‘అసలేం జరిగింది’ ట్రైలర్ వదిలిన అల్లరి నరేష్
ABN, First Publish Date - 2021-03-26T02:05:04+05:30
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింన చిత్రం ‘అసలేం జరిగింది’. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన వాస్తవిక సంఘటనల ఆధారంగా రూపొందింన చిత్రం ‘అసలేం జరిగింది’. ఈ చిత్రం మంచి విజయం సాధించాలని కోరారు ప్రముఖ నటుడు అల్లరి నరేష్. తాజాగా ఆయన ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల అనంతరం ఆయన.. ఎక్సోడస్ మీడియా నిర్మించిన ఈ చిత్ర ట్రైలర్ ఆద్యంతం ఆకర్షణీయంగా ఉందన్నారు. కెమెరామెన్ అయిన ఎన్వీఆర్ దర్శకుడిగా విజయవంతం కావాలని, ఈ చిత్రం ద్వారా ఎక్సోడస్ మీడియాకి మంచి డబ్బులొచ్చి మరిన్ని ఆసక్తికరమైన చిత్రాలు నిర్మించాలని ఆకాంక్షిస్తున్నట్లుగా తెలిపారు.
ఈ సందర్భంగా నిర్మాత మైనేని నీలిమా చౌదరి మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తేనే బాగుంటుందనే ఉద్దేశ్యంతో.. ఓటీటీలో కాకుండా థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, ట్రైలర్ విడుదల చేసిన అల్లరి నరేష్‌గారికి చిత్రయూనిట్ తరపును ధన్యవాదాలని తెలుపగా.. మరో నిర్మాత కింగ్ జాన్సన్ కొయ్యడ మాట్లాడుతూ.. కంటికి కనిపించని కరోనా వైరస్‌తో ప్రపంచమంతా పోరాటం చేస్తోంది. మరి, వైరస్ లాంటి ఓ అదృశ్య శక్తితో చేసిన పోరాటమే తమ చిత్రమన్నారు.
చిత్ర దర్శకుడు ఎన్వీఆర్ మాట్లాడుతూ.. కొత్త తరహా కాన్సెప్టుతో తెరకెక్కించిన ఈ మాస్ చిత్రం ప్రేక్షకుల్ని థ్రిల్‌కు గురి చేస్తుందన్నారు. ట్రైలర్ విడుదల చేసి.. చిత్రయూనిట్ శుభాకాంక్షలు తెలిపిన అల్లరి నరేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లు టేక్మాల్ శ్రీకర్ రెడ్డి, కుమారస్వామి సంగ, హ్యారీ సిల్వెస్టర్, కొయ్యడ నితిన్, మాస్టర్ కింగ్ జో, వాసు తదితరులు పాల్గొన్నారు.