నాని మాటల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు: దిల్ రాజు
ABN , First Publish Date - 2021-12-28T02:13:00+05:30 IST
సినిమా రిలీజ్ సమయంలో నాని మాట్లాడిన విషయాన్ని చాలా మంది చాలా రకాలుగా నెగిటివ్‌గా తీసుకున్నారు. హీరోగా తను థియేటర్‌కు వచ్చి రెండేళ్లు అయ్యింది. థియేటర్స్‌కు రాకుండా నాని ఇబ్బంది పడ్డ సినిమా ‘వి’.. నేను నిర్మించిందే. ఆ సమయంలో

న్యాచురల్ స్టార్ నాని, సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మించిన ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌పుల్ టాక్‌తో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి దిల్ రాజు, ఆర్ నారాయణమూర్తి అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘గత రెండేళ్లలో కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నాం. ఇండస్ట్రీ ఎటు వెళుతుందో తెలియడం లేదు అని అనుకుంటున్న తరుణంలో ‘అఖండ, పుష్ప, శ్యామ్ సింగరాయ్’ సినిమాలను నైజాంలో విడుదల చేస్తే.. మూడు సూపర్ హిట్స్ అయ్యాయి. సినిమాపై ప్యాషన్‌తో ట్రావెల్ అవుతున్నప్పుడు ఇలాంటి విజయాలు ఎన్నో వస్తుంటాయి. డిస్ట్రిబ్యూషన్, నిర్మాతగా ఇలాంటి మ్యాజిక్‌ను చూసినప్పుడు చాలా ఎనర్జీ వస్తుంది. సినిమా రిలీజ్ సమయంలో నాని మాట్లాడిన విషయాన్ని చాలా మంది చాలా రకాలుగా నెగిటివ్‌గా తీసుకున్నారు. హీరోగా తను థియేటర్‌కు వచ్చి రెండేళ్లు అయ్యింది. థియేటర్స్‌కు రాకుండా నాని ఇబ్బంది పడ్డ సినిమా ‘వి’.. నేను నిర్మించిందే. ఆ సమయంలో ఇద్దరం చాలా ఇబ్బందులు పడ్డాం. చివరకు ఆలోచించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మారాలని నానితో నేను మాట్లాడి కన్విన్స్ చేశాను. ఓటీటీకి ఇచ్చాం. తర్వాత కూడా నాని ‘టక్ జగదీష్’ కూడా ఓటీటీలోనే విడుదల చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ నానిపై అభ్యంతరాలు చెప్పారు. అలా రెండు సినిమాల తర్వాత ఇప్పుడు థియేటర్స్‌కు తన సినిమా వెళుతున్నప్పుడు కష్ట పడ్డ వ్యక్తిగా నాని రియాక్ట్ అయ్యారు. నానిని ఎవరూ తప్పుగా అర్థం చేసుకోవద్దు. అసలు నాని ఆ సందర్భంలో చెప్పిన ఫీలింగ్ వేరు.. కానీ అది కమ్యూనికేట్ అయిన ఫీలింగ్ వేరు. దయచేసి ఎవరూ నెగిటివ్‌గా చూడవద్దు. అందులో ఉన్న ఇబ్బందిని మాత్రమే గమనించండి..’’ అని అన్నారు.