తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే నా వినతి: చిరంజీవి

ABN , First Publish Date - 2021-09-20T02:58:31+05:30 IST

‘రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వినతిగా తెలియజేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నాను..’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. సెప్టెంబర్ 24న థియేటర్లలో..

తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇదే నా వినతి: చిరంజీవి

‘రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నా వినతిగా తెలియజేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీలో ఉన్న సమస్యలపై సానుకూలంగా స్పందించి పరిష్కారం చూపాలని కోరుతున్నాను..’ అన్నారు మెగాస్టార్ చిరంజీవి. యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి చిత్రయూనిట్‌కు ఆశీస్సులు అందించడంతో పాటు, కొన్ని రోజులుగా సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యలపై తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరారు. 


చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘చలన చిత్ర పరిశ్రమను కొన్ని దశాబ్దాలుగా పరిశీలిస్తే.. సక్సెస్ రేట్ 20 శాతం మాత్రమే. ఈ 20 శాతానికే సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంటుందని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఇబ్బందులు, కష్టాలు పడేవాళ్లు, రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికులు.. ప్రత్యక్షంగా వేలమంది, పరోక్షంగా లక్షలాదిమంది ఉన్నారు. ఇలాంటి వారందరూ కలిస్తేనే ఇండస్ట్రీ తప్ప.. ఓ ఐదారుగురు హీరోలో, ఐదారుమంది డైరెక్టర్లో, ఐదారుమంది నిర్మాతలో కలిస్తే కాదు సినిమా ఇండస్ట్రీ. వీళ్లంతా బాగున్నారు కదా.. అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. మెరిసేదంతా బంగారం కాదు అనే సామెత ఇక్కడ వర్తిస్తుంది. ఈ మధ్య కరోనాతో ఇండస్ట్రీ గురించి సుస్పష్టంగా తెలిసింది. 4, 5 నెలలు షూటింగ్స్ ఆగిపోతే.. కార్మికులు ఎంత ఇబ్బంది పడ్డారో అనేది మేము కళ్లారా చూశాం. మాకు తోచినట్లుగా హీరోలు, ఇండస్ట్రీలోని పెద్దల సహకారంతో కొన్ని కోట్లు కలెక్ట్ చేసి.. మూడు, నాలుగు నెలలు వారికి గ్రాసరీస్ అందించగలిగాం. ఆ తర్వాత లక్కీగా షూటింగ్స్ మళ్లీ మొదలయ్యాయి. అంతా కాస్త ట్రాక్‌లోకి వచ్చారు. కానీ ఒక నెల షూటింగ్ లేకపోతే ఎంతగా అల్లాడిపోయారో అనే విషయం ఈ సందర్భంగా చెప్పదలిచాను. కాబట్టి ఇండస్ట్రీ నిత్యం పచ్చగా ఉంటుందనుకుంటే పొరబాటే. 


అలాగే ఏ విపత్తు వచ్చినా, ఏ ప్రమాదం జరిగినా, భూకంపాలు వచ్చినా, వరదలు వచ్చినా ముందుగా స్పందించేది సినిమా ఇండస్ట్రీయే. అది గర్వంగా చెప్పగలను. అలాంటి ఇండస్ట్రీ ఈరోజున అటువంటి సంక్షోభాన్నే ఎదుర్కొంటుంది. సినిమా కాస్ట్ పెరిగిపోయింది. ఎక్కడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి లేదు. దీనికిగానూ ఈ లవ్‌స్టోరి వేదికగా రెండు ప్రభుత్వాలకు నేను విన్నవించుకుంటున్నాను. ఆల్రెడీ పెద్దలు నారాయణదాస్ గారి నేతృత్వంలో చర్చించడం జరిగింది. అంతగా కాస్ట్ పెరిగినప్పుడు ఎందుకు రెవిన్యూ రావడం లేదు అని చర్చించడం జరిగింది. కాబట్టి వినమ్రంగా రెండు ప్రభుత్వాలను అడుగుతున్నాను. ప్లీజ్.. దయచేసి కొంచెం సానుకూలంగా స్పందించి.. మా అభ్యర్థనలకు పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాను. మనం ఏ వస్తువునైనా చూసి కొంటాం. కూరగాయలు వంటివి కూడా ఇది బాగుందా? లేదా? అని చూసి కొంటాం. కానీ టికెట్ కొన్న తర్వాత చూసేది సినిమా మాత్రమే. అలా ప్రేక్షకులు ఎందుకు చూస్తున్నారంటే.. మా మీద నమ్మకం. మా మీద ఎంతో నమ్మకంతో వచ్చే వారిని డిజప్పాయింట్ చేయకూడదనే కష్టపడుతుంటాం. వారికి ది బెస్ట్ ఇవ్వాలని మా ప్రయత్నం చేస్తుంటాం. కొన్ని సార్లు మా టెస్ట్, నిర్ణయాలు కూడా తప్పి సినిమాలు ప్లాప్స్ అవుతుంటాయి. కానీ అందులో మోసం, దగా వంటివి మాత్రం లేవు. ఎక్కడో మేము అనుకున్నదానికి రీచ్ కాలేకపోతాం. అది మా తప్పిదం. అంతే కానీ ప్రేక్షకులకు వినోదం ఇచ్చేందుకు ఇండస్ట్రీ అంతా ఎంతో కష్టపడుతుంది. 


అటువంటి మాకు కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పుడు.. దయచేసి మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నాం. మేము ఆశకు అడగడం లేదు సార్.. అవసరం కోసం అడుగుతున్నాం.. అది మీరు ఒప్పుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేదంటే.. సినిమాలన్ని పూర్తయ్యి కూడా.. విడుదల చేయాలా? వద్దా? అనే సందిగ్థంలో పడిపోయాం. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా రిలీజ్ చేస్తే.. రెవిన్యూ వస్తుందా? రాదా? అసలే జనం థియేటర్లకి వస్తారా? రారా? అనేదానిపై ఇప్పుడిప్పుడే కాస్త ధైర్యం వస్తుంది. ఇలాంటి టైమ్‌లో ప్రభుత్వాలు కూడా సపోర్ట్ అందిస్తే.. మళ్లీ చిత్రపరిశ్రమ నిలదొక్కుకుంటుంది. రెండు ప్రభుత్వాలకు ఇది ఇండస్ట్రీ తరపున నా వినతిగా తెలియజేస్తున్నాను..’’ అన్నారు. 

Updated Date - 2021-09-20T02:58:31+05:30 IST