ముంబయికి బిర్యానీలు మోసుకెళ్తూ ఉంటా
ABN , First Publish Date - 2021-08-14T05:30:00+05:30 IST
నలభీముల పాక ప్రావీణ్యాలను పరీక్షించే కుకింగ్ రియాలిటీ షోలలో మాస్టర్ చెఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది.
నలభీముల పాక ప్రావీణ్యాలను పరీక్షించే కుకింగ్ రియాలిటీ షోలలో మాస్టర్ చెఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది. అలాంటి తెలుగు వెర్షన్ మాస్టర్ చెఫ్ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటి తమన్నా హోస్ట్‌గా వ్యవహరిస్తోంది. స్వతహాగా భోజన ప్రియురాలైన తమన్నా ఆహారంపై తన అభిప్రాయాలను.. మరెన్నో ఆసక్తికరమైన విశేషాలను ‘నవ్య’తో పంచుకుంది..
ఆహారమే ప్రధానం!
నాకు ఆహారం అంటే ప్రాణం. అలాగే ఆరోగ్యానికీ సమ ప్రాధాన్యం ఇస్తాను. ఆహారం, ఆరోగ్యం ఈ రెండూ నా వ్యక్తిత్వంలో భాగాలు. నా దైనందిన జీవితంలో ఆహారానికే తొలి ప్రాధాన్యం. ఆహారం లేకుండా మన జీవితంలో ఏ ఒక్క సందర్భం ఉండదు. నా మటుకు నేను ఆహారాన్ని భిన్నమైన మార్గాల్లో నిరంతరంగా ఎక్స్‌ప్లోర్ చేస్తూనే ఉంటాను. ఏ కొత్త ప్రదేశానికి వెళ్లినా అక్కడి ‘థాలీ’ కోసం వెతుకుతూ ఉంటాను. నేనే కాదు. మన భారతీయ సంస్కృతిలో అందరూ ఆహారానికి ప్రాధాన్యం ఇస్తారు. పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండగ రోజు... ఇలా ఎలాంటి శుభ సందర్భంలోనైనా ఆహారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. భోజనంలో ఏం వడ్డించబోతున్నారు? రుచి బావుంటుందా? లేదా అనే కుతూహలం అందరిలోను ఉంటుంది. ఆహారం అంతలా మన జీవనశైలిలో భాగమైపోయింది. కాబట్టే కుకింగ్ షోలు కూడా రూపొందుతూ ఉన్నాయి.
చేపల పులుసు...
నాకిష్టమైన తెలుగు వంటకం చేపల పులుసు. అలాగే బిర్యానీ కూడా! నేను హైదరాబాద్ వచ్చిన ప్రతిసారీ నా ముంబయి స్నేహితులు బిర్యానీ తీసుకురమ్మని అడుగుతూ ఉంటారు. నేను వాళ్లకు బిర్యానీ మోసుకువెళ్తూ ఉంటా. నాకు స్వీట్లంటే కూడా చాలా ఇష్టం. పూతరేకులు నాకెంతో ఇష్టమైన స్వీట్. అయితే తినడమే తప్ప ఏ వంటకాన్నీ వండే ప్రయత్నం చేయలేదు. ఇంట్లో వంట చేస్తానంటే అమ్మ ఒప్పుకోదు. నా వంట మీద మా ఇంట్లో వాళ్లకు అంత నమ్మకం. అయితే ఈ కుకింగ్ షోను హోస్ట్ చేయటం వల్ల నాకు వంటలపై అవగాహన ఏర్పడింది. స్వయంగా వండగలననే నమ్మకం కలిగింది. ఈ సారి ఇంటికెళ్లినప్పుడు కచ్చితంగా గరిట తిప్పుతాను. నా వంటకు మొదట బలి కాబోయేవాళ్లు నా కుటుంబసభ్యులే!
నేను తెలుగు అమ్మాయినే!
నన్ను చాలా మంది తెలుగు అమ్మాయి అనుకుంటున్నారు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా నన్ను తెలుగు నటిగానే గుర్తిస్తారు. ఇంకా చెప్పాలంటే నేను మాట్లాడినంత తెలుగు కొందరు తెలుగు అమ్మాయిలు కూడా మాట్లాడలేరేమో! తెలుగు ఇండస్ట్రీతో ఏర్పడిన ఇన్నేళ్ల అనుబంధంతో నాకు నేను తెలుగమ్మాయినే అనే భావనలోనే ఉంటాను. తెలుగు ఇండస్ట్రీ అందించిన ప్రేమాభిమానాలు, ప్రోత్సాహం మరే ఇండస్ట్రీలోనూ నాకు దక్కలేదు. ఇది నాకు గర్వకారణం. తెలుగు ఇండస్ట్రీ నా టాలెంట్‌ని చూసిందే తప్ప, నేను ఎక్కడి నుంచి వచ్చాననేది పట్టించుకోలేదు. దేశంలో ఎక్కడికెళ్లినా తెలుగు నటిగానే గుర్తింపు, ఆదరణ దక్కించుకున్నాను.
గోగుమళ్ల కవిత
నాలుగు భాషల్లో...
ఈ నెలఖరు నుంచి జెమినీ టీవీలో ప్రసారమయ్యే మాస్టర్ చెఫ్ కార్యక్రమం- తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళ భాషల్లో రూపొందుతోంది. తెలుగు వెర్షన్ వ్యాఖ్యాత తమన్నా అయితే, తమిళంలో విజయ్ సేతుపతి, కన్నడంలో సుదీప్, మళయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరిస్తున్నారు.