రెపరెపలాడిన చిన్న సినిమా
ABN , First Publish Date - 2021-12-28T05:58:44+05:30 IST
చిత్రసీమ పునాది చిన్న సినిమాలపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే యేడాదికి వంద సినిమాలు విడుదలైతే అందులో చిన్న సినిమాల వాటా 90 శాతం ఉంటుంది. దాన్ని బట్టి...

చిత్రసీమ పునాది చిన్న సినిమాలపైనే ఆధారపడి ఉంది. ఎందుకంటే యేడాదికి వంద సినిమాలు విడుదలైతే అందులో చిన్న సినిమాల వాటా 90 శాతం ఉంటుంది. దాన్ని బట్టి... చిన్న సినిమాల ప్రభావం ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఓ చిన్న సినిమా హిట్టయితే - వరుసగా పాతిక సినిమాలు కొబ్బరికాయలు కొట్టుకుంటాయి. కొత్త నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణులు... చిత్రసీమలో ధైర్యంగా అడుగుపెడతారు. కార్మికులకు పని దొరుకుతుంది. అలా... ఇండ్రస్ర్టీ కళకళ లాడుతుంది. ఈ యేడాది ఇప్పటి వరకూ దాదాపుగా 180 చిత్రాలొస్తే... అందులో 150 చిత్రాల్ని ఆక్రమించుకున్నాయి చిన్న సినిమాలు. కొన్ని మరపురాని విజయాలు సొంతం చేసుకుని పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని అందించాయి. ఒక్కసారి ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే...
రూపాయి పెట్టుబడి పెడితే, రూపాయి తిరిగి రావడమే అసలైన విజయం. పెట్టుబడి రాబట్టగలిగితే నిర్మాతలు సేఫ్. అలాంటిది... రూపాయికి రెండు రూపాయలు సంపాదిస్తే - చిన్న సినిమా సగర్వంగా తలెత్తుకున్నట్టే. ‘ఉప్పెన’తో అదే జరిగింది. మైత్రీ మూవీస్ నిర్మించిన సినిమా ఇది. ఈ సినిమాతో వైష్ణవ్‌తేజ్ తెరపైకొచ్చారు. కథానాయిక కృతిశెట్టికీ ఇదే తొలి సినిమా. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ‘ఉప్పెన’తోనే అరంగేట్రం చేశారు. ఈ ముగ్గురి జాతకాల్ని తిరగరాసింది ‘ఉప్పెన’. కొత్తవాళ్లతో తెరకెక్కించినా సరే, బడ్జెట్ విషయంలో మైత్రీ మూవీస్ వెనుకంజ వేయలేదు. దేవిశ్రీ ప్రసాద్ లాంటి సాంకేతిక నిపుణులు తోడవ్వడంతో సెట్స్‌పై ఉండగానే ఈ సినిమాకి క్రేజ్ వచ్చింది. యువతరానికి నచ్చేలా ఈ ప్రేమకథని మలచడంలో బుచ్చిబాబు విజయం సాధించాడు. బాక్సాఫీసు దగ్గర ఈ చిత్రం భారీ వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాతో కృతి ఒక్కసారిగా ఫేమ్‌లోకి వచ్చేసింది. బుచ్చిబాబుకి ఏకంగా ఎన్టీఆర్‌తో పనిచేసే ఛాన్స్ దక్కింది.
ఈ యేడాది మ్యాజిక్ చేసిన మరో చిన్న సినిమా ‘జాతిరత్నాలు’. నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించిన చిత్రమిది. దర్శకుడు నాగ అశ్విన్ నిర్మించారు. కొత్త తరహా వినోదం పంచిన ‘జాతిరత్నాలు’ బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించుకుంది. అత్యధిక లాభాలు పొందిన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. కేవలం రూ.4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.60 కోట్లు సాధించిందని ట్రేడ్ వర్గాలు లెక్కగట్టాయి. ఈ యేడాది బాక్సాఫీసు దగ్గర మెరిసిన మరో చిన్న సినిమా ‘ఎస్.ఆర్.కల్యాణమండపం’. కొవిడ్ సమయంలో.. ఈ చిత్రానికి మంచి ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ నిర్మాతలు మాత్రం ధియేటర్లో విడుదల చేయడానికే మొగ్గు చూపించారు. వాళ్ల నిరీక్షణ మంచి ఫలితాన్నే ఇచ్చింది. కిరణ్ అబ్బవరం డిమాండ్ ఈ సినిమాతో మరింత పెరిగిపోయింది. ఇప్పుడు తనే బిజీ హీరో అయిపోయాడు.
కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన చిత్రం ‘పెళ్లి సందడి’. ఓ సూపర్ హిట్ చిత్రానికి సీక్వెల్ కావడం, శ్రీకాంత్ తనయుడు రోషన్ నటించడంతో.. ఈసినిమాకి క్రేజ్ వచ్చింది. పైగా కీరవాణి అందించిన పాటలన్నీ పాపులర్ అయ్యాయి. దానికి రాఘవేంద్రరావు శైలి తోడయ్యింది. యువతరం ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఆదరించడంతో మంచి వసూళ్లని రాబట్టింది. యాంకర్ ప్రదీప్ కథానాయకుడిగా పరిచయమైన ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’ కూడా నిర్మాతలకు లాభాల్ని తెచ్చిపెట్టింది. ‘రాజ రాజ చోర’, ‘వరుడు కావలెను’ కూడా మంచి చిత్రాల జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. వరుస పరాజయాల తరవాత నరే్‌షకు ‘నాంది’ కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఈ కోర్ట్ రూమ్ డ్రామా ప్రేక్షకుల్ని కదిలించింది. ఈ సినిమా బాలీవుడ్‌లోనూ రీమేక్ అవుతోంది.
ఓటీటీలోనూ చిన్న చిత్రాలు విరివిగా విడుదలయ్యాయి. వాటిలో ‘ఏక్ మినీ కథ’కు ఆదరణ దక్కింది. యూవీ క్రియేషన్స్ నిర్మించిన సినిమా ఇది. ఓటీటీకి ఇచ్చినా సరే, నిర్మాతలకు మంచి లాభాలొచ్చాయి. మరో చిన్న సినిమా ‘సినిమా బండి’ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. తక్కువ బడ్జెట్‌లో, పూర్తిగా కొత్తవాళ్లతో తెరకెక్కిన ఈ చిత్రం టాక్ ఆఫ్ ది ఇండ్రస్ర్టీగా మారింది. ఓటీటీల వల్ల చిన్న సినిమాలు చాలా వరకూ గట్టెక్కాయి. ప్రేక్షకులకు ఏమేరకు నచ్చాయి? అనేది పక్కన పెడితే... ఓటీటీల ద్వారా చిన్న సినిమాలు పెట్టుబడుల్ని, కొంతమేర లాభాల్ని రాబట్టుకున్నాయి. వచ్చిన సినిమాలతో పోలిస్తే.. విజయవంతమైన చిత్రాల సంఖ్య తక్కువే కావచ్చు. కానీ... ఈ విజయాలు పరిశ్రమకు అందించిన భరోసా మాత్రం చాలా గొప్పది. ఈస్ఫూర్తి కొత్త యేడాదిలోనూ కొనసాగాలని ఆశిద్దాం.