ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు.. నేను కూడా చేశాను: హీరోయిన్ పూర్ణ

ABN , First Publish Date - 2021-11-29T23:59:16+05:30 IST

ఇందులో నాకు మూడు సీన్లు ఉంటాయి. వాటి గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. పూర్ణను గుర్తిస్తారు. మంచి పాత్రను పోషించారు అని ప్రేక్షకులు అంటారు. నా పాత్ర చాలా ముఖ్యమైంది. మెచ్యూర్డ్, డామినేషన్, హెల్త్ మినిష్టర్ లాంటి క్యారెక్టర్.

ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు.. నేను కూడా చేశాను: హీరోయిన్ పూర్ణ

నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రాబోతున్న హ్యాట్రిక్ చిత్రం ‘అఖండ’. డిసెంబర్ 2న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రాన్ని.. ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవిందర్ రెడ్డి నిర్మించారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటించగా పూర్ణ ఓ కీలక పాత్రలో నటించింది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా సోమవారం పూర్ణ మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. 


ఆమె మాట్లాడుతూ.. ‘‘2008లో చేసిన సీమ టపాకాయ్ తర్వాత ఇప్పుడు ఇలాంటి పెద్ద ప్రాజెక్ట్‌లో ఆఫర్ రావడం ఆనందంగా ఉంది. ఈ మూవీలో చేసిన తర్వాత చాలా మంచి ఆఫర్లు వచ్చాయి. వాస్తవానికి ఈ పాత్రను వేరే ఆర్టిస్ట్ చేయాలి. కానీ అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. బోయపాటిగారు కాల్ చేయడంతో సంతోషించాను. ఇందులో నేను పద్మావతి అనే పాత్రలో కనిపిస్తాను. చాలా ఇంపార్టెంట్ రోల్. శ్రీకాంత్‌గారికి, బాలయ్య సర్‌కు మధ్యలో ఈ పాత్ర ఉంటుంది. బోయపాటి గారి సినిమాలో స్త్రీ పాత్రలు చాలా బలంగా ఉంటాయి. హీరోయిన్ అనే కాకుండా మిగతా పాత్రలు కూడా ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటాయి. పాత్రలో డామినేషన్ ఉంటుందని బోయపాటి గారు ముందే చెప్పారు. బాలా సర్ ముందు నిలబడి అలాంటి డైలాగ్స్ చెప్పాలా? అని భయపడ్డాను. కానీ బాలా సర్ ఎంతో సహకరించారు. సెట్‌లో ఎంతో కంఫర్ట్‌గా ఉంటారు. ఆయన ఎనర్జీ మామూలుగా ఉండదు. ఒక్కో ఫైట్ దాదాపు 17 రోజులు ఉండేది. మేం చివర్లో జాయిన్ అయ్యేవాళ్లం. సెట్‌లో అందరూ అలిసిపోయి కనిపిస్తారు. కానీ బాలా సర్ మాత్రం..  సింహం సింహమే. ఎంతో ఎనర్జీగా ఉంటారు. నేను ఫోన్‌లో ఆయన వాల్ పేపర్ పెట్టుకుంటాను. ఆ ఎనర్జీ నాక్కూడా రావాలని అనుకుంటాను.


ఇందులో నాకు మూడు సీన్లు ఉంటాయి. వాటి గురించి కచ్చితంగా అందరూ మాట్లాడుకుంటారు. పూర్ణను గుర్తిస్తారు. మంచి పాత్రను పోషించారు అని ప్రేక్షకులు అంటారు. నా పాత్ర చాలా ముఖ్యమైంది. మెచ్యూర్డ్, డామినేషన్, హెల్త్ మినిష్టర్ లాంటి క్యారెక్టర్. హీరోయిన్ ఐఏఎస్ పాత్రలో కనిపిస్తారు.. ఆమెను ట్రైన్ చేస్తాను. చైల్డిష్‌లా ఉంటే కుదరదు. నాకు ఈ చిత్రంలో బాలా సర్ పోషించిన రెండు పాత్రలతో సీన్లు ఉంటాయి. అఘోర పాత్రలో బాలా సర్‌ను చూస్తే నాకు దేవుడిని చూసినట్టు అనిపించేది.


