సాయిపల్లవి నాతో చేయను.. అన్నందుకు హ్యాపీ: చిరంజీవి

ABN , First Publish Date - 2021-09-20T01:33:41+05:30 IST

యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్

సాయిపల్లవి నాతో చేయను.. అన్నందుకు హ్యాపీ: చిరంజీవి

యువసామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరి’. సెప్టెంబర్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఆదివారం చిత్రయూనిట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో హీరోయిన్ సాయిపల్లవిని చిరంజీవి సరదాగా ఆటపట్టించారు. మెగాస్టార్ చిరంజీవితో సాయిపల్లవి నటించనని చెప్పిందట. చిరంజీవి చేస్తున్న ఓ చిత్రంలో చెల్లెలి పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించగా.. ఆమె నో చెప్పిందని, అందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు చిరంజీవి. 


ఈ వేదికపై మెగాస్టార్ మాట్లాడుతూ.. ‘‘ఇటీవల నేను చేయాలనుకున్న చిత్రంలో చెల్లిలి పాత్ర కోసం సాయిపల్లవిని సంప్రదించడం జరిగింది. అయితే ఆమె ఈ చిత్రంలో చేసేందుకు ఒప్పుకోలేదు. నాకు కూడా ఆమె అంగీకరించకుండా ఉంటేనే బాగుండు.. అనిపించింది. ఆమె చేయను అని చెప్పాక చాలా సంతోషం వేసింది. ఎందుకంటే అంతమంచి డ్యాన్సర్‌తో డ్యాన్స్ చేయాలని కోరుకుంటాను కానీ.. చెల్లెలిగా అంటే నాకే మనసు అంగీకరించలేదు. అంత మంచి డ్యాన్సర్ సాయిపల్లవి. ఫిదా సినిమా టైమ్‌లో కూడా వరుణ్ ఓ పాటను చూపించి.. నా డ్యాన్స్ ఎలా ఉంది అని అడిగాడు. అప్పుడు నేను.. నిన్ను చూడలేదురా.. సాయిపల్లవినే చూస్తుండిపోయాను అని చెప్పా. అందుకే సాయిపల్లవితో డ్యాన్స్ చేసి.. నేను కూడా డ్యాన్సర్‌నే అని ప్రూవ్ చేసుకుంటాను..’’ అని సరదాగా సాయిపల్లవిని ఆటపట్టించారు చిరు. 


చిరు మాట్లాడుతున్న సందర్భంలో సాయిపల్లవి మైక్ అందుకుని.. ‘‘మీ మాటలు చాలా గౌరవంగా భావిస్తున్నాను సార్. నిజంగా నేను మీ సినిమాలో చేయను అని చెప్పలేదు. నేను రీమేక్ సినిమాలను చేయకూడదనే నిర్ణయం తీసుకున్నాను. నా దగ్గరకు ఎవరు వచ్చినా.. ముందుగా నేను అడిగే ప్రశ్న.. ఈ చిత్రం రీమేకా? అని అడుగుతాను. అందుకే చేయనని చెప్పాను.. తప్ప వేరే ఎటువంటి ఉద్దేశ్యం లేదు సార్. తప్పకుండా మరో చిత్రంలో మీతో చేస్తాను..’’ అని సాయిపల్లవి వివరణ ఇచ్చింది.

Updated Date - 2021-09-20T01:33:41+05:30 IST