‘ఆధార్’పై అభ్యంతరాలు ఏమిటి?
ABN , First Publish Date - 2021-07-26T09:21:28+05:30 IST
బెంగాలీ దర్శకుడు సుమన్ ఘోష్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘ఆధార్’. సెన్సార్ కార్యక్రమాలు 2019లోనే పూర్తయ్యాయి...
బెంగాలీ దర్శకుడు సుమన్ ఘోష్ తెరకెక్కించిన హిందీ సినిమా ‘ఆధార్’. సెన్సార్ కార్యక్రమాలు 2019లోనే పూర్తయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే, ఆధార్ కార్డులు జారీచేసే భారత ప్రభుత్వ సంస్థ ‘ద యునీక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా’ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో విడుదల కాలేదు. ఇప్పటికీ సమస్య పరిష్కారం కాలేదు. దీనిపై సుమన్ ఘోష్ మాట్లాడుతూ ‘‘ప్రభుత్వ సంస్థలో సభ్యులు సినిమా చూశారనీ, 28 కట్స్ విధించారని చిత్రనిర్మాణసంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్ నాకు ఫోనులో తెలిపింది. ఆ కట్స్ ఏమిటన్నది ఇప్పటివరకూ చెప్పలేదు. ఆరు నెలలుగా అధికారులను, ప్రభుత్వాన్ని సంప్రదించే ప్రయత్నం చేస్తున్నాం. కానీ, కుదరడం లేదు. నేను ఫోనులు చేశా. ఈ-మెయిల్స్ పంపించా. అటునుంచి స్పందన రావడం లేదు. వాళ్లకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే... సినిమా విడుదలను అడ్డుకోవడం కంటే కూర్చుని మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవచ్చు. ఈ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఫ్రస్ట్రేషన్ వస్తోంది’’ అని చెప్పారు.