మంచి చెడుల విచక్షణ నేర్పేవే టీవీ సీరియల్స్: నటి షీలా సింగ్
ABN , First Publish Date - 2020-03-14T03:22:13+05:30 IST
టీవీ సీరియల్స్ మనకు మంచి చెడుల విచక్షణ నేర్పుతాయి, మనం ఎలా ఉండకూడదో చెబుతాయి, అందుకే మనం టీవీ సీరియల్స్ చూడాలి’’ అంటున్నారు షీలా సింగ్. మనుషులు హాయిగా

‘‘టీవీ సీరియల్స్ మనకు మంచి చెడుల విచక్షణ నేర్పుతాయి, మనం ఎలా ఉండకూడదో చెబుతాయి, అందుకే మనం టీవీ సీరియల్స్ చూడాలి’’ అంటున్నారు షీలా సింగ్. మనుషులు హాయిగా ఆనందంగా ఐక్యంగా బతకాలంటే ఉమ్మడి కుటుంబం ఉండాలి. మన సంస్కృతి సంప్రదాయాలు, గౌరవ మర్యాదలు పాటిస్తూ, మాటతీరు, మంచి చెడులు తెలుసుకోవడానికీ, మన మనోవికాసానికీ ఉమ్మడి కుటుంబవ్యవస్థే శరణ్యం అంటున్న షీలా సింగ్ మనోగతం..
తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా డోర్నకల్ జంక్షన్ షీలా సింగ్ జన్మస్థలం. ఆమె తండ్రి ఠాకూర్ రంజిత్ సింగ్ ఉత్తరప్రదేశ్ అలహాబాద్‌లో పుట్టి, ఉద్యోగరీత్యా 50ఏళ్ళ క్రితమే డోర్నకల్ జంక్షన్‌లో స్థిరపడ్డారు. రైల్వే మెకానికల్ విభాగంలో పనిచేసి రిటైరయ్యారు. షీలా తల్లి చంద్రకళ. ముగ్గురు అన్నయ్యలు, అక్కయ్య తర్వాత చివరి సంతానం షీలా.
షావొలిన్ కుంగ్ ఫూ బ్లాక్ బెల్ట్ హోల్డర్
షీలా చదువంతా డోర్నకల్ రైల్వే ఇంగ్లీష్ మీడియం స్కూల్లోనే. బాల్యం నుంచీ పన్నెండేళ్ళపాటు శేఖర్ మాస్టర్ వద్ద షావొలిన్ కుంగ్ ఫూ నేర్చుకున్న బ్లాక్ బెల్ట్ హోల్డర్ షీలా. ఆటల్లో కూడా ఫస్టు ప్రైజులన్నీ ఆమెవే. అథ్లెటిక్స్ 100మీటర్లు, 200మీటర్లు, షాట్‌పుట్, డిస్కస్ త్రో, లాంగ్ జంప్...షీలా ఫేవరెట్స్. 100మీటర్ల దూరాన్ని 12సెకన్లలో చేరుకోగలదామె. లాంగ్ జంప్‌లో రాష్ట్రస్థాయిలో ద్వితీయస్థానంలో నిలిచింది. టెన్త్ క్లాస్ వరకు ప్రతి ఆటలోనూ తనే ఛాంపియన్. ఆమె పాల్గొంటే చాలు, ఇక తమకు బహుమతులు రావని మిగతవారంతా ముందే డిసైడైపోయేవారట.
శాస్త్రీయ, జానపద నృత్యాలు అలవోకగా చూసి చేసెయ్యగలదు షీలా. మొదటిసారి ఆమె, ‘లాలా గూడ లంబడి పిల్ల....’ అనే పాటకు మెయిన్ లీడ్‌గా ఉండి డాన్స్ చేసి అందరి ప్రశంసలు పొందింది.
రైల్వే స్కూల్ తరపున అనేక నగరాల్లో స్కౌట్స్ మరియు గైడ్స్ క్యాంప్స్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంది.
