నాగార్జున గారి టేస్ట్, డెడికేషన్ వల్లే సాధ్యమైంది: నిర్మాత సి. ఎల్. నరసారెడ్డి
ABN , First Publish Date - 2021-08-29T05:55:59+05:30 IST
కేవలం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు, యావత్తు భారతీయ చలనచిత్రసీమలోనే అందరూ గర్వించదగ్గ కళాఖండాలు కొన్ని ఉంటాయి. అవి కాలమానపరిస్థితులకు అతీతంగా, మారిపోతున్న అభిరుచులను దాటుకుని, తమదైన బలమైన ముద్రలను సమయప్రవాహంపైన ముద్రించి, చిరస్మరణీయమవుతాయి. ఆ కోవకే చెందుతుంది అక్కినేని నాగార్జున కధానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి. ఎల్. నరసారెడ్డి నిర్మించిన గీతాంజలి

- సి. ఎల్. నరసారెడ్డి
కేవలం తెలుగు చలన చిత్ర చరిత్రలోనే కాదు, యావత్తు భారతీయ చలనచిత్రసీమలోనే అందరూ గర్వించదగ్గ కళాఖండాలు కొన్ని ఉంటాయి. అవి కాలమానపరిస్థితులకు అతీతంగా, మారిపోతున్న అభిరుచులను దాటుకుని, తమదైన బలమైన ముద్రలను సమయప్రవాహంపైన ముద్రించి, చిరస్మరణీయమవుతాయి. ఆ కోవకే చెందుతుంది అక్కినేని నాగార్జున కధానాయకుడిగా మణిరత్నం దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సి. ఎల్. నరసారెడ్డి నిర్మించిన గీతాంజలి చిత్రం. విడుదలైన సంవత్సరం 1989 అయితే ఈనాటి వరకూ అందరి మదిలో అనుక్షణం మెదులుతూ, నిత్యనూతనంగా మెరిేస గీతాంజలి చిత్రం గురించి, ఈరోజు నాగార్జున పుట్టినరోజు సందర్భంగా చిత్రనిర్మాత నరసారెడ్డి తన జ్ఞాపకాలను ఆంధ్రజ్యోతితో పంచుకున్నారు.
‘‘హెచ్చరిక’ చిత్రం నిర్మిస్తున్న టైంలో ఎవరో ‘మౌనరాగం’ స్టిల్స్ తీసుకొచ్చి నాకు చూపించారు. ఎంతో బావున్నాయనిపించింది. దర్శకుడు మణిరత్నం అని చెప్పారు. అప్పటికే మణిరత్నం ఓ స్థాయిలో పేరుప్రతిష్టలు సంపాదించుకున్నారు. స్టిల్స్ చూశాక సినిమా చూద్దామన్న ఆసక్తి కలిగింది. కథ చాలా సంక్లిష్టమైనది. అయినా దర్శకుడిగా మణిరత్నం అద్భుతంగా హేండిల్ చేశారు. అప్పుడే అనుకున్నాను మణితో కనీసం ఓ సినిమా అయినా చేయాలని. తర్వాత తనని కలసి, సినిమా చేయాలనుకుంటున్నానని చెప్పాను. కానీ మణిరత్నంని ఒప్పించడం చాలా కష్టం. ఎందుకంటే తను కథతో అంత సులభంగా రాజీపడలేడు. అందుకని నేను కూడా కొంత నిరీక్షించవలసి వచ్చింది. కానీ వెయిట్ చేసినా కూడా అందరూ మెచ్చుకునే కళాఖండం మిగిలింది. నాగార్జునగారితో నాకు అప్పటికే ఉన్న ేస్నహబంధం గీతాంజలి