నేను సినిమాలు చేసుకుంటుంటే.. ఆయనేమో రైతుగా మారాడు: చిరంజీవి
ABN , First Publish Date - 2021-06-20T00:48:57+05:30 IST
ప్రస్తుతం నేను సినిమాలు తీస్తూ సినీ నటుడిగా కాలం వెళ్లదీస్తుంటే.. ఆయన మాత్రం రైతుగా అవతారమెత్తి వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ఆలయాలు పునర్నిర్మించడంతో పాటు కొత్త ఆలయాలు నిర్మించడం
అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠ పురంలో మాజీ మంత్రి రఘువీరారెడ్డి సారథ్యంలో నూతనంగా నిర్మిస్తున్న దేవాలయాలకు ప్రారంభోత్సవ సందర్భంగా సినీ నటుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. నా రాజకీయ ప్రస్థానంలో గొప్ప స్నేహితుడు రఘువీరారెడ్డి అని పేర్కొన్నారు. పరిచయమైన కొద్ది సమయంలోనే మంచి బాండింగ్ ఏర్పడిందని, రఘువీరాలోని ముక్కుసూటితనం.. ప్రజలకు సేవ చేయాలనే తలంపు, ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమాభిమానాలు మరువలేనివని అన్నారు. ప్రజా జీవితంలో రఘువీరారెడ్డి వంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అని చిరు కొనియాడారు.
ఇంకా చిరంజీవి మాట్లాడుతూ.. ''నేను నటించిన ఇంద్ర సినిమాలో కరువు సీమకు నీళ్లు ఇవ్వాలనే తపనతో తీసిన ఆ సినిమా ప్రేరణతోనే మాజీ మంత్రి రఘువీరా కరువు సీమకు నీళ్లు ఇవ్వడం ఆయనలోని రాజకీయ దార్శనికతకు అద్దం పడుతుంది. దాహం దాహం అంటూ అలమటిస్తున్న రాయలసీమకు నీళ్లు ఇవ్వడం.. ప్రారంభోత్సవ కార్యక్రమానికి నేను కూడా హాజరు కావడం మహద్భాగ్యం. ప్రస్తుతం నేను సినిమాలు తీస్తూ సినీ నటుడిగా కాలం వెళ్లదీస్తుంటే.. మాజీ మంత్రి రఘువీరా మాత్రం రైతుగా అవతారమెత్తి వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ఆలయాలు పునర్నిర్మించడంతో పాటు కొత్త ఆలయాలు నిర్మించడం కోసం పాటుపడుతున్నారు. రఘువీరాకు ఎల్లప్పుడూ ప్రజల సహకారంతో పాటు భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను.." అని అన్నారు.