మూసధోరణికి భిన్నమైన పాత్రలు చేస్తా!
ABN , First Publish Date - 2021-09-13T05:46:33+05:30 IST
‘‘కథానాయికగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి విభిన్నమైన, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వచ్చాను. మున్ముందూ అదే పంథాలో వెళ్తూ, మూసధోరణికి దూరంగా, భిన్నంగా...

‘‘కథానాయికగా ప్రయాణం ప్రారంభించినప్పటి నుంచి విభిన్నమైన, విలక్షణమైన పాత్రల్లో నటిస్తూ వచ్చాను. మున్ముందూ అదే పంథాలో వెళ్తూ, మూసధోరణికి దూరంగా, భిన్నంగా... నటనకు ఆస్కారమున్న పాత్రలు పోషిస్తాను’’ అని నభా నటేశ్ అన్నారు. నితిన్‌కు జంటగా ఆమె నటించిన చిత్రం ‘మాస్ట్రో’. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డి నిర్మించారు. ఈ నెల 17న ఓటీటీలో విడుదల కానుంది. నభా నటేశ్ చెప్పిన విశేషాలివీ...
‘‘సరికొత్త ట్రెండ్‌కు నాంది పలికిన సినిమా ‘అంధాధున్’. హిందీలో విడుదలైనప్పుడే చూశా. తెలుగులో ఆ సినిమా రీమేక్‌లో అవకాశం రాగానే సంతోషంగా అంగీకరించా. హిందీలో రాధికా ఆప్టే పోషించిన పాత్రను తెలుగులో చేశా. కథ విన్నప్పుడు ఆమెలా చేయగలనా అనిపించింది. అయితే, సినిమా ఒప్పుకొన్నాక ‘అంధాధున్’ చూడలేదు. ఆ సినిమా ప్రభావం నాపై పడకూడదని అనుకున్నా. నా శైలిలో నటించా. నా పాత్రకు డబ్బింగ్ చెప్పాలనుకున్నా. కానీ, కుదరలేదు. వచ్చే ఏడాది ప్రయత్నిస్తాను.
నితిన్‌కు, నాకూ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది. మా పాత్రల చిత్రణ నవ్యపంథాలో ఉంటుంది. నితిన్ చాలా జాగ్రత్తలు తీసుకుని నటించారు. అంధుడిగా పాత్రలో పరకాయ ప్రవేశం చేశారు.
‘మాస్ట్రో’ చూస్తే రీమేక్‌లా కాకుండా పూర్తిగా కొత్తగా... స్ట్రయిట్ తెలుగు సినిమాలా ఉంటుంది. కథలో దర్శకుడు గాంధీ మార్పులు చేశారు. తెలుగు నేటివిటీకి తగ్గట్టు సన్నివేశాలను మలిచారు. ‘అంధాధున్’ చూసినవాళ్లకూ, ఈ సినిమా కొత్తగా అనిపిస్తుంది.
నా తదుపరి చిత్రాలకు సంబంధించిన వివరాలు త్వరలో దర్శక-నిర్మాతలు వెల్లడిస్తారు. మంచి కథ దొరికితే వెబ్‌సిరీస్‌లు చేయడానికి నేను సిద్ధమే’’ అన్నారు.