దసరా వచ్చింది... సందడి తెచ్చింది!

ABN , First Publish Date - 2021-10-18T09:51:15+05:30 IST

విజయదశమి వచ్చింది... తెలుగు చిత్రసీమలో సందడి తెచ్చింది! కొత్త సినిమా కబుర్లు... ప్రారంభోత్సవాలు... లుక్కులు... ఎటు చూసినా సందడి సందడి కనిపించింది. దాంతో చిత్ర పరిశ్రమ వ్యక్తుల్లో, ప్రేక్షకుల్లో సంతోషాలు వెల్లివిరిశాయి...

దసరా వచ్చింది... సందడి తెచ్చింది!

విజయదశమి వచ్చింది... తెలుగు చిత్రసీమలో సందడి తెచ్చింది! కొత్త సినిమా కబుర్లు... ప్రారంభోత్సవాలు... లుక్కులు... ఎటు చూసినా సందడి సందడి కనిపించింది. దాంతో చిత్ర పరిశ్రమ వ్యక్తుల్లో, ప్రేక్షకుల్లో సంతోషాలు వెల్లివిరిశాయి. దసరా సందర్భంగా ప్రకటించిన, ప్రారంభించిన కొత్త సినిమాల వివరాలివీ...


‘జెర్సీ’ దర్శకుడితో చరణ్‌ సినిమా

రామ్‌చరణ్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌, ఎన్వీఆర్‌ సినిమా సంస్థలు ఓ చిత్రం నిర్మించనున్నాయి. ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దీనికి దర్శకుడు. దీని తర్వాత ‘కె.జి.యఫ్‌’ ఫేమ్‌ ప్రశాంత్‌ నీల్‌తో సినిమా చేస్తారనే మాటలు వినిపించాయి. ఇటీవల చిరంజీవి, రామ్‌చరణ్‌ను దర్శకుడు కలవడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. అయితే... ప్రస్తుతానికి ప్రశాంత్‌ నీల్‌తో సినిమా లేదని,  భవిష్యత్తులో ఏదైనా ఉంటే ప్రకటిస్తామని చరణ్‌ పేర్కొన్నారు.


ద్విభాషా చిత్రాలు రెండు

దసరాకు సమంత రెండు కొత్త చిత్రాలు ప్రకటించారు. ఆమె ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ ఓ చిత్రం నిర్మించనున్నారు. నవంబర్‌లో చిత్రీకరణ మొదలుకానుంది. దీంతో హరి-హరీశ్‌ దర్శకులుగా పరిచయం కానున్నారు. ఇది కాకుండా... శంతనుబరున్‌ జ్ఞానశేఖరన్‌ దర్శకత్వంలో ఎస్‌ఆర్‌ ప్రభు, ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌ నిర్మించనున్న మరో చిత్రాన్ని సమంత అంగీకరించారు. రెండూ ద్విభాషా (తెలుగు, తమిళ) చిత్రాలే కావడం విశేషం.


గోదావరిఖనిలో ‘దసరా’

దసరాకు ‘దసరా’ పేరుతో నాని కొత్త సినిమా ప్రకటించారు. తెలంగాణలోని గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో కీర్తీ సురేశ్‌ కథానాయిక. శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వంలో సుధాకర్‌ చెరుకూరి నిర్మిస్తున్నారు. పండక్కి విడుదల చేసిన ప్రచార చిత్రంలో ‘ఈ దసరా నిరుడు లెక్క ఉండదు...’ అంటూ తెలంగాణ యాసలో నాని చెప్పిన డైలాగ్‌, ఆయన లుక్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. సాయికుమార్‌,  సముద్రఖని, జరీనా వాహబ్‌ నటించనున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌: అవినాశ్‌ కొల్లా, సంగీతం: సంతోష్‌ నారాయణన్‌. విజయదశమికి నాని హీరోగా నటిస్తున్న ‘శ్యామ్‌ సింగ రాయ్‌’ నుంచి కొత్త స్టిల్‌ విడుదల చేశారు. డిసెంబర్‌లో చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు వెల్లడించారు.   


నిఖిల్‌... సుధీర్‌వర్మ... మూడోసారి!

హీరో నిఖిల్‌, దర్శకుడు సుధీర్‌వర్మ మూడోసారి సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘స్వామి రారా’, ‘కేశవ’ చిత్రాలొచ్చాయి. తాజా చిత్రాన్ని బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మించనున్నారు. ఈ నెల 25న రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభించి, లండన్‌లో 40 రోజులు తొలి షెడ్యూల్‌ చేస్తామని నిర్మాత తెలిపారు. భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందనున్న ఈ చిత్రానికి కెమెరా: రిచర్డ్‌ ప్రసాద్‌, మ్యూజిక్‌: కార్తీక్‌.

Updated Date - 2021-10-18T09:51:15+05:30 IST