అమెజాన్ ప్రైమ్ ఇండియాకు ఐబీ మంత్రిత్వ శాఖ సమన్లు
ABN , First Publish Date - 2021-01-18T15:04:42+05:30 IST
బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివాదంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారులకు సమన్లు....

న్యూఢిల్లీ : బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్ నటించిన ‘తాండవ్’ వెబ్ సిరీస్‌కు సంబంధించిన వివాదంపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అమెజాన్ ప్రైమ్ వీడియో అధికారులకు సమన్లు జారీ చేసింది. సైఫ్ అలీఖాన్ నటించిన తాండవ్ వెబ్ సిరీస్ హిందూ మత మనోభావాలను దెబ్బతీస్తుందని ఇద్దరు బీజేపీ నేతలు ఆరోపించిన నేపథ్యంలో కేంద్ర ప్రసారమంత్రిత్వశాఖ అమెజాన్ ప్రైమ్ వీడియోకు సమన్లు జారీ చేసింది. తాండవ్ ధారావాహిక హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని బీజేపీ నాయకుడు రామ్ కదమ్ ముంబైలోని ఘట్ కోపర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ కు లేఖ రాయడంతోపాటు ఓటీటీ ప్లాట్ ఫారమ్ లను సెన్సార్ షిప్ పరిధిలోకి తీసుకురావాలని కోరారు.
ఈ ధారావాహికలో ఓ నటుడికి శివుని త్రిశూల్ లను అభ్యంతరకరమైన రీతిలో ఉపయోగించారని, ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీసిందని ఫిర్యాదు చేశారు. తాండవ్ నిర్మాతలు హిందూ దేవుళ్లను అపహాస్యం చేశారని, దీనివల్ల హిందూ మత మనోభావాలను అగౌరవ పర్చారని దీనిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకుడు మనోజ్ కోటక్ కేంద్రమంత్రి జవదేకర్ కు లేఖలో కోరారు. జనవరి 4వతేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో తాండవ్ ట్రైలరును విడుదల చేశారు.