మహిళ వేషధారణలో బాలీవుడ్ స్టార్ హీరో
ABN , First Publish Date - 2021-10-27T21:54:29+05:30 IST
స్టార్ హీరోలు మహిళ వేషధారణాల్లో కనిపించడం కొత్తేమీ కాదు. విశ్వ నటుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ తదితరులెందరో స్త్రీ పాత్రల్లో కనిపించారు.
స్టార్ హీరోలు మహిళ వేషధారణల్లో కనిపించడం కొత్తేమీ కాదు. విశ్వ నటుడు కమల్ హాసన్, చియాన్ విక్రమ్ తదితరులెందరో స్త్రీ పాత్రల్లో కనిపించారు. తాజాగా ఒక బాలీవుడ్ స్టార్ హీరో ఆ వేషం ధరించి షూటింగ్లో పాల్గొన్నారు.
సంజు చిత్రంలో నటించి బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన స్టార్ హీరో రణ్ బీర్ కపూర్. ఆ చిత్రంలో ఆయన అనేక వేషధారణల్లో కనిపించారు. తాజాగా ఆయన స్త్రీ వేషం ధరించి షూటింగ్లో పాల్గొన్నారు. ఈ విధంగా చేసింది సినిమా కోసం కాదు, యాడ్ కమర్షియల్‌లో నటించడానికి ఈ సాహసానికి పూనుకున్నారు.
యాడ్ కోసం రణబీర్ పూర్తి స్థాయిలో ప్రొస్తటిక్ మేకప్ ధరించారు. తల వెంట్రుక నుంచి కాలి గోటి వరకు పూర్తిగా మహిళ వేషధారణలో కనిపించారు. రణబీర్ ట్రాన్స్ఫార్మేషన్ వీడియోను ఫేమస్ మేకప్, ప్రొస్తటిక్ ఆర్టిస్ట్ ప్రీతి షీల్ సింగ్ డిసౌజా ఇన్ స్టాగ్రామ్‌లో పంచుకుంది.
రణబీర్ కూర్చొని ఉండగా ఆర్టిస్టులు మేకప్ వేయడం ఆ వీడియోలో కనిపించింది. ప్రీతి షీల్ ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దాని కింద ఈ విధంగా రాసింది.‘‘ పని చేయడంతో పూర్తి రోజు గడిచిపోయింది. రణ్ బీర్ కపూర్‌ను యాడ్ కోసం స్త్రీగా మారుస్తున్నాం ’’ అని ఆమె చెప్పింది. బంటీ ఔర్ బబ్లీ-2 సినిమాకు కూడా ప్రీతి షీల్ మేకప్ ఆర్టిస్ట్‌గా పనిచేసింది.