నడిచొచ్చే ధైర్యం నాన్న .. అదో పీడకల..: హంసానందిని
ABN , First Publish Date - 2021-06-20T18:13:31+05:30 IST
ఇది తప్పు. అది ఒప్పు. ఇలా చేయాలి. అలా చేయాలి అని నాన్న ప్రతిసారీ చెప్పడు.
హైదరాబాద్ సిటీ : ఇది తప్పు. అది ఒప్పు. ఇలా చేయాలి. అలా చేయాలి అని నాన్న ప్రతిసారీ చెప్పడు. అతన్ని చూసి మనం కొన్ని నేర్చుకోవాలి. ముఖ్యంగా కష్టకాలంలో ధైర్యంగా ఉండటం. ఆ ధైర్యమే కరోనా కాలంలో మరింత దగ్గరగా నాన్నలో చూశానని అన్నారు నటి హంసానందిని. ప్రియమైన వారి కన్నా ముఖ్యమైనది ఏదీ లేదని అర్ధమయ్యేలా కరోనా తెలిపిందంటున్నారు. తండ్రి వినయ్ బర్తకీతో ఉన్న అనుబంధం, కరోనా సమయంలో ఎదుర్కొన్న సవాళ్లు తదితర అంశాలను గురించి హంసా నందిని మాటల్లోనే...
ప్రతి అంశానికీ పరిష్కారముంది
నాన్నతో నేను చాలా సన్నిహితంగా ఉంటాను. ఆయనే నా రోల్‌మోడల్. ఎలాంటి సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. నిజానికి రిస్క్ తీసుకోవడానికి ఆయన ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అదే నాకూ అలవడింది. ఆయనెప్పుడూ ఒకటే చెబుతుంటారు. సృష్టిలో ప్రతి ఒక్కదానికీ పరిష్కారం ఉందని. సమస్య సృష్టించిన వాడే దానికి పరిష్కారమార్గం కూడా చెబుతాడని. అదే నేనూ నమ్ముతుంటాను. కానీ, అంత ధైర్యాన్ని ఒక్కసారిగా నీరు గార్చిన సంఘటన కరోనా కాలంలోనే ఎదురైంది.
అదో పీడకల..
కరోనా సెకండ్ వేవ్ కాలం. సుదీర్ఘంగా సాగిన పీడకల అది. దాదాపు 45 రోజులు. ఆ వేదన వర్ణనాతీతం. ఒకేసారి నా జీవితంలో ముఖ్యమైన ముగ్గురు వ్యక్తులు ఐసీయూలో చేరారు. ఒకరు నాన్న అయితే, మరొకరు పెదనాన్న(సునీల్ బర్తకీ). ఇంకొకరు మా నాన్నమ్మ(నిర్మల). ఆమెకు 90 సంవత్సరాలు. ఏప్రిల్‌లో వారికి కరోనా పాజిటివ్ అని తేలింది. పూణెలో ఆ సమమంలో భయంకరమైన పరిస్థితులు. ఆస్పత్రిలో బెడ్ దొరకడమే చాలా కష్టం అయింది. దాదాపు 50 ఆస్పత్రులకు కాల్ చేసుంటాను. ఫుల్ అని కొందరు చెబితే, మరికొంత మంది అసలు ఫోన్ కాల్సే తీసుకోలేదు. చివరికి ఇంటి వద్దనే చికిత్స అందిస్తారేమోనని కూడా ప్రయత్నించాను. కానీ, ఎవరూ దొరకలేదు.
రెండు రోజుల తర్వాత ఓ ఆస్పత్రిలో సింగిల్ డీలక్స్ రూమ్ దొరికింది. ముగ్గురూ ఒకే రూం. కానీ. పరిస్థితులు ఒకేలా ఉంటే విధి విచిత్రమైనది ఎందుకవుతుంది. మొదట మా పెదనాన్న ఐసీయూలో చేరితే తర్వాత నాన్నకు కూడా ఆ పరిస్థితి ఎదురైంది. కానీ, ఆ ఆస్పత్రిలో ఐసీయూ బెడ్స్ ఖాళీ లేవని డాక్టర్లు చెప్పారు. తొలిసారిగా నేను పూర్తిగా ధైర్యం కోల్పోయిన సంఘటన అది. అంతేకాదు, మా నాన్నకు ఆక్సిజన్ స్థాయి మెరుగు కాకపోతే వెంటిలేటర్ మీద పెట్టాల్సి వస్తుందన్నారు. వారు వెంటిలేటర్ అనగానే నాకు ఏమీ అర్థం కాలేదు. ఎటూ పాలుపోని స్థితి. డాక్టర్లనే నిర్ణయం తీసుకోమన్నాను. అప్పుడే డాక్టర్లు మా నాన్నతో పాటుగా పెదనాన్నకు కూడా రెమిడిసివిర్ ఇంజెక్షన్ కావాలన్నారు. అతి కష్టం మీద హైదరాబాద్ నుంచి వాటిని సంపాదించగలిగాను. ఎట్టకేలకు ముగ్గురూ కోలుకోవడం పెద్ద ఉపశమనం.
నడిచొచ్చే ధైర్యం...
నా 19 సంవత్సరాల వయసులో అమ్మను కోల్పోయాను. జీవితం ఎంత కష్టంగా ఉంటుందో అప్పుడే తొలిసారి తెలుసుకున్నాను. కానీ, నాన్న ఏ లోటూ రానీయలేదు. కరోనా కాలంలో ధైర్యం కోల్పోయిన నాకు స్ఫూర్తిగా నిలిచిందీ నాన్నే. నడిచొచ్చే ధైర్యం ఆయన. ఒకే ఇంటిలో ముగ్గురు ఆస్పత్రిలో చేరినప్పుడు కూడా మా నాన్న చాలా రిలాక్స్‌డ్‌గా ఉన్నారు. ఆయన తన జీవితం కోసం ఓ పక్క పోరాడుతూనే, 90 సంవత్సరాల వయసున్న మా నాన్నమ్మకు సహాయపడ్డారు. అదే సమయంలో మానసికంగా, శారీరకంగా వైకల్యంతో బాధపడుతున్న మా పెదనాన్నకూ తోడ్పాటునందించారు.
ఆయనకు పునర్జన్మ, నాకు...
ఆస్పత్రి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఆయనను విడిచి ఉన్నది లేదు. వారంతా ఊపిరితిత్తుల వ్యాయామాలను క్రమం తప్పకుండా చేస్తున్నారో లేదో చూస్తుండటమేకాదు, ఇంటి వద్దనే నాన్నతో కలిసి విశ్రాంతిగానూ గడుపుతున్నాను. అదే సమయంలో జీవితం పట్ల నా దృక్పథమూ మార్చుకుంటున్నాను.
