అగ్నిపర్వతంలా బతకాలి...

ABN , First Publish Date - 2020-07-12T18:06:44+05:30 IST

కరోనా ఎన్ని వేషాలు వేస్తుందో.. అంతకు మించిన వేషధారి.. ఈ అయ్యంగారు. వర్మ విడుదల చేసిన కరోనావైరస్‌ ట్రైలర్‌ చూస్తేనే అతని సత్తా తెలుస్తుంది..

అగ్నిపర్వతంలా బతకాలి...

కరోనా ఎన్ని వేషాలు వేస్తుందో.. అంతకు మించిన వేషధారి.. ఈ అయ్యంగారు. వర్మ విడుదల చేసిన కరోనావైరస్‌ ట్రైలర్‌ చూస్తేనే అతని సత్తా తెలుస్తుంది.. ఆ కొత్త నటుడి ఇంటర్వ్యూ.. 


శ్రీకాంత్‌ అయ్యంగార్‌... ఇప్పుడిప్పుడే సినిమాల్లో విన్పిస్తోన్న పేరు. కానీ పదిహేనేళ్ల నుంచి తెలుగు సినిమాల్లో ఉన్నాడు. యాభై రెండు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేశాడు... పక్కా హైదరాబాదీ. ఎంసెట్లో 208 ర్యాంకుతో మెడిసిన్‌లో సీటు సాధించాడు. షేక్‌స్పియర్‌ నుంచి స్పేస్‌ వరకూ ఏ విషయమైనా అనర్గళంగా మాట్లాడగలడు. రామ్‌గోపాల్‌ వర్మ ‘కరోనా వైరస్‌’ సినిమాతో సందడి చేయడానికి సిద్ధమవుతున్న శ్రీకాంత్‌ ఎన్నో విషయాలను పంచుకున్నారు.


లాక్‌డౌన్‌ మొదలైన వారం, పదిరోజులు బాగానే ఉంది. కానీ ఆ తరవాత భరించలేనంత కష్టంగా అన్పించింది. ఎందుకంటే నలభై ఏడేళ్ల నా జీవితంలో ఎప్పుడూ చేతినిండా పని దొరకలేదు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేశా, కో డైరెక్టర్‌గా చేశా, నాటకాలూ తీశా, నటించా... ఇలా ఎన్నో చేశాను. కానీ నా జీవితం కరెక్టుగా గాడిలో పడింది గతేడాదే. మార్చి 26 నుంచి జూన్‌ 24 వరకు అన్ని డేట్స్‌ బుక్‌ అయ్యాయి. అలాంటి సమయంలో లాక్‌డౌన్‌. అప్పుడే ఆర్జీవీ కాల్‌ చేసి ‘కరోనా వైరస్‌’ చేద్దామన్నారు. ప్రాణం లేచివచ్చింది. లాక్‌డౌన్‌ వల్ల ప్రపంచంలో ఎక్కడా సినిమాలు తీయట్లేదు. అలాంటిది ఆర్జీవీ దగ్గరే రెండు సినిమాలు చేశాను. మర్డర్‌ చిత్రంలో కూడా చేస్తున్నాను. ఓ నటుడిగా నా స్థాయి పెంచుకుంటూ పోతే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయనేది నా నమ్మకం. 


గాంధీ మెడికల్‌ కాలేజీలో...

చిన్నప్పుడు ఏం చేయాలో క్లారిటీ లేదు. కానీ ఏది చేసినా ఇరగదీసేవాడిని. అమ్మానాన్నలది తమిళనాడు. నాన్న ఎయిర్‌ఫోర్స్‌లో కొద్దికాలం చేశారు. ఆ తరవాత హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌లో సైటింస్ట్‌గా చేరారు. నేను పుట్టిందీ పెరిగిందీ అంతా హైదరాబాదే. నేను తెలుగు వాణ్నే. నాన్న మెడిసిన్‌ చదవమన్నారు. మరో ఆలోచన లేకుండా ఎంసెట్‌కు ప్రిపేర్‌ అయ్యా. 208 ర్యాంకుతో గాంధీ మెడికల్‌ కాలేజీలో ఎంబీబీఎస్‌ పూర్తిచేశా. ఖాళీ సమయాల్లో ఇంగ్లిష్‌, హిందీ, తెలుగు సినిమాలు బాగా చూసేవాడిని. ‘నాన్నా, నాకు డైరెక్టర్‌ అవ్వాలని ఉంది’ అంటూ నా ముప్పై ఒకటో ఏడు ఆయనతో చెప్పా. ‘బాగా చదువుకున్నావ్‌, నీ జీవిత లక్ష్యం నువ్వే ఏర్పరచుకో’ అన్నారు. ఆ తరవాత కొద్ది కాలానికే నాన్న మరణించారు. సినిమాలకు సంబంధించి మనకు ఏం రాదు, తెలియదు అనేది ముప్ఫై లక్షల రూపాయలు ఖర్చు అయ్యాక తెలిసింది. అయినా పట్టు వదలలేదు. ఎక్కడైనా పని దొరికించుకోవాలి అన్నది రోజూ వేటలా ఉండేది. ఓ ఇంగ్లిష్‌ నాటకం తీసే అవకాశం వచ్చింది. అలా నాలుగు ఇంగ్లిష్‌ నాటకాలకు దర్శకత్వం వహించా. ఓ నాటకంలో భూమిక నాతో కలిసి నటించింది. తరువాత నీలకంఠగారి చిత్రంలో నటించే ఛాన్స్‌ వచ్చింది. అలా ఓ నలభై చిత్రాలు చేశా. ‘బ్రోచేవారెవరురా’ నాకు బ్రేక్‌ ఇచ్చిన సినిమా. అయితే కమర్షియల్‌గా పేరు తెచ్చింది మాత్రం ‘ప్రతిరోజూ పండగ’.


