రేపటి నమ్మకంతో జీవిద్దాం..

ABN , First Publish Date - 2020-07-12T17:47:33+05:30 IST

రకుల్‌ప్రీత్‌సింగ్‌ అందాలబొమ్మ మాత్రమే కాదు.. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకునే ఆత్మవిశ్వాసి. లాక్‌డౌన్‌లో ఖాళీగా కూర్చోలేదు. కరోనా భయానికి వెరవలేదు. నిబ్బరం కోల్పోలేదు..

రేపటి నమ్మకంతో జీవిద్దాం..

రకుల్‌ లాక్‌డౌన్‌లో ఏం చూసింది.. ఏం తినింది.. ఏం చదువుకుంది.. ఇలా సరదా కబుర్లే కాదు.. సీరియస్‌ విషయాలూ చెప్పుకొచ్చింది..


రకుల్‌ప్రీత్‌సింగ్‌ అందాలబొమ్మ మాత్రమే కాదు.. ప్రతి సంక్షోభాన్నీ అవకాశంగా మలుచుకునే ఆత్మవిశ్వాసి. లాక్‌డౌన్‌లో ఖాళీగా కూర్చోలేదు. కరోనా భయానికి వెరవలేదు. నిబ్బరం కోల్పోలేదు.. తను మళ్లీ రీఛార్జి అవుతోంది.. ఆమె చెప్పిన కొన్ని కబుర్లు..


లాక్‌డౌన్‌లో ఒత్తిడికి గురయ్యారా?

నాలో ఎటువంటి ఆందోళన, భయాలు లేవు. ఎందుకంటే - మనకు అర్థం కావాల్సింది.. మనం ఎంత ఎత్తుకు ఎదిగినా.. ఈ అనంత విశ్వంలో కేవలం మానవ మాత్రులమే అన్నది గుర్తెరగాలి. ఈ కరోనా సంక్షోభం నేర్పే పాఠం అదే. ప్రకృతి కంటే మనం ఏమాత్రం గొప్పవాళ్లం కాదు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నిబ్బరం కోల్పోకూడదు. రేపటి నమ్మకంతో జీవించాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. మన చుట్టూ ఉన్న సమాజానికి, పర్యావరణానికి మేలు చేసే ఆలోచనలు చేయాలి. 


ఒకే చోట ఉండిపోయారా?

మార్చి 5 న ఇల్లు మారాను. 15న లాక్‌డౌన్‌ ప్రకటన వెలువడింది. నన్ను చూడటానికి మా బ్రదర్‌ వచ్చాడు. ఆ మరుసటి రోజే విమానాలన్నీ నిలిచిపోయాయి. దాంతో ఆయన ఊరికి వెళ్లలేకపోయాడు. అప్పటి నుంచి మూణ్ణెళ్లు నాతోనే ఉండిపోవాల్సి వచ్చింది. 


కరోనా హాలిడేలో ఏం చేశారు?

ఏం చేస్తాం.. అందరూ చేసేదే. పుస్తకాలు బాగా చదివాను. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు లెక్కలేనన్ని చూశాను. అయితే యోగా, ధ్యానం చేసేందుకు ఇంకొంత సమయాన్ని కేటాయించా. ఆన్‌లైన్‌లో మేనేజ్‌మెంట్‌ క్రాష్‌ కోర్సులు చేశా. ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌, స్టాక్స్‌, షేర్‌మార్కెట్‌ల గురించి మరింత లోతుగా తెలుసుకున్నా.


అంటే.. బీ-స్కూల్‌ గ్రాడ్యుయేట్లకు మీరు పోటీ అన్న మాట..

అమ్మో అంత లేదు. లాక్‌డౌన్‌ను సద్వినియోగం చేసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా. నన్ను నేను బిజీగా ఉంచుకోవడం కోసం చేశా. షూటింగ్‌లు మొదలైతే నేను మళ్లీ  బిజీ. నాకు మూడు జిమ్‌లు ఉన్నాయి. వాటికి అద్దెలు, సిబ్బందికి జీతాలు, నిర్వహణ ఖర్చులు ఉంటాయి కదా. వాటన్నిటినీ సమర్థవంతంగా నిర్వహించాలంటే.. ఆర్థిక జ్ఞానం మరింత మెరుగ్గా ఉండాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదు.


