బజరంగీ 2వ పార్ట్ టైటిల్ ప్రకటించిన సల్మాన్ ఖాన్
ABN , First Publish Date - 2021-12-27T21:46:08+05:30 IST
సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘‘ బజరంగీ భాయిజాన్ ’’. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సల్లూ భాయ్

సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘‘ బజరంగీ భాయిజాన్ ’’. ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో సల్లూ భాయ్ బజరంగీ భాయిజాన్‌కు సీక్వెల్‌ను ప్రకటించారు. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ బజరంగీకి కథను అందించారు. తాజాగా సీక్వెల్‌కు కూడా ఆయనే కథను అందిస్తారని చెప్పారు. సీక్వెల్‌కు సంబంధించిన స్ర్కిఫ్ట్ వర్క్ జరుగుతోందని తెలిపారు. బజరంగీకి కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు. కరీనాకపూర్, నవాజుద్దీన్ సిద్దీఖీ కీలక పాత్రల్లో నటించారు. 2015, జులై 17న విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది.
సల్మాన్ 56వ పుట్టినరోజును డిసెంబర్ 27న పన్వేలీలోని ఫామ్ హౌస్‌లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. బజరంగీ 2వ పార్ట్ టైటిల్‌ను ప్రకటించారు. ఆ సీక్వెల్‌కు పవన్ పుత్ర భాయిజాన్ టైటిల్ పెట్టామని చెప్పారు. ‘‘ నేను రాజమౌళితో ఏ చిత్రం చేయట్లేదు. కానీ, అతడి తండ్రి విజయేంద్రప్రసాద్‌తో మాత్రం పనిచేస్తున్నాను. బజరంగీ భాయిజాన్‌కు విజయేంద్రప్రసాద్ కథను అందించారు. పవన్ పుత్ర భాయిజన్కు కూడా ఆయనే కథను అందించబోతున్నారు. సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిఫ్ట్ వర్క్ పూర్తి కాగానే సినిమా షూటింగ్‌ను ప్రారంభిస్తాం. ఆ లోపు టైగర్ 3, కబీ ఈద్, కబీ దివాళీ సినిమాల షూటింగ్‌ను పూర్తిచేస్తాను. నో ఎంట్రీ సీక్వెల్ కూడా చేస్తున్నాను. టైగర్ వచ్చే ఏడాది క్రిస్మస్ కానుకగా విడుదల అవుతోంది ’’ అని సల్మాన్ ఖాన్ చెప్పారు.