థ్రిల్లర్‌ కోణంలో తండ్రీకూతుళ్ల అనుబంధం

ABN , First Publish Date - 2021-02-17T17:12:14+05:30 IST

నిజజీవితంలో తండ్రీకూతుళ్లుగా ఉన్న హీరో అరుణ్‌ పాండియన్‌, ఆయన కుమార్తె కీర్తి పాండియన్‌లు వెండితెరపై కూడా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తున్నారు.

థ్రిల్లర్‌ కోణంలో తండ్రీకూతుళ్ల అనుబంధం

గతంలో తండ్రీకూతుళ్ల అనుబంధంతో అనేక చిత్రాలు వచ్చి ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి. కానీ, తండ్రీకూతుళ్ల అనుబంఽధాన్ని  థ్రిల్లర్‌ కోణంలో తెరకెక్కించిన చిత్రాలు చాలా చాలా అరుదు. అలా నిర్మించిన చిత్రమే ‘అన్బిర్కినియాళ్‌’. ఈ చిత్రంలో నిజజీవితంలో తండ్రీకూతుళ్లుగా ఉన్న హీరో అరుణ్‌ పాండియన్‌, ఆయన కుమార్తె కీర్తి పాండియన్‌లు వెండితెరపై కూడా తండ్రీకూతుళ్ల పాత్రల్లో నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, సంభాషణలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదని చిత్ర దర్శకుడు గోకుల్‌ చెబుతున్నారు. చెన్నై, పాండిచ్చేరి తదితర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపినట్టు ఆయన తెలిపారు. 


ఈ చిత్రం కోసం ఓ ఫ్రీజర్‌ ఆడిటోరియం సెట్‌ను నిర్మించి, అందులో షూటింగ్‌ జరిపినట్టు చెప్పారు. ముఖ్యంగా కీర్తి పాండియన్‌ మైనస్‌ 12 డిగ్రీల చలిలో ఏమాత్రం బెదరకుండా నటించి, చిత్ర బృందాన్ని అబ్బురపరిచారన్నారు. ఈ చిత్రంలో కీర్తి పాండియన్‌ నటన అద్భుతంగా ఉందన్నారు. కొన్ని కీలక సన్నివేశాల్లో ఆమె ప్రదర్శించిన హావభావాలు ప్రతి ఒక్కర్నీ ఆకట్టుకుటాయన్నారు. దీనిని ఓ మంచి సందేశం ఇచ్చే చిత్రంగా తెరకెక్కించినట్టు దర్శకుడు  వెల్లడించారు. కాగా, ఈ చిత్రానికి డీవోపీగా మహేష్‌ ముత్తుస్వామి పనిచేయగా, సంగీత దర్శకుడుగా జావిద్‌ రియాజ్‌,  గేయరయితగా లలిత్‌ ఆనంద్‌ వ్యవహరిస్తున్నారు. మాటలను గోకుల్‌, జాన్‌ మహేంద్రలు సమకూర్చారు. 


Updated Date - 2021-02-17T17:12:14+05:30 IST