సినిమా అవకాశాలు
సినిమా అవకాశాలు షీలాను వెతుక్కుంటూ రావడంతో టెన్త్ తర్వాత ఆమె చదువు ఆగిపోయింది. రామోజీ ఫిలిమ్ సిటీలో జరిగిన స్కిట్స్, మార్షల్ ఆర్ట్స్ ఈవెంట్స్‌కు షీలా ఎంపికైంది. కానీ తల్లిదండ్రులు వద్దనడంతో ఆగిపోయింది. అదేసమయంలో, బాలకృష్ణ నటించిన ‘సీమ సింహం’ చిత్రంలో రియల్‌గా మార్షల్ ఆర్ట్స్ చేసే లేడీ ఫైటర్ కోసం వెతుకుతున్న బాలాజీ ఆర్ట్ క్రియేషన్స్ యూనిట్ రామోజీ ఫిలిమ్ సిటీ ద్వారా షీలాను సంప్రదించింది. అలా ‘సీమ సింహం’ సినిమాలో లేడీ పోలీస్ ఆఫీసర్‌గా ఫైటింగ్స్ సీన్స్‌లో నటించింది. ‘నీ మనసు నాకు తెలుసు’ చిత్రంలో చంద్రమోహన్ కూతురుగా మెరిసింది. ‘చంటిగాడు’ చిత్రంలో రాములమ్మ పాత్రలో కామెడీ పండించింది. సుమంత్ హీరోగా చేసిన ‘ధన–51’ చిత్రంలో హీరో ఫ్రెండ్‌గా చేసింది. అలా 2004–2006వరకు మూడేళ్ళపాటు షీలా సినిమాల్లో నటించింది.
టీవీ సీరియల్స్‌లో...
మంచి పాత్రలకోసం ఎదురుచూస్తున్న సమయంలో, షీలాకు టీవీ సీరియల్‌లో అవకాశం వచ్చింది. ‘సినిమాలకంటే టీవీ సీరియల్సే ఉత్తమం’ అని తండ్రి ఇచ్చిన సలహామేరకు ఈ రంగంలోనే స్థిరపడింది షీలా. ‘మా ఇంటి మహాలక్ష్మి’ సీరియల్‌లో జనరేషన్ ఛేంజ్‌లో హీరోయిన్ పాత్రలో 300 ఎపిసోడ్స్ నుంచి 500 ఎపిసోడ్స్ వరకు నటించింది. ‘బొమ్మరిల్లు’ సీరియల్‌లో హీరోయిన్ భార్గవిగా నటించింది. ‘మనసు చూడతరమా’ సీరియల్‌లో లీడ్ రోల్ చేసింది. ‘శిఖరం’ సీరియల్‌లో నాగబాబు చెల్లెలుగా చేసింది. కల్పన, చంద్రముఖి సీరియల్స్‌లో నటించింది. జీ టీవీలో ‘డాక్టర్ చక్రవర్తి’ సీరియల్‌లో హీరో చెల్లెలుగా నటించింది షీలా.
కెరీర్‌ను మలుపు తిప్పిన శాంతి పాత్ర
టీవీ సీరియల్స్‌లో నాలుగేళ్ళ కెరీర్ తర్వాత ‘మొగలి రేకులు’ సీరియల్లో శాంతి పాత్ర షీలాకు గొప్ప పేరు, గుర్తింపు తెచ్చింది. ‘‘ఈ పాత్ర నాకు చాలామంది స్నేహితుల్ని సంపాదించిపెట్టింది. శాంతి అంటే అచ్చం ఇలాగే ఉంటుందనే గుర్తింపు వచ్చింది. ‘బొమ్మరిల్లు’ సీరియల్‌లో నా సహనటి మధుమణి వల్లనే నాకు ‘మొగలిరేకులు’ సీరియల్‌లో ఇంతగొప్ప అవకాశం వచ్చింది. ఆవిడ ద్వారా ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు కూడా వచ్చాయి. నా ఉన్నతికి సహకరించిన మధుమణిగారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదాలు చెబుతున్నాను’’ అన్నారు షీలా.
మంజులా నాయుడు ఈ సీరియల్‌కోసం 50 మంది నటుల్లోంచి, పెర్‌ఫెక్ట్‌గా సరిపోతుందని షీలానే ఎంపిక చేశారట. ‘‘ఎన్నో భావోద్వేగాలు, నవరసాలు పండించిన శాంతిపాత్ర నా కెరీర్‌లో ఒక పెద్ద మలుపు’’ అన్నారామె. ఆమెకు బయట అభిమానులు తారసపడినప్పుడు, ‘‘అమ్మా శాంతి ఎన్ని కష్టాలు పడ్డావమ్మా’’ అని ఆమెను పట్టుకుని ఏడ్చేవారట. వాళ్ళ అభిమానం చూసి షీలా కూడా కన్నీళ్ళు పెట్టుకునేదట. ఆ తర్వాత ‘సింధూరం’ సీరియల్‌లో నటించారు షీలా. జీటీవీలో ‘కన్యాదానం’ సీరియల్‌లో నెగిటివ్ రోల్ చేశారామె. ‘మా ఇంటి ఆడపడుచు’ సీరియల్‌లో చామంతి పాత్రకు బెస్ట్ ఆడపడుచు అవార్డు లభించింది షీలాకి.