నేను జీవి... ఆయన ఆర్జీవీ!

ఈ లైఫ్‌ జర్నీలో ఆర్జీవీని కలవకపోతే నాకు పిచ్చెక్కిపోయేది. నా దర్శకులందరినీ ఇష్టపడతాను. అందురూ గొప్పవాళ్లే. కాకపోతే ఆర్జీవీ పంథా వేరు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఆయన సినిమా తీయాలని అనుకున్నారు. దానికి నన్ను ఎంచుకున్నారు. పిలిచి పని ఇచ్చారు. తద్వారా డబ్బు వచ్చింది. పని లేకపోతే డబ్బు రాదు. మామూలు మధ్యతరగతి కుటుంబమే నాదీ. అందుకే నాకు ఆర్జీవీ గాడ్‌ఫాదర్‌. నేను స్వతహాగా దేవుడిని నమ్మను కానీ, నాకు పర్సనల్‌గా తెలిసిన ముగ్గురు దేవుళ్లలో ఆర్జీవీ మొదటివాడు. రెండో దేవుడు ఇళయరాజా. నేను చేసిన ఓ ఇంగ్లిష్‌ నాటకానికి ఆయన సంగీతం అందించారు. ఆ కాంపోజిషన్స్‌ చూస్తుంటే అతడి ముందు నేను నథింగ్‌ అన్పించింది. ఇక కమల్‌హాసన్‌, దిలీప్‌కుమార్‌, చిరంజీవిలను మూడో దేవుడిగా భావిస్తా. 


అదే నా ఫిలాసఫీ..

నా ఫిలాసఫీ అంటూ ప్రత్యేకంగా ఏమీ లేదు. మనం చిన్నప్పటి నుంచీ వింటున్నదే... మంచి చేయి అంతా మంచిగవుతుంది. చెడు చేస్తే నీకు చెడే జరుగుతుంది అనేదే. దీన్నే నేను ‘జిఒఒడి (గుడ్‌)’ ఫిలాసఫీ అని పిలుస్తాను. రేపు ఏమవుతుందో తెలియదు, నిన్న ఏమయిందో మర్చిపోయి నేటిలో బతకాలనే అనుకుంటాను. ‘ఐ విల్‌ డూ మై బెస్ట్‌’ అంటారు చాలా మంది. కానీ ‘యువర్‌ బెస్ట్‌ ఈజ్‌ నాట్‌ ఎనఫ్‌’ అంటాను నేను. ఏది చేసినా బాగా కష్టపడాలి. మన మార్కు కన్పించాలి. నేను గట్టిగా నమ్మేది మూడే విషయాలు... మొదటిది.. నేను జీరోను కూడా కాదు, రెండోది.. ప్రపంచాన్ని జయించే స్థాయికి ఎదగాలని ప్రయత్నిస్తున్నా. ఇక మూడోది కుక్కలోని  గుణాల్లో పదోవంతైనా నాలో మెరుగుపడాలి. బొద్దింక, బల్లి, పావురాలు... అన్నీ బతుకుతున్నాయి. నేను బతకలేనా. అవెందుకు బతుకుతున్నాయో వాటికి క్లారిటీ లేదు. నేనెందుకు బతుకుతున్నానో నాక్కూడా తెలియదు. కానీ చేస్తున్న పని పైన క్లారిటీ ఉంది. అది అత్యంత అద్భుతంగా, నా స్థాయికి మించి ఉండాలని కోరుకుంటాను. అహర్నిషలూ నా బౌండరీలను పెంచుకోవడానికే ప్రయత్నిస్తా. అయ్యో నాకు అవకాశం రాలేదే అని భాధపడుతూ కూర్చోను. నాకన్నా హార్డ్‌ వర్కింగ్‌, నాకన్నా సిన్సియర్‌, నాకన్నా గొప్పగా నటించే వాళ్లు మార్కెట్లో లక్షల్లో ఉన్నారు. కానీ అవకాశం నాకు వచ్చింది. అంతే ఇరగదీసేయడమే. మీర్జా గాలిబ్‌ చెప్పిన ఓ కవిత ఉంది. ‘జీవితకాలం ఒకటే ఒక తప్పు చేస్తూ వస్తున్నాను మిత్రమా... దుమ్ము మొహమ్మీద ఉంటే అద్దాన్ని తుడుస్తున్నాను.’ ఆ దరిద్రం నాకు పట్టకూడదు. రోజూ నన్ను నేను సానబెట్టుకుంటాను. ప్రతి భాషలో... ప్రతి దర్శకుడి దగ్గరా పనిచేయాలనేది లక్ష్యం. అది అవుతుందా లేదా అన్నది తరవాత... ముందు ప్రయత్నం అంటూ ఉండాలి కదా. మరో హిందీ కవిత గుర్తొస్తోంది. ‘గమ్యం ఏముందిలే దారి తప్పిన వాళ్లకి కూడా దొరుకుతుంది... కానీ దిక్కులేని వాడు ఎవరో తెలుసా? ఇంటి నుంచి బయల్దేరని వాడు.’ పదిహేనేళ్ల కష్టం తరవాత దొరికిన బ్రేక్‌ను విడిచిపెట్టకుండా ఇంకా మున్ముందుకు సాగాలన్నదే నా ప్రయత్నం. ఓ అగ్నిపర్వతంలా లావాను విరజిమ్ముతుండాలనే కోరిక... నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది.
హ్యాట్సాఫ్‌ అమితాబ్‌