మీ ఫిట్‌నెస్‌ ఫిలాసఫీ..

ఎవరికైనా సరే ఫిట్‌నెస్‌ అనేది ఒక లక్ష్యం కాకూడదు. అదొక జీవనవిధానం కావాలి. వ్యాయామం అవసరం ఏంటని మనకు మనమే చెప్పుకోవాలి. అర్థం కావాలి. అప్పుడే మనలో మనకు నిత్య ప్రేరణ కలుగుతుంది. అదే ముందుకు నడిపిస్తుంది. అప్పుడు అసలైన వ్యాయామ జీవనశైలి అబ్బుతుంది. అది దీర్ఘకాలం కొనసాగుతుంది. నా ఫిట్‌నెస్‌ ఫిలాసఫీ అదే. కరోనా వంటి జబ్బుల్ని ఎదుర్కోవాలంటే.. శరీరాన్ని అందుకు సన్నద్ధం చేయాలి. వ్యాయామం చేస్తే.. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అప్పుడు దేహమే రోగాలపై యుద్ధం చేస్తుంది.


సాధారణ జీవితం మొదలవ్వగానే ఏం చేస్తారు..

షూటింగ్‌కు వెళ్లిపోతా. ఇప్పటికే వర్క్‌ను మిస్సయ్యా. నా జీవితంలో ఇదే అతి సుదీర్ఘ విరామం. నాకు పద్దెనిమిదేళ్ల వయసున్నప్పటి నుంచీ ఏదో ఒక పని చేస్తూనే ఉన్నా. ఒకచోట పనిలేకుండా ఇన్నాళ్లు ఉండటం ఇదే మొదటిసారి. మా ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు వర్క్‌ ఫ్రం హోమ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. నేను సినిమా నటిని కదా. ఇంటి నుంచి సినిమా చేసే అవకాశం లేదు. మళ్లీ ఎప్పుడెప్పుడు సెట్స్‌కు వెళాతానా.. ఎప్పుడు కెమెరా ముందు నిల్చుంటానా.. ఎదురుచూస్తున్నా.


వంటగదిలో ఏదైనా ప్రయోగం చేశారా.. 

లాక్‌డౌన్‌లో కేక్‌ చేద్దామని ప్రయత్నించా. అందులో తీపి కోసం చక్కెరకు బదులు అరటిపండు గుజ్జు కలిపా.. మొదటికే మోసం వచ్చింది. కుదరలేదు.. ప్చ్‌!. 


ఆపత్కాలంలో ఆఖరి వాక్యం..

‘‘కాలం మారుతోంది. భూముల ధరలు పెరుగుతున్నాయి. జనాభా అంతకంతకు రెట్టింపు అవుతోంది. విశ్వంలో జాగా వెతక్క తప్పదు. ఇక, కొత్త టెక్నాలజీనే మనల్ని కాపాడుతుంది. విశ్వగ్రహాలలో అడుగుపెట్టడం ఇప్పుడు అవసరం. మన భవిష్యత్తు సమస్యలకు అదొక పరిష్కారం..’’


ఇన్‌స్టాగ్రామ్‌లో మీ అభిమానుల సంఖ్య పెద్దదే. ఆ సంఖ్య 1.4 కోట్లు..

సామాజిక మాధ్యమాల్లో అందరికీ రిప్లయి ఇవ్వడం కుదరదు. వీలైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తుంటా. నా యూట్యూబ్‌ చానల్‌లో ప్రత్యేకించి చాలామంది స్కిన్‌కేర్‌ గురించి అడుగుతుంటారు. అందుకని వారి కోసం ఒక వీడియో రూపొందించి.. అప్‌లోడ్‌ చేశాను.  

ఆధారం: ఎగ్జిబిట్‌ మ్యాగజైన్‌

Updated Date - 2020-07-12T17:47:33+05:30 IST