స్నేహంకోసం చేసిన సాహసం
ABN , First Publish Date - 2021-12-30T06:05:31+05:30 IST
‘అర్జున ఫల్గుణ’ పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులని ఆకట్టుకునే సరదా అంశాలతో పాటు అందర్ని కట్టిపడేసే భావోద్వేగాలు ఉన్నాయి’ అన్నారు హీరో శ్రీవిష్ణు...

‘అర్జున ఫల్గుణ’ పల్లెటూరి నేపథ్యంలో వస్తున్న పూర్తి వినోదాత్మక చిత్రం. ప్రేక్షకులని ఆకట్టుకునే సరదా అంశాలతో పాటు అందర్ని కట్టిపడేసే భావోద్వేగాలు ఉన్నాయి’ అన్నారు హీరో శ్రీవిష్ణు. ఆయన హీరోగా తేజా మార్ని దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా శ్రీ విష్ణు సినిమా గురించి మాట్లాడుతూ...
ఈ ఏడాది నాకు ఇది మూడో చిత్రం. నర్సీపట్నంలో జరిగిన యదార్థ ఘటనల స్ఫూర్తితో దర్శకుడు కథ అల్లుకున్నారు. తేజ మార్ని కథ చెప్పినప్పుడు సినిమాను చక్కగా హ్యాండిల్ చేయగలడు అనిపించింది. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో సాగుతుంది. స్నేహంకోసం ఓ మిత్రబృందం చేసిన సాహసం చుట్టూ కథ ప్రధానంగా తిరుగుతుంది. ఇలాంటి కథతో 55 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం దర్శకత్వ ప్రతిభకు నిదర్శనం.
కొన్ని పేర్లు విన్నప్పుడు, తలుచుకున్నప్పుడు పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. అలాంటి పేరే ‘అర్జున ఫల్గుణ’. గోదావరి జిల్లాల నేపథ్యంలో పూర్తి స్థాయి చిత్రం చేయాలనే కోరిక ఈ సినిమాతో నెరవేరింది. నా సంభాషణలు కూడా గోదావరి యాసలోనే సాగుతాయి. పూర్తి ఎటకారంగా ఉంటాయి.
సినిమాలో మన పద్ధతులు, సంప్రదాయాలు చూపిస్తాం. గ్రామ వాలంటీర్ల గురించి ట్రైలర్‌లో పలికిన సంభాషణలను తప్పుగా అర్థం చేసుకున్నారు. సినిమా చూశాక ఆ పాత్ర ప్రాఽధాన్యం అర్థమవుతుంది. ఏ సీన్ అయినా వివాదం అవుతుందనుకుంటే తొలగించమని ముందు నేనే చెబుతాను.
‘రంగస్థలం’ మహేష్, చైతన్య, అమృతా అయ్యర్ అందరి పాత్రలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. సంగీత దర్శకుడు ప్రియదర్శన్ అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చాడు. సుధీర్ రాసిన డైలాగ్స్ ఈ నాటి పరిస్థితులకు అద్దం పడతాయి.
ప్రస్తుతం ‘భళా తందనానా’, లక్కీ మీడియాలో పోలీసాఫీసర్ బయోగ్రఫీతో ఓ చిత్రం చేస్తున్నాను.