నా లక్కీ నంబర్ 5. 2021లో మొత్తం కూడితే 5 వస్తుంది. నాకు ఈ ఏడాదిలో చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. లాక్‌డౌన్ తరువాత చాలా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌గా చేయాలని కాదు.. నాకు నాలుగైదు సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ చూపించాలి. దృశ్యం 2లో అందరూ బాగా నటించావని అన్నారు. అలా నా పాత్రకు ఇంపార్టెన్స్ ఉండాలని అనుకుంటాను. సుహాసిని, రేవతి వంటి వారిని చూసి ఎలాంటి పాత్రలైనా చేయాలని అనుకున్నాను. కేరళ నుంచి ఇక్కడకు వచ్చి ఇన్నేళ్లు ఇండస్ట్రీలో కొనసాగుతున్నానంటే అదే నాకు చాలా గొప్ప విషయం. నేను ఇండస్ట్రీకి సింగిల్‌గా వచ్చాను. అప్పుడు ఎవ్వరూ తెలీదు. కానీ ఇంత వరకు ప్రయాణించాను. దానికి ముఖ్య కారణం మా అమ్మ. దర్శకుడు మిస్కిన్ సర్. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరూ నన్ను ప్రోత్సహించారు.


నాకు డ్యాన్స్ బాగా వచ్చు. కానీ డ్యాన్స్ చేసే పాత్ర మాత్రం ఇంత వరకు రాలేదు. డబ్బే కావాలంటే ఏ సినిమా పడితే ఆ సినిమా చేయవచ్చు. కానీ కెరీర్ బాగుండాలి.. సుధీర్ఘంగా సాగాలంటే మాత్రం మంచి చిత్రాలనే ఎంచుకోవాలి. కానీ ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. అలా నేను కూడా చేశాను. పాత్ర నాకు నచ్చితే ఒప్పుకుంటాను. పాత్ర డిమాండ్ చేస్తే, నాకు నచ్చిన క్యాస్టూమ్ అయితే వేసుకుంటాను. ఇవన్నీ ముందే ఆలోచించి పాత్రకు ఓకే చెబుతాను. ఎందుకంటే సెట్‌కు వెళ్లాక అది వేసుకోలేను.. ఇది వేసుకోలేను అంటే అందరికీ ప్రాబ్లం అవుతుంది. అలాగే చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అని చూడను. నా పాత్ర నచ్చితే ఓకే చెబుతాను. అయితే ఓ నటిగా అన్ని రకాలుగా చూసుకుంటాను. కొన్ని కొన్ని తప్పులు మాట్లాడినా కూడా తెలుగు ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నాను. మనం పబ్లిక్ ప్రాపర్టీ. ప్రజల వల్లే మనం సెలెబ్రిటీలు అవుతాం. వారు పాజిటివ్, నెగెటివ్ కామెంట్లు చేస్తారు. నేను అన్నీ ఒకేలా తీసుకుంటాను. నేను సోషల్ మీడియాలో అన్ని కామెంట్లను చదువుతాను. నెగెటివ్ కామెంట్లను చూసి ఎంతో మార్చుకున్నాను. ఈ సినిమాతో నా కెరీర్ టర్న్ అవుతుందని మొదట్లో అనుకున్నాను.. కానీ ఇప్పుడు అలాంటి అభిప్రాయం ఏమీ లేదు. అఖండ తరువాత మంచి పాత్రలు వస్తాయని అనుకుంటాను..’’ అని తెలిపారు.

Updated Date - 2021-11-29T23:59:16+05:30 IST