ప్రతి ఇంట్లోనూ రాంబాబు లాంటి నాన్న ఉండాలి

ABN , First Publish Date - 2021-11-16T05:59:50+05:30 IST

మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యమ్‌’. తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేశారు. వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ‘దృశ్యమ్‌ 2’ కూడా అక్కడ హిట్టే. అందుకే సీక్వెల్‌ ని సైతం తెలుగులో ‘దృశ్యం 2’గా...

ప్రతి ఇంట్లోనూ రాంబాబు లాంటి నాన్న ఉండాలి

మలయాళంలో ఘన విజయం సాధించిన చిత్రం ‘దృశ్యమ్‌’. తెలుగులో అదే పేరుతో రీమేక్‌ చేశారు. వెంకటేష్‌, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ‘దృశ్యమ్‌ 2’ కూడా అక్కడ హిట్టే. అందుకే సీక్వెల్‌ ని సైతం తెలుగులో ‘దృశ్యం 2’గా తీసుకొస్తున్నారు. ఈనెల 25న అమేజాన్‌ ప్రైమ్‌లో ఈ చిత్రం విడుదల  కానుంది. సోమవారం హైదరాబాద్‌లో ట్రైలర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకటేష్‌ మాట్లాడుతూ ‘‘దృశ్యం లాంటి కథ, కథనాలు ఉన్న చిత్రం ఈమధ్య కాలంలో రాలేదు. ఇలాంటి సినిమాలో నటించడం నా అదృష్టం. ఇందులో పోషించిన రాంబాబు పాత్ర నా మనసుకు బాగా దగ్గరైంది. రాంబాబు తన కుటుంబం కోసం ఏమైనా చేస్తాడు. అలాంటి నాన్న ప్రతి ఇంట్లోనూ ఉండాలి. ఇంత అద్భుతమైన స్ర్కిప్టుని అందించిన జీతూ సోసెఫ్‌కి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. ఈ సినిమా నేను చూశా. చాలా బాగా నచ్చింది. ప్రేక్షకులూ ఆశీర్వదిస్తారన్న నమ్మకం ఉంద’’న్నారు. ‘‘వెంకటేష్‌ మంచి కోస్టార్‌ మాత్రమే కాదు. ఆత్మీయ మిత్రుడు కూడా. ఆయన దగ్గర నేను ఏమైనా మాట్లాడొచ్చు. నా సందేహాల్ని నివృత్తి చేసుకోవచ్చు. ఆ స్వేచ్ఛ నాకు ఇస్తారు’’ అన్నారు మీనా. దర్శకుడు జీతూ సోసెఫ్‌ మాట్లాడుతూ ‘‘దృశ్యమ్‌ తరవాత రాజమౌళి సార్‌ నుంచి నాకు ఓ మెసేజ్‌ వచ్చింది. అది చూసి నేను షాక్‌  లో ఉండిపోయా. రాజమౌళి నుంచి మెసేజ్‌ వచ్చిందని ఇంట్లోవాళ్లకు చెప్పినా నమ్మలేదు. ఆయన మాటలు నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపాయి. మాతృకతో పోలిస్తే.. తెలుగులో పెద్దగా మార్పులు చేయలేదు. ఎందుకంటే.. మలయాళంలోనే స్ర్కిప్టుని చాలా పకడ్బందీగా రాసుకున్నాం. కాబట్టి మార్చాల్సిన అవసరం రాలేదు. నాలుగైదు సన్నివేశాల్ని మాత్రం మాతృకతో పోలిస్తే భిన్నంగా తెరకెక్కించాం’’ అన్నారు.


Updated Date - 2021-11-16T05:59:50+05:30 IST