దేవుడి కన్నా అమ్మే గొప్పది

ABN , First Publish Date - 2020-07-19T17:37:53+05:30 IST

నవీన్‌ చంద్ర... తొలి తెలుగు ఓటీటీ భానుమతిరామకృష్ణతో సక్సెస్‌ కొట్టిన హీరో. సినిమాల పై పిచ్చితో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడు. కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమా డబ్బాలని స్కూటర్లపై...

దేవుడి కన్నా అమ్మే గొప్పది

నవీన్‌ చంద్ర... తొలి తెలుగు ఓటీటీ భానుమతిరామకృష్ణతో సక్సెస్‌ కొట్టిన హీరో. సినిమాల పై పిచ్చితో పక్క రాష్ట్రం నుంచి వచ్చినవాడు. కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమా డబ్బాలని స్కూటర్లపై తెచ్చిన వీరాభిమాని. పోస్టర్‌ బాయ్‌, వావ్‌ అని కాకుండా వీడు మంచి యాక్టర్‌ అని జనం అనుకుంటే చాలని తన గురించి అనేక విషయాలని తెలియజేస్తున్నాడు.


భానుమతి రామకృష్ణను ఆదరిస్తోన్న మీ అందరికీ ముందుగా కృతజ్ఞతలు.. తొలి ఓటీటీ సినిమా కావడం వల్లేమో కానీ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షో లాగా జనం చూశారు.. ఆహాలో వస్తోందనగానే ఓ హైప్‌ క్రియేట్‌ అయింది. బ్రో.. వి ఆర్‌ వెయిటింగ్‌ అని సోషల్‌ మీడియాలో ఎన్నో మెసేజెస్‌. మూవీ చూశాక కంగ్రాట్చ్యులేట్‌ బ్రో.. అంటూ సందేశాలు.. రివ్యూలు కూడా అద్భుతంగా వచ్చాయి. నాకు ఇదంతా నిజమేనా అన్పించింది. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లో కాస్త పాజిటివ్‌ విషయాలు విన్నా ఎంతో సంతోషం కలుగుతుంది.. రోజూ ఎన్నో విషయాలు వింటున్నాం, చూస్తున్నాం. విశాఖలో అగ్నిప్రమాదం.. జాబ్‌ పోయిందని ఓ వ్యక్తి ఆత్మహత్య.. అతడు డిప్రెషన్లో ఉన్నాడు అనీ. నేను పదిహేనేళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నా.. కింద పడుతున్నా, పైకి లేస్తున్నా.. ఏదో ఒక ప్రాజెక్టులో ఉంటున్నా. నాకు నేను హ్యాపీనే. నన్ను అర్థం చేసుకునే కుటుంబం ఉంది, మద్దతుగా నిలిచే స్నేహితులు ఉన్నారు. బయటి ప్రపంచంలో జరుగుతోన్న సంఘటనల వల్ల స్నేహితులు ఫోన్‌లు చేసి ఎలా ఉన్నావ్‌, డిప్రెషన్లో లేవు కదా అంటూ మరింత కేరింగ్‌ తీసుకోవడం భలేగా అన్పించింది. ఈ కరోనా పరిస్థితులలో ఏం జరిగినా మనం ధైర్యంగా ఎదుర్కొనేలా సన్నద్ధంగా ఉండాలి.


పూర్తిగా మారిపోయా...

ఇంతకు ముందు నేను చేసిన పాత్రలన్నీ ఒకెత్తైతే భానుమతి రామకృష్ణలో నా పాత్ర మరొకెత్తు. దర్శకుడు శ్రీకాంత్‌ చెప్పినప్పుడు ఈకాలంలో కూడా ఇలాంటి వాళ్లు ఉంటారా అనే డౌట్‌ వచ్చింది. మెల్లగా ఆ పాత్రను అర్థం చేసుకోవడం కోసం కొంత కసరత్తు మొదలుపెట్టా. ప్రత్యేకంగా కొందరిని కలిశా. జీవితంలో ఎన్ని కష్టాలు ఉన్నా తమకున్న దాంతో సంతృప్తిగా బతికేవాళ్లు మనచుట్టూనే చాలా మంది ఉన్నారు. వారిని అంతగా పట్టించుకోం. కానీ ఈ పాత్ర కోసం అలాంటి వాళ్ల దగ్గరకు వెళ్లాను. మా ఫ్లాట్స్‌ వాచ్‌మెన్‌, వీధి చివరన ఉండే ఓ చిరు వ్యాపారి, మా ఊర్లో ఉన్న రైతు స్నేహితులు... వీళ్లందరినీ చూసినప్పుడు అన్పించింది. రామకృష్ణ వాళ్లలోనే కాదు నాలోనూ ఉన్నాడు, మీలో ఉన్నాడు. అందరిలో మంచితనం ఉంటుంది. కానీ చూపించే విధానం మనలో మారుతుంటుంది.. మా అమ్మ ఏ పనికోసం బయటికి వెళ్లినా కుంకుమ బొట్టు పెడుతుంది. ఎందుకమ్మా. ఇందంతా రాముడు మంచి బాలుడు టైపులో కన్పిస్తే జనాలు ఏమనుకుంటారు అనేవాడిని. లేదురా.. నీకు ఏ ఆపదా రాకూడదు, మంచే జరుగుతుంది. హ్యపీగా ఉంటావ్‌ అనేది. ఈ సినిమాలోనూ అంతే దేవుడి కంటే అమ్మే బాగుంటుందని చెప్పే మనిషి తను. నాకూ అమ్మంటే అంతే. ఇళ్లు ఊడ్చేవాడిని, అమ్మకు హెల్ప్‌ చేసేవాడిని. ఇవన్నీ ఈ పాత్రలో ఉపయోగపడ్డాయి. 


