పోర్టులో ఫైట్
ABN , First Publish Date - 2021-09-13T05:50:10+05:30 IST
అల్లు అర్జున్ మరోసారి ఏపీలోని తూర్పు గోదావరికి వెళ్లారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు....
అల్లు అర్జున్ మరోసారి ఏపీలోని తూర్పు గోదావరికి వెళ్లారు. సుకుమార్ దర్శకత్వంలో ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప’ తొలి భాగానికి సంబంధించిన చిత్రీకరణ చేస్తున్నారు. గతంలో మారేడుమిల్లి ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కించారు. మళ్లీ ఈ నెల తొలి వారంలో చిత్రబృందం అక్కడికి వెళ్లింది. కీలక ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఇటీవల అల్లు అర్జున్, కథానాయిక రష్మికా మందన్నపై శేఖర్ నృత్య దర్శకత్వంలో ఓ పాట చిత్రీకరించారు. ప్రస్తుతం కాకినాడ పోర్టులో యాక్షన్ దృశ్యాలు తెరకెక్కిస్తున్నట్టు తెలిసింది. మూడు రోజుల పాటు పోర్ట్ ఏరియాలో ఫైట్ తీయాలని ప్లాన్ చేశారట. మరో పది రోజుల పాటు కాకినాడ, మారేడుమిల్లి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ చేస్తారని తెలిసింది. దాంతో ఓ పాట మినహా తొలి భాగం చిత్రీకరణ పూర్తవుతుందట. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత ప్రత్యేక గీతం తెరకెక్కించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నెలాఖరుకు ‘పుష్ప: ద రైజ్’ చిత్రీకరణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ‘పుష్ప’ చిత్రీకరణ మధ్యలో లభించిన విరామ సమయంలో కాకినాడలోని థియేటర్‌లో ‘సీటీమార్’ చిత్రాన్ని అల్లు అర్జున్ వీక్షించారు.