‘మా’ అధ్యక్ష బరిలో సీనియర్ నటి హేమ
ABN , First Publish Date - 2021-06-23T20:50:59+05:30 IST
సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. 'మా' అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీలో నిలవగా.. తాజాగా ఈ ఎన్నికలలో

సెప్టెంబర్‌లో జరగనున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు మరింత రసవత్తరంగా మారబోతున్నాయి. 'మా' అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే ముగ్గురు పోటీలో నిలవగా.. తాజాగా ఈ ఎన్నికలలో నేనూ బరిలోకి దిగుతున్నానని ప్రకటించారు సీనియర్ నటి హేమ. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, యువహీరో మంచు విష్ణు, సీనియర్ నటీమణి జీవితా రాజశేఖర్‌లు ఇప్పటికే ఈ పోటీకి సిద్ధమవుతుండగా.. ఇప్పుడు నాలుగో పోటీదారుగా సీనియర్ సహాయ నటి హేమ పేరు ఖరారైంది. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలలో నన్ను సపోర్ట్ చేసిన వారందరి కోరిక మేరకు ఈసారి అధ్యక్ష పదవి కోసం పోటీకి దిగుతున్నానని హేమ తెలుపుతున్నారు.
ఈ సందర్భంగా హేమ మాట్లాడుతూ.. ''మాలో గత కొన్నేళ్లుగా `మా` ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా పదవులు చేపట్టాను. ఆ పదవులకు న్యాయం చేశాను. ఈసారి కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మా అసోసియేషన్ ఎన్నికలు రానే వచ్చాయి. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. ఎలక్షన్ ముందు ఆలోచన ఇది. కానీ ఆలోచన మారింది. ఎలక్షన్‌ని ప్రకటించగానే ప్రకాష్ రాజ్ గారు, మంచు విష్ణు బాబు, జీవితగారు పోటీ చేస్తున్నారని తెలిసింది. పెద్దలంతా ఎలక్షన్ బరిలో దిగుతున్నారని తెలిశాక.. పెద్దల వివాదాల్లో మనమెందుకు చిక్కుకోవాలి.. పోటీపడాలి.. అసలు పోటీ చేయవద్దనే అనుకున్నాను. నిన్నటి ప్రకటన అనంతరం సినీప్రముఖుల నుంచి ఒత్తిడిని ఎదుర్కొన్నాను. నేను ఉపాధ్యక్షురాలిగా పోటీ చేసినప్పుడు నా స్నేహితులు ముఖ్యంగా లేడీ సపోర్టర్స్, నన్ను మెజారిటీతో గెలిపించిన సినీ ప్రముఖులంతా ఫోన్ చేసి నువ్వెందుకు పోటీ చేయకూడదు.. నువ్వుంటే బాగుంటుంది. ఎవరైనా కష్టాలు చెప్పుకోవాలన్నా అర్థరాత్రి ఫోన్ చేసినా అందుబాటులో ఉంటావు.. అందుకే నువ్వు కావాలి అని అడుగుతున్నారు. నన్ను పోటీ చేయమని నా వాళ్లంతా ఒత్తిడి చేస్తున్నారు. ఇండిపెండెంట్‌గా పోటీ సమయంలో నాకు అండగా నిలిచిన వారందరికోసం, నా వారి కోసం మా ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను.." అని తెలిపారు.