మాకూ వ్యాక్సిన్లు కావలెను!

ABN , First Publish Date - 2021-05-15T04:21:34+05:30 IST

కరోనా రెండో దశ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో చిత్రీకరణలకు వచ్చేసరికి కొన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహమ్మారి కొవిడ్‌-19 వైరస్‌ బారిన...

మాకూ  వ్యాక్సిన్లు కావలెను!

వ్యాక్సిన్‌... వ్యాక్సిన్‌... వ్యాక్సిన్‌...

కరోనా నుంచి కాపాడే రక్షణ కవచం.

అందుకనే...‘మాకూ  వ్యాక్సిన్లు కావాలెను’

అంటోంది హిందీ చిత్ర పరిశ్రమ!

వీలైనంత త్వరగా కార్మికులకు, సిబ్బందికి

వ్యాక్సిన్లు వేయించే ప్రయత్నాలు ప్రారంభించింది.


కరోనా రెండో దశ తర్వాత హిందీ చిత్ర పరిశ్రమలో చిత్రీకరణలకు వచ్చేసరికి కొన్ని మార్పులు చోటు చేసుకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహమ్మారి కొవిడ్‌-19 వైరస్‌ బారిన ఎవరూ పడకుండా ఉండటానికి నటీనటులు, సాంకేతిక నిపుణులు, కార్మికులు, నిర్మాణ సంస్థల్లో సిబ్బంది... అందరికీ వ్యాక్సిన్లు వేయించాలని నిర్ణయించారు. ఆ దిశగా చకచకా పావులు కదుపుతున్నారు.


సెట్‌కి వచ్చే వారందరికీ వ్యాక్సినేషన్‌ పూర్తి కాకుండా చిత్రీకరణ గురించి ఆలోచించడం ఆసాధ్యమని రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సీఈవో షిబాసిష్‌ సర్కార్‌  అంటున్నారు. చిత్రబృందం అంతటికీ వ్యాక్సినేషన్‌ మినహా కరోనా ముప్పును ఎదుర్కొవడానికి శాశ్వత పరిష్కారం లేదనేది ఆయన చెప్పే మాట. రిలయన్స్‌ ఎంటరటైన్‌మెంట్‌ సిబ్బందికి వ్యాక్సిన్లు కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే, కరోనా టీకాలు లభించడం లేదనీ, అదే పెద్ద సమస్యగా మారిందని షిబాసిష్‌ చెబుతున్నారు. ఆస్పత్రులు, లాబరేటరీలు, టీకా ఉత్పత్తి చేసే సంస్థలతో రిలయన్స్‌ టీమ్‌ సంప్రదింపులు జరుపుతోంది.



బీటౌన్‌ బడా నిర్మాణ సంస్థల్లో ఒకటైన యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్‌ అధినేత ఆదిత్యా చోప్రా తమ  కంపెనీలో పని చేసే అందరికీ వ్యాక్సిన్‌ వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు ఆయనో విజ్ఞప్తి చేశారు... తమ సంస్థ 30 వేల వ్యాక్సిన్లు కొనుగోలు చేయడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ! అనుమతి లభిస్తే, అందరికీ వ్యాక్సిన్లు వేయిస్తారు. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇండియన్‌ మోషన్‌ పిక్చర్స్‌ అసోసియేషన్‌, ఫెడరేషన్‌ ఆఫ్‌ వెస్ట్రన్‌ ఇండియా సినీ ఎంప్లాయిస్‌,  ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆఫ్‌ ఇండియా విజ్ఞప్తులు పంపిస్తున్నాయి. తమ తమ అసోసియేషన్లలో సభ్యులందరికీ ఒకేసారి వ్యాక్సిన్‌ వేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.


అమితాబ్‌ బచ్చన్‌, అనిల్‌ కపూర్‌, మాధురీ దీక్షిత్‌, అనుపమ్‌ ఖేర్‌, సోనూ సూద్‌, ఫర్హాన్‌ అక్తర్‌ కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. మహారాష్ట్రలో తాత్కాలికంగా 18 నుంచి 44 ఏళ్ల లోపు ఉన్న వారికి వ్యాక్సిన్‌ ఇవ్వడం నిలిపివేసినా... ఇప్పటికే కాజల్‌ అగర్వాల్‌, రితేశ్‌ దేశ్‌ముఖ్‌ - జెనీలియా దంపతులు, సోనాక్షీ సిన్హా, కార్తీక్‌ ఆర్యన్‌ తదితరులు వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. సెట్‌లో అందరూ వ్యాక్సిన్‌ తీసుకున్నా, జాగ్రత్తగా ఉండాలని జావేద్‌ అక్తర్‌ అంటున్నారు.



‘‘సినీ కార్మికులు తమ కాళ్ల మీద నిలబటడానికి వ్యాక్సినేషన్‌ సహాయపడుతుంది. ముఖ్యంగా రోజువారీ కార్మికులకు ఎంతో ఉపయోగం ఉంటుంది. షూటింగ్స్‌ జరుగుతుంటే... కొత్త కంటెంట్‌ క్రియేట్‌ చేయవచ్చు. ఇండస్ట్రీలో ఆర్థిక కార్యకలాపాలు జరుగుతుంటాయి. అందరికీ వ్యాక్సినేషన్‌పై ప్రభుత్వం స్పందిస్తుందని ఆశిస్తున్నా’’


హీరోయిన్‌ తమన్నా

Updated Date - 2021-05-15T04:21:34+05:30 IST