మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో సల్మాన్ ఖాన్.. ఈ సారి క్రేజీ పార్ట్‌లో ..

ABN , First Publish Date - 2021-12-30T21:25:00+05:30 IST

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. బాలీవుడ్ భాయిజాన్ 56వ పుట్టిన రోజు

మరోసారి పోలీసాఫీసర్ పాత్రలో సల్మాన్ ఖాన్.. ఈ సారి క్రేజీ పార్ట్‌లో ..

బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసే నటుడు సల్మాన్ ఖాన్. ప్రపంచవ్యాప్తంగా అతడికి అభిమానులున్నారు. బాలీవుడ్ భాయిజాన్ 56వ పుట్టిన రోజు వేడుకలను పన్వేల్‌లోని ఫామ్ హౌస్‌లో ఈ మధ్యనే జరుపుకొన్నారు. ఈ సందర్భంగా తను భవిష్యత్తులో చేయబోయే అనేక సినిమాల సంగతులను వివరించారు. తాజాగా సల్లూ భాయ్ మరో క్రేజీ సినిమాకు 4వ భాగం చేయబోతున్నట్టు బీ టౌన్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. 


బాలీవుడ్ భాయిజాన్ ప్రస్తుతం టైగర్-3 లో నటిస్తున్నారు. అనంతరం కబీ ఈద్ కబీ దివాళీ, నో ఎంట్రీ సినిమాల షూటింగ్‌ను పూర్తి చేస్తారు. తర్వాత రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే బ్లాక్ టైగర్‌లోను నటిస్తారు. ఈ సినిమాల చిత్రీకరణ పూర్తి కాక ముందే అతడు చేయబోయే మరో ప్రాజెక్టు గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. దబాంగ్-4 లో అతడు నటించబోతున్నట్టు తెలుస్తోంది. తిగ్మాన్షు ధూలియా దబాంగ్-4 స్ర్కిఫ్ట్‌పై పనిచేస్తున్నట్టు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. సల్మాన్ ఖాన్  దబాంగ్ సిరీస్ సినిమాల్లో చుల్ బుల్ పాండే అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించారు. సల్మాన్ సోదరుడైన అర్భాజ్ ఖాన్ ఈ సినిమాలను నిర్మించారు.    


‘‘ తిగ్మాన్షు దబాంగ్-4 స్క్రిఫ్ట్‌పై ఏడాది కాలంగా పనిచేస్తున్నారు. తిగ్మాన్షు భాయిజాన్‌కు ఒక పాయింట్‌ను వినిపించారు. ఆ పాయింట్ అతడికి బాగా నచ్చింది. ఆ పాయింట్ ఆధారంగా స్క్రిఫ్ట్‌ను రూపొందిస్తున్నారు. 2022లో సల్మాన్ పూర్తి కథను వింటారు. చుల్ బుల్ పాండే పాత్రను కూడా కొత్తగా రూపొందిస్తున్నారు. ఒక సారి సల్మాన్ కథను విన్నాక దబాంగ్-4 పట్టాలెక్కుతుందా లేదా అనేది తెలుస్తోంది ’’ అని చిత్ర బృందానికి సంబంధించిన ఒక వ్యక్తి చెప్పారు.  


తిగ్మాన్షు ధూలియా గతంలో సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్ స్టర్, పాన్ సింగ్ తోమార్ సినిమాలకు దర్శకత్వం వహించారు. సల్లూ భాయ్‌కు 2015లోనే ఆయన ఒక కథను వినిపించారు. కానీ, అనేక కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. దబాంగ్-1, 2 సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. కానీ, 3వ పార్ట్ బాక్సాఫీస్ అంచనాలను అందుకోలేక పోయింది.

Updated Date - 2021-12-30T21:25:00+05:30 IST