ఒట్టు... పేరే పచ్చబొట్టు!
ABN, First Publish Date - 2021-08-29T05:49:26+05:30
ప్రేమకు, పచ్చబొట్టుకు దగ్గర సంబంధం ఏదో ఉన్నట్టుంది! ప్రేమలో పడినవాళ్లు, పడి మునిగి తేలుతున్న వాళ్లు పచ్చబొట్టు వేయించుకోవాలనే నిబంధనలేవీ లేవు. కానీ, ఒంటిపై ఒకరి పేరు పచ్చబొట్టు పడితే ప్రేమలో పడినట్టే లెక్క! అందుకు ఉదాహరణ... ఇదిగో ఈ హిట్ జంటలు...
ఒట్టు... ప్రేమ పులకరించేట్టు... పేరు పదికాలాలు నిలిచేట్టు... నలుగురూ మాట్లాడుకునేట్టు... ఒంటిపై వేయించారు పచ్చబొట్టు! తారాలోకంలో ఈ జంటలు హిట్టు!!
ప్రేమకు, పచ్చబొట్టుకు దగ్గర సంబంధం ఏదో ఉన్నట్టుంది! ప్రేమలో పడినవాళ్లు, పడి మునిగి తేలుతున్న వాళ్లు పచ్చబొట్టు వేయించుకోవాలనే నిబంధనలేవీ లేవు. కానీ, ఒంటిపై ఒకరి పేరు పచ్చబొట్టు పడితే ప్రేమలో పడినట్టే లెక్క! అందుకు ఉదాహరణ... ఇదిగో ఈ హిట్ జంటలు! హిందీ దర్శక - నిర్మాత, నటుడు ఫర్హాన్ అక్తర్, శిబానీ దండేకర్ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నాళ్లు తమ ప్రేమను గుట్టుగా ఉంచినప్పటికీ... ఇప్పుడు అటువంటివి ఏమీ లేవు. ఏకంగా మెడపై ఫర్హాన్ పేరును శిబాని పచ్చబొట్టు పొడిపించుకొనే వరకూ వెళ్లింది. అదీ తన పుట్టినరోజున ప్రియుడి పేరును ఒంటిపై పచ్చబొట్టు వేయించుకోవడం విశేషం!
ప్రేమికుల పేర్లు, జీవిత భాగస్వామి పేర్లు పచ్చబొట్టు వేయించుకున్న తొలి జంట ఫర్హాన్ - శిబానీదేనా? అంటే కాదని చెప్పాలి. హిందీ చిత్ర పరిశ్రమలో ఇటువంటి జంటలు కొన్ని ఉన్నాయి. ఎవరు ముందు? ఎవరు వెనుక? అంశాన్ని పక్కన పెడితే... ప్రముఖ హిందీ హీరో అక్షయ్ కుమార్ భుజంపై ‘టీనా’ అని టాటూ ఉంటుంది. భార్య ట్వింకిల్ ఖన్నా పేరులో మొదటి, చివరి అక్షరాలు తీసుకుని... ముద్దుగా అలా పచ్చబొట్టు వేయించుకున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా అంతే! అతడి చేతిపై భార్య కరీనా పేరు ఉంటుంది. అది ఎప్పటికీ చెరిగిపోని పచ్చబొట్టే.
సంజయ్ దత్ భార్య మాన్యత వేలిపై భర్త పేరు టాటూ రూపంలో ఉంటుంది. వీళ్లందరూ పెళ్లైన వ్యక్తులే. జీవిత భాగస్వామి పేర్లు టాటూ వేయించుకున్న వాళ్లు. అయితే... ప్రేమలో ఉండగా ఈ విధంగా పచ్చబొట్టు వేయించుకుని ఇబ్బంది పడ్డవాళ్లు... విడిపోయినా హ్యాపీగా ఉన్నవాళ్లు కూడా ఉన్నారు.
రణ్‌బీర్ కపూర్‌తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పుడు అతని పేరును మెడ వెనుక భాగంలో దీపికా పదుకోన్ పచ్చబొట్టు వేయించుకున్నారు. బ్రేకప్ తర్వాత ఆ టాటూ హాట్ టాపిక్ అయింది. హృతిక్ రోషన్, సుజానే ఖాన్ విడాకులు తీసుకున్నారు. పెళ్లికి ముందు వాళ్లిద్దరూ ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కలిసి జీవించినప్పుడు... సుజానే పేరును మణికట్టు దగ్గర హృతిక్ టాటూ వేయించుకున్నారు. ఇద్దరి చేతిపై ఒకే విధమైన టాటూలు కనిపిస్తాయి.