Salman Khan : ‘ఆ పాము’ ఇప్పుడు నా ఫ్రెండ్... తనతో కలసి ఫోటో కూడా తీసుకున్నా!
ABN , First Publish Date - 2021-12-27T21:22:09+05:30 IST
పాము కాటు తరువాత అసలు ఏం జరిగిందో సల్మాన్ స్వయంగా వివరించాడు. అయితే, ఆయన చెప్పిన ఒక్క విషయం మాత్రం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది...
డిసెంబర్ 27... బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ బర్త్ డే. అయితే, తన 57వ జన్మదినం జరుపుకుంటోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పుట్టిన రోజుకు సరిగ్గా ఒక్క రోజు ముందు పెద్ద గండం నుంచీ క్షేమంగా బయటపడ్డాడు. కండల వీరుడు తన ఫామ్ హౌజ్‌లో పొలం పనులు చేసుకుంటుండగా పాము కాటేసింది. అయితే, అది విష సర్పమే అయినప్పటికీ ఆరు గంటల చికిత్స తరువాత వైద్యులు ఆసుపత్రి నుంచీ సల్మాన్‌ని డిశ్చార్జ్ చేసేశారు. ఆందోళన పడాల్సిన పని లేదని చెప్పారు.
పాము కాటు తరువాత అసలు ఏం జరిగిందో సల్మాన్ స్వయంగా వివరించాడు. అయితే, ఆయన చెప్పిన ఒక్క విషయం మాత్రం ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. సల్మాన్ ఖాన్ హాస్పిటల్‌కి వెళ్లి వచ్చాక కూడా ఆయనని కాటేసిన పాము ఇంకా ఫామ్‌హౌజ్‌లోనే కనిపించిందట. ‘‘మా చెల్లెలు బాగా భయపడిపోయింది. కానీ, నేను నా ‘ఆ పాము’తో చక్కగా స్నేహం చేశాను! దానితో కలసి ఓ ఫోటో కూడా తీసుకున్నాను! అసలు తను నన్ను కాటేయటానికి కారణం అది కూడా బెదిరిపోయి ఉండటమే...’’ అంటూ వివరించాడు భాయ్‌జాన్. ఈ మొత్తం స్నేక్ ఎపిసోడ్ చివర్లో సదరు పాముని దగ్గర్లోని అడవిలో వదిలి వేసి వచ్చారట సల్మాన్ మనుషులు...