Karan Johar : 20 - 30 కోట్లు అడిగే ‘అటువంటి వారి’తో నేను విసిగిపోయాను!
ABN , First Publish Date - 2021-12-28T22:42:14+05:30 IST
బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ తాజా ఇంటర్వ్యూలో కొందరు నటీనటుల వ్యవహారంతో తనకు విసుగుపుట్టేసిందని తెలిపాడు...

బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ తాజా ఇంటర్వ్యూలో కొందరు నటీనటుల వ్యవహారంతో తనకు విసుగుపుట్టేసిందని తెలిపాడు. వారు నిరంతరం తమ రెమ్యూనరేషన్ పెంచుతూ పోవటమే ఆయన అసహనానికి కారణమట. పోనీ వాళ్లేమన్నా కాకలు తీరిన సీనియర్ యాక్టర్సా అంటే... అదీ కాదు. అందరూ నిన్నగాక మొన్న వచ్చిన కొత్త ముఖాలేనట!
‘‘బాక్సాఫీస్ వద్ద ఇంకా తమ సత్తా చాటని కొత్త తరం నటీనటులు కొందరున్నారు. వాళ్లు ఎలాంటి కారణం లేకుండానే 20-30 కోట్లు అడుగుతున్నారు’’ అంటూ తనకు ఎదురైన అనుభవాన్ని వివరించిన కరణ్... ‘‘ఆ యాక్టర్స్‌కి వాళ్ల రిపోర్ట్ కార్డ్ చూపించాలనిపిస్తుంది. మీ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయని చెప్పాలనిపిస్తుంది’’ అన్నాడు. బీ-టౌన్‌లో ధర్మా ప్రొడక్షన్స్ అధినేతగా ప్రస్తుతం కేజో స్టార్ ప్రొడ్యూసర్ హోదాలో కొనసాగుతున్నాడు. ఆయనపై నెపోటిజమ్ ఆరోపణలు ఉన్నప్పటికీ ఇండస్ట్రీకైతే కొత్త టాలెంట్‌ని పరిచయం చేశాడు. ఆలియా భట్, వరుణ్ ధావన్, సిద్ధార్థ్ మల్హోత్రా, జాన్వీ కపూర్, అనన్య పాండే, తారా సుతారియా... వీళ్లంతా ఆయన చిత్రాలతోనే లైమ్ లైట్‌లోకి వచ్చారు. అయితే, కరణ్‌ని కోట్ల రూపాయల పారితోషికం అడిగి ఇబ్బంది పెట్టిన ఆ న్యూ అండ్ యంగ్ యాక్టర్స్ ఎవరో మాత్రం ఆయన చెప్పలేదు. ఈ స్టార్ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ ఎవర్ని టార్గెట్ చేస్తూ ‘20-30 కోట్ల’ కామెంట్ చేశాడో మరి...