కథానాయికలే కానీ...!
ABN , First Publish Date - 2021-06-20T06:09:39+05:30 IST
కథానాయకుడు అంటే ఎవరు? కథను నడిపించే నాయకుడు! మరి, కథానాయిక? కథను నడిపించే నాయిక! అయితే కథానాయకుడికి జంటగా కనిపించే భామను కథానాయికగా చూడటం అలవాటైంది...
వీళ్లు కథానాయికలే. కానీ...
హీరోలతో రొమాన్స్ చేయడం లేదు!
కథతో, కథలోని పాత్రతో చేస్తున్నారు!
నాలుగు పాటలు, ఐదు సీన్లు కంటే...
కథలో పాత్రకు ప్రాముఖ్యం ఇస్తున్నారు.
ప్రయోగాలకు ముందడుగు వేస్తున్నారు.
కథానాయకుడు అంటే ఎవరు? కథను నడిపించే నాయకుడు! మరి, కథానాయిక? కథను నడిపించే నాయిక! అయితే కథానాయకుడికి జంటగా కనిపించే భామను కథానాయికగా చూడటం అలవాటైంది. అందాల భామలూ అటువంటి పాత్రల్లో నటించడానికి ఆసక్తి చూపించారు. ఇప్పుడు అటువంటి పాత్రలే కాదు... ఎటువంటి పాత్రలైనా చేస్తామంటున్నారు. కాకపోతే కథలో పాత్రకు ప్రాముఖ్యం, నటనకు ఆస్కారం ఉంటే చాలని అందాల భామలు కోరుతున్నారు. అటువంటి అవకాశాలు వస్తే... వదిలిపెట్టడం లేదు. ఒడిసి పట్టుకుంటున్నారు.
తొలిసారి నితిన్, తమన్నా కలిసి నటిస్తున్న చిత్రం ‘మాస్ట్రో’. అయితే, నితిన్‌కు తమన్నా జోడీగా నటించడం లేదు. హిందీ హిట్ ‘అంధాధున్’లో యాభై ఏళ్ల టబు చేసిన పాత్రను తెలుగులో చేస్తున్నారు. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసిన విషయమిది. ఎందుకంటే... తెలుగులో కథానాయికగా తమన్నాకు వచ్చిన ముప్పేమీ లేదు. ‘ఎఫ్-3’, ‘సీటీమార్’ చేస్తున్నారు. ఈ సమయంలో ప్రయోగాత్మక పాత్ర చేయాల్సిన అవసరం లేదు. కానీ, కొత్త తరహా పాత్రలు చేయాలనే తపనతో ‘మాస్ట్రో’ అంగీకరించారు. కమర్షియల్ కథానాయికగా పేరు తెచ్చుకున్న మరో అందాల భామ రాశీ ఖన్నా సైతం ప్రయోగాత్మక పాత్ర చేయడానికి ముందుకొచ్చారు. కానీ, అటువంటి పాత్ర చేసే అవకాశం ఆమెకు తెలుగులో రాలేదు. హిందీలో, అదీ ఓ వెబ్ సిరీ్‌సలో లభించింది. అజయ్ దేవగణ్ డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న వెబ్ సిరీస్ ‘రుద్ర’. అందులో రాశీ ఖన్నాది సైకో కిల్లర్ పాత్ర. నటిగా తనలో మరో కోణాన్ని చూపించడానికి ఆమె సిద్ధపడ్డారు. ఇటీవల ‘ద ఫ్యామిలీ మ్యాన్-2’ వెబ్ సిరీ్‌సలో సమంత కథానాయికగా కాకుండా... తీవ్రవాదిగా కనిపించిన సంగతి తెలిసిందే.
