ప్రేక్షకులు లేకుండా జరిగిన ప్రపంచ సినిమా పండగ

ABN , First Publish Date - 2021-04-27T06:10:51+05:30 IST

ప్రేక్షకులు లేకుండా జరిగిన ప్రపంచ సినిమా పండగ

ప్రేక్షకులు లేకుండా జరిగిన ప్రపంచ సినిమా పండగ

రెండు వేదికలపై అవార్డుల ప్రదానం

అవార్డ్‌ గెలుచుకున్న తొలి ఆసియన్‌ దర్శకురాలు..

దక్షిణ కొరియా నటికి దక్కిన అరుదైన గౌరవం

కరోనా వైరస్‌  గత ఏడాది ప్రపంచ సినిమాను ముప్పుతిప్పలు పెట్టడమే కాకుండా, ప్రతి ఏడాది అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఆస్కార్‌ వేడుక కూడా వాయిదా పడేలా చేసింది. 


గత ఏడాది ఫంక్షన్‌ డేట్‌ రెండు సార్లు వాయిదా పడడంతో ఈ సారి కూడా ఉంటుందా లేదా అనే ఉత్కంఠ చివరి క్షణం వరకూ కొనసాగింది. ఎట్టకేలకు ఆదివారం రాత్రి ఆస్కార్‌ వేడుక జరిగింది.


ఆస్కార్‌ అవార్డ్స్‌ వేడుక అంటేనే హంగులు, ఆర్భాటం, గ్లామర్‌ తళుకులు, ప్రేక్షకుల కేరింతలు. అయితే ఈ సారి మాత్రం ఆ సందడి కరువైంది. కరోనా కారణంగా ప్రేక్షకులు లేకుండా కేవలం సెలబ్రిటీలను మాత్రమే ఈ సారి వేడుకలకు ఆహ్వానించారు. పరిమిత సంఖ్యలో ఉన్న సెలబ్రిటీల కరతాళ ధ్వనుల మధ్య విజేతలు ఈ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకొన్నారు. 


మరో విషయం ఏమిటంటే ఆస్కార్‌ చరిత్రలోనే మొదటిసారిగా రెండు ప్రదేశాల్లో ఈ ఫంక్షన్‌ నిర్వహించారు. లాస్‌ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లోనూ, యూనియన్‌ స్టేషన్‌లోనూ ఈ వేడుక జరిగింది. 


అలాగే నిబంధనల ప్రకారం అన్ని జాగ్రత్తలు తీసుకొని విజేతలు, ఆహ్వానితులను ఆడిటోరియంలోకి అనుమతించారు. అయితే ఫొటోలు తీస్తున్నప్పుడు మాత్రం ముఖానికి ఉన్న మాస్క్‌ తొలిగించడానికి పర్మిషన్‌ ఇచ్చారు. 


నోమడ్‌ ల్యాండ్‌కు మూడు అవార్డులు

ఇక అవార్డుల విషయానికి వస్తే.. మహిళా దర్శకులు చోలే ఝావో దర్శకత్వం వహించిన ‘నోమడ్‌ ల్యాండ్‌’ ఉత్తమ చిత్రంగా ఎన్నికైంది. అంతేకాదు ఈ చిత్రానికి మరో రెండు అవార్డులు.. ఉత్తమ నటన, దర్శకత్వం.. కూడా లభించడం విశేషం. చైనాలో పుట్టి పెరిగినా, అమెరికాలో చిత్రాలు రూపొందించే చోలే ఝావోకు దర్శకురాలిగా ఇది మూడో చిత్రం. ఆస్కార్‌ గెలుచుకొన్న తొలి ఆసియన్‌ దర్శకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు.


83 ఏళ్ల  ఉత్తమ నటుడు

అలాగే 83 ఏళ్ల వయసులోనూ తన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఆంథోని హాప్కిన్స్‌ ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఓ విశేషం. 


