మారుమూల గ్రామం నుంచి మోడల్‌గా ఎదిగిన ఈ భామ.. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఊహించని పని చేసి వార్తల్లోకి..!
ABN , First Publish Date - 2021-12-16T18:29:57+05:30 IST
సెలబ్రిటీలుగా పేరు గడించిన ఎంతోమంది కెరీర్ చివరి దశలో ఉందని భావించినప్పుడూ రాజకీయాల్లోకి రావడం ఎప్పటినుంచో చూస్తున్నదే...
సెలబ్రిటీలుగా పేరు గడించిన ఎంతోమంది కెరీర్ చివరి దశలో ఉందని భావించినప్పుడూ రాజకీయాల్లోకి రావడం ఎప్పటినుంచో చూస్తున్నదే. కానీ పీక్స్‌లో ఉన్నప్పుడు మాత్రం ఆ రంగాలన్ని వదిలి ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో పాలిటిక్స్‌లోకి దిగడం మాత్రం చాలా అరుదు. అలాంటి గొప్ప నిర్ణయాన్నే తీసుకుంది గుజరాత్‌కి చెందిన సూపర్ మోడల్ ఏష్రా పటేల్. మారుమూల గ్రామం నుంచి మోడల్‌గా ఎదిగిన ఈ భామ.. కెరీర్ పీక్స్‌లో ఉండగా ఊహించని విధంగా వార్తల్లో నిలిచింది.
త్వరలో గుజరాత్‌లోని 6000 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఎలాగైనా గెలవాలని వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో ముంబైకి చెందిన ఓ సూపర్ మోడల్ గ్లామర్ ప్రపంచం నుంచి బయటపడి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ప్రస్తుతం ఆమె ఇంటింటికీ తిరుగుతూ, తన ఆశయ సాధన కోసం ప్రచారం చేస్తూ, సర్పంచ్ పదవికి తనకు ఓటేయాలని స్థానికులను అభ్యర్థిస్తోంది.
గుజరాత్‌లోని ఛోటా ఉదయపూర్ ప్రాంతంలోని సాయిఖేడా తహసీల్‌లో సీటు కోసం పోటీ చేస్తోంది ఏష్రా పటేల్. కవితా గ్రామానికి జనరల్ కేటగిరీలో సర్పంచ్ పదవికీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొట్టమొదటి మహిళ ఈ మోడలే. ఈ గ్రామంలో పుట్టి మోడల్‌గా మంచి స్థాయిని అందుకున్న ఈ భామ.. స్వగ్రామం కోసం పీక్స్‌లో ఉన్న కెరీర్‌ని వదిలేయానుకుంటోంది.
ఈ ఆకస్మిక నిర్ణయం గురించి ఏష్రా మాట్లాడుతూ.. ‘లాక్‌డౌన్ సమయంలో చాలా రోజులు మా గ్రామంలోనే ఉన్నాను. ఆ సమయంలో ఇక్కడ చాలా మందికి కోవిడ్ 19 వచ్చింది. కానీ డబ్బు లేకపోవడం, మహమ్మారి గురించి అవగాహన లేకపోవడం వల్ల సరైన చికిత్స తీసుకోలేకపోయారు. ప్రజల స్థితిగతులను గమనించి, వారికి ఏలాగైనా సహాయం చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకే సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను' అని ఆమె తెలిపింది.
గ్రామంలో ఎక్కువ మంది రైతులేనని, అనేక సమస్యలపై ఒత్తిడికి గురవుతున్నారని ఏష్రా చెప్పింది. పల్లె బాగుంటేనే ప్రజలు బాగుపడతారని ఈ నిర్ణయం తీసుకోవడానికి అదో కారణామని ఆమె తెలిపింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. ‘నేను చాలా దేశాలకు వెళ్లాను. ప్రపంచం చాలా అభివృద్ధి చెందింది కానీ నా గ్రామం అభివృద్ధి చెందలేదని అర్థం అయ్యింది. అందుకే ఇక్కడి ప్రజల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నాన' అని పేర్కొన్నారు.