హిందీ చిత్రాలు, వెబ్ సిరీ్‌సలతో పేరు తెచ్చుకుని ‘గూఢచారి’తో తెలుగు తెరకు పరిచయమైన తెలుగమ్మాయి శోభితా ధూళిపాళ్ల. తొలి సినిమాలో హీరోను వలపు వలలో వేసుకున్న తీవ్రవాదిగా నటించారు. అడివి శేష్‌తోనే తెలుగులో తన రెండో చిత్రాన్నీ చేస్తున్నారామె. అయితే, ఇందులో శేష్ జంటగా నటించడం లేదు. ఉగ్రదాడి సమయంలో తాజ్ హోటల్‌లో చిక్కుకున్న మహిళగా కనిపించనున్నారు. వైవిధ్యమైన పాత్రకు ఓటు వేసిన మరో అందాల భామ ప్రియమణి. ‘నారప్ప’ చిత్రంలో వెంకటేశ్‌కు జోడీగా ఆమె నటిస్తున్నారు. రానా దగ్గుబాటి ‘విరాటపర్వం’లో మాత్రం కామ్రేడ్ భారతక్కగా కనిపించనున్నారు. గతంలో మణిరత్నం ‘విలన్’ (తమిళంలో ‘రావణన్’, హిందీలో ‘రావణ్’)లోనూ ప్రియమణి కథానాయికగా నటించలేదు. మరికొంతమంది ఈ బాటలో పయనించడానికి సిద్ధంగా ఉన్నారు.
కథానాయికగా కెరీర్ ప్రారంభించి... ప్రయోగాలకు, ప్రత్యేక పాత్రల వైపు మళ్లినవారిలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ను ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ‘క్రాక్’, ‘నాంది’ చిత్రాల్లో నటిగా ఆమె అభినయం అందర్నీ ఆకట్టుకుంది. తెలుగులో తాజాగా ఓ అగ్ర హీరో చిత్రంలోనూ ప్రధాన పాత్రలో నటించే అవకాశం అందుకున్నారు. మరో కథానాయిక పూర్ణ కూడా ప్రధాన పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆమె కంగనా రనౌత్ ‘తలైవి’లో శశికళగా కనిపించనున్నారు. వెంకటేశ్ ‘దృశ్యం-2’లో ఓ పాత్ర చేస్తున్నారు. ఓటీటీలో విడుదలైన ‘పవర్ ప్లే’లో ముఖ్యమంత్రి కుమార్తెగా కనిపించారు. ఈతరం కథానాయికలు ప్రయోగాత్మక పాత్రలకు ఓటు వేస్తుండటం శుభ పరిణామం. దీనివల్ల ప్రేక్షకులకు వాళ్లను కొత్త కోణంలో చూసే అవకాశం లభిస్తోంది. దర్శక, రచయితలకూ కొత్త పాత్రలు సృష్టించే వీలుకలుగుతోంది.
‘వకీల్ సాబ్’లో ముగ్గురు హీరోయిన్లు అంజలి, నివేదా థామస్, అనన్యా నాగళ్ల ప్రధాన పాత్రలు చేశారు. సినిమాలో ముగ్గురివీ హీరోయిన్ రోల్స్ కాదు. ‘ప్లే బ్యాక్’లోనూ అనన్యా నాగళ్ల హీరోయిన్ కాదు, ఆమెది ప్రధాన పాత్రే. ఈ ఏడాదే విడుదలైన ‘రెడ్’లో నివేదా పేతురాజ్, ‘జాంబీరెడ్డి’లో దక్షా నగార్కర్, ‘చెక్’లో సిమ్రాన్ చౌదరి, ‘మోసగాళ్లు’లో కాజల్ అగర్వాల్, ‘వైల్డ్ డాగ్’లో సయామీ ఖేర్, ‘ఏక్ మినీ కథ’లో శ్రద్ధా దాస్‌లవీ ప్రధాన పాత్రలే. ఆయా సినిమాల్లో వీళ్లెవరూ హీరోయిన్లుగా నటించలేదు. ‘మోసగాళ్లు’లో అయితే విష్ణు మంచు సోదరిగా కాజల్ అగర్వాల్ నటించారు. గతంలోనూ కొంతమంది కథానాయికలు సినిమాల్లో హీరోతో రొమాంటిక్ పాత్ర కాకపోయినా... కథకు కీలకమైన పాత్రలు చేశారు. ఈమధ్య ఆ ధోరణి పెరిగిందని చెప్పుకోవాలి.