‘ద ఫాదర్‌’ చిత్రంలో జ్ఞాపకశక్తి కోల్పోయిన వృద్ధుని పాత్రలో అద్భుతంగా నటించిన ఆంథోనిని ఆస్కార్‌ అవార్డ్‌ వరించింది. ఇది ఆయనకు ఉత్తమ నటుడిగా రెండో ఆస్కార్‌ అవార్డ్‌ కావడం విశేషం. అయితే ఈ అవార్డ్‌ ఫంక్షన్‌కు ఆంథోని హాజరు కాలేదు. అలాగే ముచ్చటగా మూడోసారి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డ్‌ అందుకొన్నారు ఫ్రాన్సెస్‌ మెకడోర్మెండ్‌. 63 ఏళ్ల వయసు కలిగిన ఫ్రాన్సెస్‌ ‘నోమడ్‌ ల్యాండ్‌’లో భర్తను కోల్పోయిన మహిళ పాత్రను అద్భుతంగా పోషించారు.


ప్రముఖులకు నివాళులు

గత సంవత్సర కాలంలో కన్నుమూసిన ప్రముఖులకు ఆస్కార్‌ వేదికపై నివాళులు అర్పించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే ఈసారి కూడా ఇటీవల కన్నుమూసిన ఐయాన్‌ హామ్‌, సీన్‌ కానరీ, ఇర్ఫాన్‌ ఖాన్‌, ఆస్కార్‌ అవార్డ్‌ పొందిన తొలి భారతీయ మహిళ భాను అథాయియాలకు ఈ వేదిక మీద నివాళులు అర్పించారు. అయితే ఈ జాబితాలో రిషీ కపూర్‌, సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ పేర్లు లేకపోవడంతో వారి అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆస్కార్‌ ఉత్తమ డైరక్టర్‌గా మహిళ : చోలే ఝావోకు అరుదైన గౌరవం

ఆస్కార్‌ అవార్డుల చరిత్రలో రెండోసారి ఒక మహిళకు బెస్ట్‌ డైరక్టర్‌ అవార్డు దక్కింది. నోమడ్‌ల్యాండ్‌ సినిమాకు దర్శకత్వం వహించిన చైనాకు చెందిన చోలే ఝావోకు ఈ అరుదైన గౌరవం లభించింది. 2010లో హర్ట్‌ లాకర్‌ అనే సినిమాకు దర్శకత్వం వహించినందుకు కేథరిన్‌ బౌగిలోవ్‌కు ఈ అవార్డు లభించింది. ఇప్పటి దాకా కేవలం ఏడుగురు మహిళలు మాత్రమే బెస్ట్‌ డైరక్టర్‌ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. ఈ సారి ఝావోతో పాటుగా ‘ప్రామిసింగ్‌ యంగ్‌ ఉమెన్‌’ సినిమాకు దర్శకత్వం వహించిన ఎమరాల్డ్‌ ఫెన్నల్‌ కూడా ఈ అవార్డుకు నామినేట్‌ అయ్యారు. అయితే అవార్డు మాత్రం ఝావోను వరించింది. ‘‘ప్రతి వ్యక్తిలోనూ మంచితనం.. ఇతరులకు మేలు చేసే గుణాలు ఉంటాయి. వాటిని అంటిపెట్టుకొని ఉండాలన్నా.. వాటి ద్వారా ఇతరులకు మేలు చేయాలన్నాచాలా ఆత్మసైర్థ్యం కావాలి. ఎన్ని ఆటుపోటులు ఎదురైనా ఽధైర్యంగా ముందుకు వెళ్లే సాహసం ఉండాలి. అలాంటి వారందరికీ ఈ అవార్డును అంకితమిస్తున్నాను. నేను ముందుకు వెళ్లటానికి మీరే స్ఫూర్తి’’ అని ఆమె తన ఆస్కార్‌ స్పీచ్‌లో పేర్కొన్నారు. నోమడ్‌ల్యాండ్‌కు ఈ సారి గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డుల్లో బెస్ట్‌ డైరక్టర్‌, క్రిటిక్స్‌ ఛాయిస్‌ అవార్డులు కూడా లభించాయి. ఆస్కార్‌ అవార్డుల్లో ఎడాప్టెడ్‌ స్ర్కీన్‌ప్లే, ఫిల్మ్‌ ఎడిటింగ్‌, బెస్ట్‌ పిక్చర్‌ కేటగిరిలకు ఈ చిత్రం నామినేట్‌ అయింది.