వివాహ జీవితం
షీలా 2009లో వివాహం చేసుకున్నారు. ఆమె భర్త కళ్యాణ్ కూరపాటి. గార్మెంట్ వ్యాపారస్తులు. వారికి ఒక బాబు ఇషాన్ కూరపాటి. ఒకటో తరగతి చదువుతున్నాడు. వైవాహిక జీవితంలో తనవంతు బాధ్యతలు నిర్వర్తించడానికి నటిగా ఐదేళ్ళు విరామం తీసుకున్నారామె. ‘‘మాది ఉమ్మడి కుటుంబం. ఇద్దరు మరుదులు. ఒక ఆడపడుచు. అందరూ జీవితంలో హ్యాపీగా సెటిలయ్యారు. చెప్పుడు మాటలు చెప్పే ఇరుగుపొరుగును మా అత్తయ్యగారు పక్కకునెట్టేసి, ఉమ్మడి కుటుంబంలో మేమిద్దరం పరస్పరం అర్థం చేసుకుని ఎడ్జెస్ట్ కావడానికి ఏడాదిన్నర పట్టింది. కెరీర్‌నుంచి ఐదేళ్ళు గ్యాప్ తీసుకుని ఇంటిని చక్కదిద్దుకున్నాను. దాంతో మా ఉమ్మడి కుటుంబంలో నేనే సెంటర్ పాయింట్‌గా మారాను. ఇలాంటివన్నీ ప్రతి ఇంట్లోనూ జరిగేవే.
ఉమ్మడి కుటుంబమే హాయి
‘‘తల్లిదండ్రులకు దూరంగా భార్యాభర్తలు ఒక్కరే ఒంటరిగా బతకాలనే ధోరణి సరైనది కాదు, ఉమ్మడి కుటుంబం ఉంటే మనకు ఎంతో హాయిగా ఉంటుంది. అందరూ కలిసికట్టుగా, సపోర్టుగా ఉంటారు. నా కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాక, మా బాబు ఆలనాపాలనా చూస్తూ ఆయనతో పాటు ఇంట్లో అందరూ సహకరిస్తున్నారు. నా ఉమ్మడి కుటుంబాన్ని చక్కదిద్దుకోవడానికి నటిగా నా పాత్రల అనుభవం కూడా దోహదపడింది. ఉమ్మడి కుటుంబంలో ఒడిదుడుకులు వస్తాయి, రావాలి, వాటిని సమయస్ఫూర్తిగా చక్కదిద్దుకుని ఆ ఐక్యతను కాపాడుకోవాలి’’ అంటూ ఒక రోల్ మోడల్‌గా తన అనుభవాల్ని వివరించారు షీలా. ‘‘ఉమ్మడి కుటుంబం జీవితంవల్ల మనకు చక్కగా మాట్లాడే పద్ధతి అలవడుతుంది. మానసికంగా ఎదుగుదలకు, అభివృద్ధికి, పరిణతికి మనో వికాసానికి ఉమ్మడి కుటుంబం ఎంతో దోహదపడుతుంది. కొత్త తరం పిల్లలు పెద్దలపట్ల గౌరవం, మర్యాద మన్నన, మన సంస్కృతీ సంప్రదాయాలు, మంచి చెడులు అన్నీ తెలుసుకోగలుగుతారు. తిట్టుకున్నా కొట్టుకున్నా మన రక్తం మనదే’’ అన్నారు షీలా.