నిర్మాణానికి ఎంతగానో ఉపకరించిందని చెప్పాలి. గీతాంజలికి ముందే నాగార్జునగారివి కొన్ని సినిమాలు నేను పంపిణీ చేశాను. ఆయన టేస్ట్, కమిట్మెంట్, డెడికేషన్ నాకు బాగా నచ్చాయి. డిఫరెంట్ సినిమాలు చేయాలన్న నాగార్జునగారి అభిలాష, విభిన్నచిత్రాలను తీర్చిదిద్దాలన్న మణి తాపత్రయం గీతాంజలికి బాగా కలిసొచ్చాయి. కానీ, ఇంత గొప్ప చరిత్రను సృష్టిస్తుందని మాత్రం ఎప్పుడూ ఎవ్వరం ఊహించలేదు. బావుంది, బావుంటుంది, డెఫినెట్‌గా పే చేస్తుంది అన్న నమ్మకం తప్పితే అదో హిస్టరీ అవుతుందని
ఏ క్షణంలోనూ ఊహించలేకపోయాం. అసలు మణి కథ చెప్పినప్పుడైతే ఇదేంటి ఇలా... అనిపించింది. కానీ ఆయనలోని దీక్ష, నాగార్జునగారి మక్కువ రెండూ రెండు కళ్ళుగా ఇంత చరిత్రను చూశాయి. చూడగలిగాయి. హీరోయిన్ గురించి నేనూ మణిరత్నంగారూ బొంబాయి వెళ్ళి ప్రయత్నం చేశాం. ఎవ్వరూ ఆయనకి నచ్చలేదు. ఫ్రెష్ ఆర్టిస్ట్ అయితే మంచిదన్నది ఆయన దృక్ఫథం. హైదరాబాద్‌లో జూహీచావ్లా షూట్లో ఉందంటే ఇక్కడికి వచ్చాం. ఆమెను కూడా డైరెక్టర్ ఓకే చెయ్యలేదు. అడయార్లో ఉన్న థియసోఫికల్ సొసైటీలో డాన్స్ నేర్చుకోవడానికి మద్రాసు వచ్చింది గిరిజ. మరి ఆయనకి కాంటాక్ట్ ఎలా కుదిరిందో తెలియదు గానీ, ఆమెని మణిరత్నంగారే ఎంపిక చేశారు. కొందరు ఏసుదాసుగారిచేత పాడించమని అడిగారు గానీ, బాలూ గారితోనైతేనే బావుంటుందని అందరం భావించాం. బాలూ గారు నిజంగానే ప్రాణం పోశారు. వేటూరిగారు, ఇళయరాజాగారు, పి.సి.శ్రీరామ్‌గారు ఎవరికివారు సినిమాకి మూలస్తంభాలుగా నిలబడ్డారు. ఇద్దరు డిస్ర్టిబ్యూటర్లు వల్ల నేను విడుదల టైంలో చాలా ఇబ్బంది పడ్డాను. కాకపోతే నాకు ఫైనాన్స్ చేసిన ధర్మవరం ేస్నహితులు ధైర్యం చెప్పి విడుదల టైంలో ఎనలేని సాయం చేశారు. వాళ్ళ ఔదార్యం, సౌజన్యం ఎప్పటికీ మరచిపోలేను. చిరంజీవిగారికి షో వేసి చూపిేస్త ఆయనెంతగానో మెచ్చుకున్నారు. తెలుగులో మంచి సక్సెస్ అయింది. కానీ మణిరత్నంగారు తనకేమీ వద్దని తీసుకోలేదు. ఎందుకంటే అన్ని లెక్కలు ఆయన తెలుసుకుంటూ ఉండేవారు. అందుకని తమిళ్లో కూడా నన్నే చేసుకోమని చెప్పారు. అక్కడ అద్భుతమైన లాభాలు వచ్చాయి. ఆయన కారణంగానే అన్న కృతజ్ఞతతో సగానికి సగం ఆయనింటికి తీసుకువెళ్ళి ఇచ్చేశాను. ఆ అనుభవాలు, అనుభూతులు తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుంది.’’
- నాగేంద్రకుమార్