సంచారిగా జీవిత శోధన

రచయిత్రి, జర్నలిస్ట్‌ జెస్సికా బ్రూడర్‌ 2017లో రాసిన ‘నోమడ్‌ ల్యాండ్‌: సర్వైవింగ్‌ అమెరికా ఇన్‌ ట్వంటీ ఫస్ట్‌ సెంచరీ’ అనే పుస్తకం ఆధారంగా ‘నో మడ్‌ ల్యాండ్‌’ చిత్రాన్ని దర్శకులు చోలే ఝావో తెరకెక్కించారు. మొత్తం 108 నిమిషాల నిడివి ఉన్న చిత్రం ఇది. ఫ్రాన్సెస్‌ మెక్‌ డోర్మెండ్‌, లిండా మే, డేవిడ్‌, స్వాంకీ ప్రధాన పాత్రలు పోషించారు. ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి విభాగాల్లో పురస్కారాలను దక్కించుకుంది. బతుకుతెరువును వెతుక్కునేందుకు రోడ్డున పడి సంచార జీవితం గడిపితే ఎలా ఉంటుందో తెరపై హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించారు. అమెరికాలో ఆర్థిక మాంధ్యంతో దెబ్బతిన్న సమయంలో మధ్యతరగతి వ్యక్తుల జీవితాలను ప్రతిబింబించారు. ఆ సమయంలో ఉపాధి వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వలసలు పోయిన వారి జీవితాలు ఎలా సాగాయనేది సహజంగా తెరకెక్కించారు దర్శకులు చోలే ఝావో. ఆర్థిక మాంద్యంతో ఫెర్న్‌ అనే మహిళ పనిచేసే కంపెనీ మూతపడుతుంది. భర్త చనిపోవటం, పిల్లలు లేకపోవటంతో కొద్దిపాటి డబ్బుంటే దాంతో ఓ వ్యాన్‌ను కొంటుంది. దాన్నే ఇల్లులా మార్చుకొంటుంది. 60 ఏళ్ల వయసులో పని వెతుక్కుంటూ తన ప్రయాణం మొదలుపెడుతుంది. ఆ క్రమంలో ఆమె పలు ప్రాంతాలకు వెళుతుంది. అక్కడే దొరికిన పని చేసుకొని కాలం గడుపుతుంది. అలా వెళ్లిన ప్రతిచోటా ఆమెకు కొత్త స్నేహితులు పరిచయమవుతుంటారు. ఆ ప్రయాణంలో ఆమెకు ఎలాంటి వ్యక్తులు తారసపడ్డారు? ఎలాంటి అనుభవాలు ఎదుర్కొంది? స్థిరమైన ఉద్యోగం లేకపోవటం, ప్రకృతి విపత్తులను తట్టుకొని ఆమె ఎలా మనుగడ సాగించింది అనేది స్థూలంగా కథ. ఈ సినిమాలో కొన్ని సంఘటనలు కంటతడి పెట్టిస్తే, మరికొన్ని ఆలోచింపజేస్తాయి.


ముదిమిలోనూ మెప్పించారు

తొమ్మిది పదులకు పైగా ఉన్న ఆస్కార్‌ చరిత్రలో దక్షిణ కొరియా నుంచి ఓ నటి నామినేట్‌ అవడం ఈ ఏడాదే తొలి సారి. అంతేకాదు నామినేట్‌ అయిన తొలిసారే అవార్డ్‌ సాధించడం మరో  రికార్డ్‌. 74 ఏళ్ల యువాన్‌ యు జంగ్‌ ఈ ఘనత సాధించారు. ఉత్తమ చిత్రం కేటగిరిలో ఈ ఏడాది ఆస్కార్‌కు నామినేట్‌ అయిన అమెరికన్‌ చిత్రం ‘మీనారీ’లో ఆమె బామ్మ పాత్ర పోషించారు. అమెరికా కల నెరవేర్చుకోవడానికి వలస వచ్చిన ఓ దక్షిణ కొరియా కుటుంబం చుట్టూ తిరిగే కథతో ఈ చిత్రం రూపుదిద్దుకొంది. ఐదు దశాబ్దాలుగా చిత్రరంగంలో ఉన్న యువాన్‌ ఇప్పటివరకూ వందకు పైగా సినిమాలు, ఎన్నో  టీవీ సీరియల్స్‌లో నటించారు. ఆస్కార్‌ బరిలో తనకు పోటీగా ఉన్న ఐదుగురు నటీమణులను అధిగమించి, ఉత్తమ సహాయ నటిగా అవార్డ్‌ సాధించారు. తన అభిమానుల కల నెరవేర్చారు.Updated Date - 2021-04-27T06:10:51+05:30 IST