ప్రతి ఒక్కరూ ఓ ప్రేమలేఖ రాస్తున్నారు

ABN , First Publish Date - 2021-12-28T05:52:00+05:30 IST

‘‘2021 చిత్రసీమకు చాలా కష్టంగా సాగింది. ఈ యేడాదిని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లాంటి విజయవంతమైన చిత్రంతో ముగించడం సంతోషంగా ఉంద’’న్నారు నాని...

ప్రతి ఒక్కరూ ఓ ప్రేమలేఖ రాస్తున్నారు

‘‘2021 చిత్రసీమకు చాలా కష్టంగా సాగింది. ఈ యేడాదిని ‘శ్యామ్‌ సింగరాయ్‌’ లాంటి విజయవంతమైన చిత్రంతో ముగించడం సంతోషంగా ఉంద’’న్నారు నాని. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం ‘శ్యామ్‌ సింగరాయ్‌’. రాహుల్‌ సంకృత్యాన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఈ చిత్రానికి వస్తున్న స్పందన పట్ల నాని సంతృప్తి వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌ మీట్‌లో నాని మాట్లాడుతూ ‘‘ఈ సినిమా విడుదలయ్యాక చాలా ఫోన్లు, సందేశాలు వచ్చాయి. సినిమా గురించి ఒకొక్కరూ ఒక్కో ప్రేమలేఖ రాస్తున్నారు. వాళ్లకు సినిమా అంత బాగా నచ్చింది. మంచి సినిమాలెప్పుడు వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారు. ఆ విషయం ఈ సినిమాతో మరోసారి నిరూపితమైంద’’న్నారు. కథానాయిక సాయిపల్లవి మాట్లాడుతూ ‘‘ఈ సినిమాని రెండోసారి థియేటర్లలోచూశా. ప్రేక్షకులు ఈ సినిమాని ఆస్వాదించడం గమనించాను. అది మాటల్లో చెప్పలేనంత సంతృప్తిని అందించింద’’న్నారు. ఆర్‌.నారాయణ మూర్తి మాట్లాడుతూ ‘‘శంకరాభరణం, మేఘసందేశంలా... ‘శ్యామ్‌ సింగరాయ్‌’ ఓ క్లాసిక్‌ సినిమా. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా కష్టపడి ఓ గొప్ప చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించినందుకు కృతజ్ఞతలు. నాని నా కంటికి తెలుగు అమీర్‌ఖాన్‌ లాంటి నటుడు. అఖండ, పుష్ప, శ్యామ్‌ సింగరాయ్‌ చిత్రాలతో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ప్రేక్షకులు కరోనా, ఓమైక్రాన్‌లకు భయపడడం లేదు. మంచి సినిమా వస్తే ఆదరిస్తున్నా’’రన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘పంపిణీదారుడిగా, నిర్మాతగా నా కెరీర్‌ ప్రారంభంలో హ్యాట్రిక్‌ విజయాల్ని అందుకున్నాను. కొవిడ్‌ తరవాత పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఈ దశలో.. ఈనెలలో నేను నైజాంలో పంపిణీ చేసిన మూడు సినిమాలూ సూపర్‌ హిట్‌ అవ్వడం ఆనందంగా అనిపించింద’’న్నారు. 

Updated Date - 2021-12-28T05:52:00+05:30 IST