పడుతున్నారు. 

Updated Date - 2021-05-15T14:40:15+05:30 IST