జీ తెలుగులో ‘నిన్నే పెళ్ళాడతా’
కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో షీలా, అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో జీ తెలుగులో వస్తున్న ‘నిన్నే పెళ్ళాడతా’ సీరియల్‌లో వదినగా భారతి పాత్ర చేస్తున్నారు. ఇప్పటివరకు 500 ఎపిసోడ్స్ ప్రసారమై ఇంకా కొనసాగుతోంది. వదిన – ఆడపడుచుల మధ్య నడిచే సీరియల్ ‘నిన్నే పెళ్ళాడతా’. వదిన కారణంగా విడిపోయిన అన్నాచెల్లెళ్ళు ఇరవైయేళ్ళ తర్వాత తిరిగి ఆ వదిన వల్లనే కలుసుకుంటారు. ‘‘నా కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్‌లో నాకు లైఫ్ ఇచ్చిన సీరియల్ ‘నిన్నే పెళ్ళాడతా’ అన్నారు షీలా. దీంతో పాటు ‘మట్టి గాజులు’ అనే మరో సీరియల్‌లో హీరోయిన్ తల్లిగా మల్లీశ్వరి పాత్ర చేస్తున్నారు. కన్నీళ్ళు పెట్టించి ఎన్నో భావోద్వేగాలు పలికించే ఈ సీరియల్ ఇప్పటికి 200ఎపిసోడ్స్ పూర్తిచేసుకుందని చెప్పారు. ‘మొగలి రేకులు’ తర్వాత ఇప్పుడు మల్లీశ్వరిపాత్ర ఎంతో హైలైట్‌గా నిలిచింది అన్నారామె. అదేవిధంగా ‘అత్తారింటికి దారేది’ సీరియల్‌లో రిచ్ లేడీ లేఖగా నెగిటివ్ రోల్ చేస్తున్నారు షీలా. ఇప్పటికి 1680ఎపిసోడ్స్ పూర్తిచేసుకుందీ సీరియల్. ఇది పైకి నెగిటివ్‌లా కనిపించినాగానీ, తన భర్త, కూతురును తిరిగి పొందడానికి పోరాడేపాత్రలో ఎమోషన్స్ పండిస్తున్నారు షీలా.
యాక్టింగే నాకు ఎనర్జీ
‘‘యాక్టింగే నాకు ఎనర్జీ. నటిస్తేనే నాకు ఎనర్జీ వస్తుంది’’ అన్నారు షీలా. ‘‘నటన ఒక నిరంతర ప్రవాహం. ప్రతిరోజూ నేర్చుకోవాల్సిందే. కాసేపు కళ్ళు మూసుకుని, ‘ఈ సమస్య నాదే. ఆ సమస్యను అనుభివించేది నేనే’ అనుకుని ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తాను. నా ప్రతి పాత్రలోనూ ఇలాగే జీవించాను’’ అన్నారు షీలా.
సీరియల్స్‌లో మంచిని నేర్చుకోవాలి
‘‘వృద్ధులకు, ఒంటరితనంతో బాధపడుతున్నవారికి సీరియల్స్ వల్ల ఎంతో ప్రయోజనం ఉంది’’ అన్నారు షీలా. సీరియల్స్ చూస్తే ఆడవాళ్ళు చెడిపోతారంటారు కొందరు. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పు. మనం ఎలా ప్రవర్తించాలో నేర్పుతుంది సీరియల్. మంచి చెడుల విచక్షణ నేర్పుతుంది సీరియల్. ఎలా ఉండకూడదో చూపిస్తూ, ముందస్తు హెచ్చరికలు చేస్తుంది సీరియల్. ఇంట్లో టీవీ సీరియల్ చూస్తున్న భార్య మనసును భర్త అర్థం చేసుకుని మెలగాలి. భార్యాభర్తలు అవగాహనతో ఉంటూ టీవీ ద్వారా మంచిని నేర్పుకోవాలి. టీవీ ఛానల్స్‌వల్ల ఎంతోమందికి ఉపాథి అవకాశాలు పొందుతున్నారు కదా! అదేవిధంగా స్త్రీలు కూడా కిచెన్ రూమ్‌లో పెరిగిన టెక్నాలజీ నేపథ్యంలో, కొంత సమయాన్ని సమాజం కోసం ఖర్చు చేయాలి. ఇంటినీ, కెరీర్‌ను బ్యాలన్స్ చేసుకుంటూ స్త్రీలు ఆత్మవిశ్వాసంతో దేశం కోసం పాటుపడేందుకు ముందుకు రావాలి’’ అన్నారు షీలా.
జన్మజన్మలకూ ఆమే అక్కగా పుట్టాలి
‘‘మా తోబుట్టువు, మా అక్కయ్య ఊర్మిళ. అమ్మానాన్నలకంటే ఎక్కువగా నా కష్టసుఖాల్లో నాకు ఎంతో అండగా ఉంటుంది. నిజం చెప్పాలంటే మా అక్కయ్యే మా అమ్మ. ఆమెతోనే నా కష్టసుఖాలన్నీ షేర్ చేసుకుంటాను. జన్మ జన్మలకీ ఆమే మళ్ళీ నాకు అక్కయ్యగా పుట్టాలని కోరుకుంటున్నాను’’ అని గద్గదస్వరంతో చెప్పారు షీలా.
-తాతిరాజు