సినిమాలోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ నాకు నేను చెప్పుకునే పదం ‘తగ్గేదే లే’: అల్లు అర్జున్
ABN , First Publish Date - 2021-04-08T04:51:05+05:30 IST
అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేయడమేకాదు.. వారితో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందో చెప్పండి అని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్

‘‘అభిమానుల సమక్షంలో టీజర్‌ను విడుదల చేయడమేకాదు.. వారితో కలిసి పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏముంటుందో చెప్పండి. ప్రతి అభిమానికి థాంక్స్. నిజంగా అదృష్టవంతుడ్ని. నా జీవితాన్ని అభిమానులకు అంకితం చేసుకుంటున్నాను’’ అని అన్నారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఇంట్రడ్యూస్ పుష్పరాజ్ కార్యక్రమంలో భాగంగా, పుష్ప సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా ఆయన ఇంకా మాట్లాడుతూ ‘‘ నాకు ఈ బర్త్‌డే చాలా స్పెషల్. అంత స్పెషల్ కావడానికి రెండు కారణాలున్నాయి. అందులో ముందుది టీజర్. పుష్ప.. తగ్గేదే లే. రెండో విషయం.. నా లైఫ్ టేకాఫ్ అయ్యిందే ఆర్యతో. సుకుమార్‌గారి వల్ల. ఆ సినిమా వల్ల నాకు స్టైలిష్ స్టార్ అనే పేరొచ్చింది. ఇక నా ఫ్యూచరంతా, ఉండేలా కొత్త పేరు వచ్చింది. నాకు ఆర్య ఇచ్చినందుకు, ఐకాన్ స్టార్ అనే కొత్త పేరు ఇచ్చినందుకు సుకుమార్‌గారికి థాంక్స్. సుకుమార్‌గారు నాకేమిచ్చిన స్పెషల్‌గా, ఎప్పుడూ గుర్తుండిపోయేలా ఉంటుంది. ఈసారి కూడా గుర్తుండిపోయే గిఫ్ట్‌ను అందించారు.
పుష్ప సినిమాలో హీరో ఊతపదం తగ్గేదే లే. కానీ నిజ జీవితంలోనూ నాకు నేనుగా ఈ మాట చెప్పుకుంటూ ఉంటాను. అందరిలాగానే, నాకు భయాలుంటాయి. భయపడ్డ ప్రతిసారీ ధైర్యం చేసి ముందడుగు వేసెయ్, పడిపోయిన పర్లేదు, ఫెయిల్ అయినా పర్లేదు..తగ్గేదే లే అని అనుకుంటాను. అలా అనుకున్నాను కాబట్టి, ఇంత వరకు రాగలిగాను. తెలుగు సినిమా ఈరోజు ఇంత పెద్ద మార్కెట్ క్రియేట్ అయ్యిందంటే తెలుగు ప్రేక్షకులతో పాటు ఇతర భాషలకు చెందిన, ఇతర దేశాల్లోని ప్రేక్షకాభిమానులే కారణం. రానున్న పాతికేళ్లలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ప్రపంచంలోనే నెంబర్ వన్ ఇండస్ట్రీగా ఎంటర్‌టైన్ చేస్తుంది. దానికి ప్రేక్షకాభిమానులే కారణం. నిర్మాతలు నవీన్, రవిగారు, సతీష్‌గారు, ప్రవీణ్‌గారికి థాంక్స్. టెక్నీషియన్స్‌కు, దేవిశ్రీ ప్రసాద్‌కు థాంక్స్. తను ఇచ్చే ఆడియో వింటే తగ్గేదే లే అని అనుకుంటారు’’ అన్నారు.
