అయోధ్య రామ మందిరానికి అక్షయ్ కుమార్ విరాళం!

ABN , First Publish Date - 2021-01-18T17:49:16+05:30 IST

అయోధ్య రామమందిర నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనంతుగా విరాళాన్ని ఇచ్చినట్లు ప్రకటించాడు. అంతేకాకుండా దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి శక్తివంచన..

అయోధ్య రామ మందిరానికి అక్షయ్ కుమార్ విరాళం!

ముంబై: అయోధ్య రామమందిర నిర్మాణానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ తనంతుగా విరాళాన్ని ఇచ్చినట్లు ప్రకటించాడు. అంతేకాకుండా దేశ ప్రజలంతా రామాలయ నిర్మాణానికి శక్తివంచన లేకుండా విరాళాలివ్వాలని, ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చాడు. ఈ మేరకు అక్షయ్ కుమార్ ఓ వీడియోను తన ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. వీడియోను ‘జై శ్రీరాం’ అనే నినాదంతో అక్షయ్ పూర్తి చేశాడు. అయితే తాను ఎంత మొత్తంలో విరాళం ఇచ్చాడనే విషయాన్ని మాత్రం అక్షయ్ కుమర్ ప్రకటించలేదు. 


గతేడాది ఆగస్టులో ప్రధాని నరేంద్రమోదీ అయోధ్య రామమందిరానికి స్వయంగా భూమిపూజ చేశారు. ఆలయ నిర్మాణానికి నిధుల సేకరణ కోసం రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టును ఏర్పాటు చేయడం జరిగింది. అయితే విదేశాల నుంచి నిధులు సేకరించేందుకు ట్రస్టుకు అనుమతి లేదని, పూర్తి దేశీ నిధులతోనే ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఆలయ ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ చెప్పారు. దాదాపు 36 నెలల నుంచి 40 నెలల సమయంలో రామమందిరం ఏర్పాటు పూర్తవుతుందని, సాధారణ ప్రజలు ఇచ్చే విరాళాల సేకరణ కోసం పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు.


ఇదిలా ఉంటే అయోధ్య రామమందిర నిర్మాణం అనేకమంది సెలబ్రిటీలు, ప్రముఖులతో పాటు సామాన్యులు కూడా విరాళాలు అందజేస్తున్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఈ అద్భుత ఆలయ నిర్మాణానికి తమవంతుగా సాయం చేయాలని సోషల్ మీడియా వేదికగా పిలుపునిస్తున్నారు. ఇటీవలే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కూడా అయోధ్య రామమందిరం నిర్మాణానికి తనవంతుగా వ్యక్తిగత ఖాతా నుంచి రూ.5 లక్షల విరాళం ప్రకటించారు. ఇటీవలే రామజన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టు బృందాన్ని కలిసిన రాష్ట్రపతి విరాళం చెక్కును అందజేశారు.


ఇదిలా ఉంటే కరోనా సమయంలో పీఎం కేర్స్ ఫండ్ కోసం అక్షయ్ ఏకంగా రూ.25 కోట్ల మేర విరాళం ప్రకటించారు. ఈ విరాళం అప్పట్లో పెద్ద సంచలనంగా నిలిచింది. దీంతో ఇప్పుడు అయోధ్య రామాలయ నిర్మాణానికి కూడా అక్షయ్ భారీగానే విరాళం ఇచ్చి ఉంటాడని వార్తలు వినిపిస్తున్నాయి.



Updated Date - 2021-01-18T17:49:16+05:30 IST