ఇటీవలే ఓటీటీలో వచ్చిన ‘గులాబో సితాబో’ చూసి ఏడ్చేశాను. అందరి హృదయాల్లో చిరస్థాయిగా ఓ విల్లా కట్టుకున్న నటుడు అమితాబ్‌ బచ్చన్‌. వందల కోట్ల ఆస్థిపరుడు. ఆ సినిమా కోసం అంతలా కష్టపడాల్సిన అవసరం ఏముంది? కురువృద్ధుడి పాత్ర కోసం నాలుగు గంటలు మేకప్‌ వేసుకోవడానికి, తీయడానికి మరో రెండు గంటలు పట్టేదట. డెబ్బై ఏడేళ్ల వయసులో ఆయనకి ఎందుకంత కష్టం. ఇంకా తనలో ఏదో ప్రూవ్‌ చేసుకోవాలనే తపన. అనేక ఛాలెంజింగ్‌ పాత్రల్లో నటించాలనే ఆరాటం. అమితాబ్‌ని చూసి కాస్త శక్తిని తీసుకుని ముందుకు వెళితే చాలు. జీవితం సఫలం అవుతుంది.
పట్టుదలకు పరాకాష్ట

ఓ నటుడిగా నా అభిమాన హీరో రవితేజ. పట్టుదలకు పరాకాష్ట మాస్‌ మహారాజా అంటాను. రవితేజతో కలిసి నటించాలని కోరిక, కానీ అంతకంటే ముందు ఆయన్ని ఓసారి కలిసి ఫోటో తీసుకుని దానిని నా ఇంట్లో పెట్టుకుని రోజూ పూజలు చేయాలి. పదహారేళ్లకు జూనియర్‌ ఆర్టిస్ట్‌గా మొదలుపెట్టి, అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా చేసి నలభై రెండేళ్లకి హీరో అయ్యాడంటే అతడు పడిన కష్టం ఊహించలేం. లక్ష్య సాధన కోసం ఇరవై అయిదేళ్లు శ్రమించాడు. అదీ అతడి పట్టుదల.
కల్మషం లేని ప్రాణులు...

ఇంట్లో నాలుగు వీధి కుక్కల్ని పెంచు తున్నాను. మన లాగే భోంచేస్తాయి, నిద్రపోతాయి, ఆడు కుంటాయి... అయితే అన్‌కండిషన్డ్‌గా ప్రేమిస్తాయి. నాకోసం ఏం తెచ్చావ్‌, వాడికేమిచ్చావ్‌ అని అడగవు. అందుకే వాటిని ‘డిఓజీ’కి బదులుగా ‘జీఓడీ’ అని పిలవాలనుకుంటా. ‘గాడ్‌’ గొప్పవాడు అని అందరం నమ్ముతాం. మరి ‘నిర్భయ’, ‘దిశ’ లాంటి సంఘటనలప్పుడు ఆ దేవుడు ఎక్కడున్నాడు, ఎందుకు ఆపలేకపోయాడు అనే ప్రశ్నలు వేధిస్తుంటాయి. అందుకే ‘గాడ్‌’ కాన్సెప్ట్‌ అర్థం కాదు. మా ఇంట్లో పూజలు పునస్కారాలు చేస్తారు. అన్నిట్లో పాల్గొంటా. కళ్లు మూసుకుని మాత్రం నాన్ననే స్మరిస్తా. మనసు బాలేకపోయినా నాన్ననే తలచుకుంటా కొండంత ధైర్యం వస్తుంది.


- డి.పి.అనురాధ


Updated Date - 2020-07-12T18:06:44+05:30 IST