ప్రపంచమంతా చూస్తుంది..

మునుపటి రోజులు పోయాయి. సినిమా ఓ ప్రాంతానికి పరిమితం కాలేదు. నీ వర్క్‌ని ప్రపంచం అంతా చూస్తోంది. అంటే నటుడిగా నిన్ను నీవు నిరంతరం మలుచుకుంటూనే ఉండాలి. మొదటి నుంచి నేను కీరోలా, హీరోనా, విలనా అని చూడను. ఏ రోల్‌ వచ్చినా కూడా దాన్నుంచి సినిమా ముందుకు సాగేదిగా ఉంటే చాలని భావిస్తా. గొప్పగా నటించాడు అనుకుంటే చాలు. అందాలరాక్షసి, దళం, ఎవరు, అరవిందసమేత.. ఈ పాత్రలన్నీ నాకు పేరుతెచ్చినవే. కానీ ఈ చిత్రం ఎంత పేరు తెచ్చిందంటే అందరూ నన్ను రామకృష్ణ అని పిలవడం మొదలుపెట్టారు ఆ పాత్రలోని మంచితనం నన్ను నాకే కొత్తగా పరిచయం చేసింది. నన్ను పూర్తిగా మార్చేసింది.. ఆ మంచి రామకృష్ణ ఎప్పటికీ నాలో ఉంటాడు.

 

తెలుగు సినిమాలపై ఉన్న పిచ్చ ప్రేమతో కర్ణాటక లోని బళ్లారి నుంచి వచ్చాను. మేం తమిళులం. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ నుంచి నా జీవితం మొదలైంది.. సింగిల్‌ రూమ్‌లో, సొంతంగా వండుకుంటూ అప్పట్లో ఉండేవాడిని. 


అమ్మ నాతో ఎప్పుడూ ఉంటుంది. కానీ ఏదో పని మీద బళ్లారి వెళ్లింది. లాక్‌ డౌన్‌ మొదలవడంతో నేనొక్కడినే ఇక్కడ ఉండిపోయా. నాకు తోడుగా ఉంది హ్యాపీ. నా పెట్‌ డాగ్‌..


రెండేళ్లుగా వేగన్‌గా మారిపోయా. లాక్‌ డౌన్లో నేనే కూరగాయలు తెచ్చుకునేవాడిని. అనేక రంగుల కూరగాయల్ని చూడడం, వాటిని శుభ్రపరచడం, స్వయంగా వండుకోవడం ఈ ప్రాసెస్‌ అంతా భలేగా అన్పించేది. ఈ చిన్న చిన్న విషయాలే ఎంతో సంతోషాన్నిస్తుంటాయి..


తెలుగు, మళయాలం, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషుతో సహా ఆరు భాషలు వస్తాయి. ఈ రెండు నెలల్లో అనేక భాషల సినిమాలను చూశాను. నటుడిగా మరింత సాధన చేయడానికి ఈ కాలాన్ని సద్వినియోగపరచుకున్నా.


బ్రేకింగ్‌ బ్యాడ్‌ వెబ్‌ సిరీస్‌ భలేగా నచ్చింది. మొత్తం సీజన్స్‌ అయిదురోజుల్లో చూసేశా. ఒక్కో షాట్‌ ఎంత అద్భుతంగా తీశారో చెప్పడానికి లేదు. ప్రధాన పాత్ర వేసిన వ్యక్తి తొలి సీరిస్‌లో ఎలా చేశాడో ఆఖరు సీరిస్‌లో కూడా అలాగే చేశాడు. ఆద్యంతం ఒకే హావభావాల్ని కనబరచాడు. మూడేళ్లుగా సాగిన ఆ షూటింగ్‌ కోసం అతడు ఎంతగా ప్రిపేర్‌ అయి ఉంటాడో ఊహించడం కష్టం.


నాకు స్విమ్మింగ్‌ ఇష్టం. ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ ని. ఒకప్పుడు హై ఎండ్‌ బైక్స్‌, కార్స్‌, వాచెస్‌, షూస్‌ పట్ల క్రేజ్‌ ఉండేది. క్రమంగా అది పోయింది. పైపై మెరుగులతో కాదు నటుడిగా మెప్పించాలి అనే భావం ఏర్పడింది. 


- డి.పి.అనురాధUpdated Date - 2020-07-19T17:37:53+05:30 IST