ప్రేక్షకులకు నా 110 సినిమాల నమస్కారాలు
ABN , First Publish Date - 2021-10-18T09:45:56+05:30 IST
‘‘పెళ్లిసందడి’ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా 110 సినిమాల నమస్కారాలు. పాతికేళ్ల క్రితం తీసిన ‘పెళ్లిసందడి’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు మలచడంలో గౌరీ రోణంకి సక్సెస్ అయ్యారు...

‘‘పెళ్లిసందడి’ సినిమాను ఇంత బాగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు నా 110 సినిమాల నమస్కారాలు. పాతికేళ్ల క్రితం తీసిన ‘పెళ్లిసందడి’ సినిమాను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు మలచడంలో గౌరీ రోణంకి సక్సెస్ అయ్యారు. రోషన్, శ్రీలీల చక్కగా నటించారు. పాటలకు ప్రేక్షకుల నుంచి ఈలలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు’’ అని దర్శకుడు కె. రాఘవేంద్రరావు అన్నారు. ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లిసంద-డి’. రోషన్, శ్రీలీల జంటగా నటించారు. గౌరీ రోణంకి దర్శకురాలు. ఇటీవలె విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్‌లో దర్శకురాలు మాట్లాడుతూ ‘‘సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. రోషన్, శ్రీలల జంట ముచ్చటగా ఉన్నారని ప్రేక్షకులు చెబుతున్నారు. రాఘవేంద్రరావు గారు ఎంతో ఎనర్జిటిక్‌గా నటించారు’’ అని చెప్పారు. ‘ఈ సినిమాను చూడటానికి కుటుంబంతో కలసి వస్తున్నారు. హీరోయిన్‌గా ‘పెళ్లిసంద-డి’తో నాకు మంచి గుర్తింపు దక్కిందనుకుంటున్నాను’ అని శ్రీలీల సంతోషం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రాలో నూరుశాతం ఆక్యుపెన్సీతో సినిమా నడుస్తోంది. ఫైట్స్, డ్యాన్స్ బాగా చేశావు అని మెచ్చుకుంటున్నారు’’ అని రోషన్ అన్నారు.
‘పెళ్లి సందడి’ హీరోయిన్ శ్రీలీల నా కూతురు కాదు వ్యాపారవేత్త సూరపనేని‘‘పెళ్లి సందడి’ సినిమా హీరోయిన్ శ్రీలీల నా కుమార్తె కాదు. నా మొదటి భార్య కుమార్తె. ఆమెతో నేను విడిపోయిన తర్వాత శ్రీలీల జన్మించింది’’అని ప్రముఖ పారిశ్రామికవేత్త సూరపనేని శుభాకరరావు తెలిపారు. విజయవాడలోని ఓ ప్రైవేటు హోటల్‌లో శుభాకరరావు ఆదివారం మీడియాతో మాట్లాడారు. తాను మొదటి భార్యతో 20 ఏళ్ల క్రితం విడిపోయానని ఆయన స్పష్టం చేశారు. విడాకుల కేసులు ఇంకా కోర్టు విచారణలో ఉన్నాయన్నారు. తనకు ఒకే ఒక్క కుమార్తె ఉందని, ఆమె శ్రీలీల మాత్రం కాదని స్పష్టం చేశారు. చిత్రపరిశ్రమలో అవకాశాల కోసం, ఆస్తుల కోసం శ్రీలీల కుటుంబం తన పేరును ఉపయోగించుకుంటోందని ఆరోపించారు. దీనిపై తాను న్యాయపోరాటం చేస్తానని వెల్లడించారు.
ఆంధ్రజ్యోతి, విజయవాడ