బాయ్‌కాట్‌ కరీనాఖాన్‌!

ABN , First Publish Date - 2021-06-13T06:28:05+05:30 IST

సీత పాత్రలో నటించే అర్హత కరీనా కపూర్‌కు లేదంటున్నారు కొందరు నెటిజన్లు. అంతే కాదు... కరీనాను బాయ్‌కాట్‌ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తున్నారు....

బాయ్‌కాట్‌ కరీనాఖాన్‌!

సీత పాత్రలో నటించే అర్హత కరీనా కపూర్‌కు లేదంటున్నారు కొందరు నెటిజన్లు. అంతే కాదు... కరీనాను బాయ్‌కాట్‌ చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ చేస్తున్నారు. ఆమెపై అంత ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం... ‘సీత’ సినిమా. రామాయణాన్ని సీత కోణంలో చెబుతూ ఓ సినిమా తీయడానికి హిందీలో సన్నాహాలు జరుగుతున్నాయి. ‘సీత’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. దీనికి రచయిత వి. విజయేంద్రప్రసాద్‌ స్ర్కిప్ట్‌ అందిస్తున్నారు. అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకుడు. సీత పాత్రకు కరీనా కపూర్‌ పేరు పరిశీలనలో ఉంది. ఆమెను చిత్రబృందం సంప్రదించగా... రూ. 12 కోట్లు పారితోషికం డిమాండ్‌ చేసినట్టు ముంబై ఖబర్‌. దాంతో ట్విట్టర్‌లో కొంతమంది భగ్గుమన్నారు. ‘హిందూ దేవుళ్లను గౌరవించని నటి సీత పాత్ర చేయడానికి వీల్లేదు’ అని ఒకరు ట్వీట్‌ చేశారు. ‘కరీనా కపూర్‌ తన జీవితంలో ఎప్పుడూ రామాయణం చదివి ఉండదు. కానీ, సీతాదేవి పాత్రలో నటించాలనుకుంటోంది. బాలీవుడ్‌కు వ్యతిరేకంగా అందరం ఒక్కటవుదాం’ అని ఇంకొకరు ట్వీట్‌ చేశారు. సుశాంత్‌ మరణానికీ, ఈ చిత్రానికీ కొందరు ముడిపెడుతున్నారు. ఒకరు అలాగే కరీనా కపూర్‌ను శూర్పణకతో పోల్చారు మరికొందరు. ఇంకా పలు విధాలుగా విమర్శలు చేశారు. ముస్లిం అయిన సైఫ్‌ అలీ ఖాన్‌ను పెళ్లి చేసుకున్నందుకు సీతాదేవి పాత్రలో కరీనా కపూర్‌ నటించకూడదనేది మరికొందరి వాదన. ట్విట్టర్‌లో టాప్‌ ప్లేస్‌లో ‘బాయ్‌కాట్‌ కరీనాఖాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ శనివారం ట్రెండ్‌ అయ్యింది. దాదాపుగా రెండు లక్షల మంది ట్వీట్లు చేయడం గమనార్హం. ఈ ట్రోలింగ్‌పై గానీ, అసలు అంతకు ముందు ‘సీత’ సినిమాపై గానీ కరీనా కపూర్‌ స్పందించలేదు.


Updated Date - 2021-06-13T06:28:05+05:30 IST