రామాయణ, మహాభారత్‌ సీరియళ్లతో కాలక్షేపం

ABN , First Publish Date - 2020-05-26T09:25:18+05:30 IST

వయోభారం వల్ల కొద్దిరోజులుగా కృష్ణవేణి ఇల్లు దాటడం లేదు.

రామాయణ, మహాభారత్‌ సీరియళ్లతో కాలక్షేపం

మీర్జాపురం రాణి, తొలితరం సినీ నటి, నిర్మాత కృష్ణవేణి


‘‘ఎన్టీఆర్‌, సూర్యాకాంతం వంటి నట దిగ్గజాలను, నేపథ్య గాయకుడిగా సంగీత సామ్రాట్‌ ఘంటసాలను వెండితెరకు పరిచయం చేసిన నిర్మాత, ‘‘గొల్లభామ’’ సినిమా కథానాయకి, మీర్జాపురం రాణి, ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత కృష్ణవేణి. ఆమె వయసు 96 ఏళ్లు. లాక్‌డౌన్‌ వేళ కృష్ణవేణిని ‘ఆంధ్రజ్యోతి’ పలకరించింది. ఈ సందర్భంగా ఆమె అలనాటి కొన్ని మధుర జ్ఞాపకాలను, తన దైనందిన జీవితంలోని మరికొన్ని విశేషాలను పంచుకున్నారు. 


హైదరాబాద్‌ సిటీ, మే 25(ఆంధ్రజ్యోతి): వయోభారం వల్ల కొద్దిరోజులుగా కృష్ణవేణి ఇల్లు దాటడం లేదు. ఆమె ప్రపంచం చాలా భిన్నమైనది. అది ఎంతగా అంటే, ఆమెకు కరోనా గురించి తెలియనంతగా. ఈ వయసులో ఆమెను ఆందోళన పెట్టడం ఎందుకని, కుటుంబ సభ్యులూ కొవిడ్‌ - 19 గురించి వివరించలేదు. అయితే, ‘జ్వరాలు వస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాలి’ అని మాత్రం చెప్పారు. దాంతో కరోనా కాలాన్నీ ఆమె జ్వరాల కాలం అనుకుంటున్నారు. కృష్ణవేణి జీవనశైలి, ఆహార అలవాట్లు నేటి తరానికీ స్ఫూర్తిదాయకం. ఆమె సమయ పాలనకు అధిక ప్రాధాన్యమిస్తారనడానికి నిబద్ధతతో సాగే దైనందిన జీవితమే నిదర్శనం. ఆ వివరాలు ఆమె మాటల్లో.. ‘‘రోజూ తెల్లవారు జామున ఆరింటికల్లా నిద్ర లేస్తాను. మా ఇంటి పరిసరాల్లోనే ఉదయం అరగంట, సాయంత్రం ఒక గంట నడుస్తాను. నాకు డయాబెటీస్‌, బీపీ వంటి ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ కొద్దిరోజుల క్రితం ఎడమకన్నుకి కాటరాక్టు ‘(శుక్లం) ఆపరేషన్‌ జరిగింది.


దురదృష్టవశాత్తూ ఆపరేషన్‌ ఫెయిల్‌ అవడంతో, చూపు తగ్గింది. పుస్తకాలు కూడా చదవలేకపోతున్నా. లేకుంటే నాకు పుస్తకపఠనం చాలా ఇష్టం. మొదటి నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు ఎక్కువగా చదవడం అలవాటు. ఇప్పుడు టెలివిజన్‌లో ‘శ్రీరాఽధాకృష్ణ’, ‘రామాయణం’, ‘మహాభారతం’, ‘హరహరమహదేవ్‌’ హిందీ సీరియళ్లు మళ్లీ ప్రసారం చేస్తున్నారు కదా. వాటిని మా కవిత(సహాయకురాలు), నేనూ క్రమం తప్పకుండా చూస్తున్నాం. ఆ అమ్మాయికి హిందీ రాదు కనుక తనకి ఆ పాత్రల సంభాషణలు చెబుతుంటా. ఇక బంధు, మిత్రుల ఫోన్‌ పరామర్శలతో రోజులో కొంత కాలక్షేపమవుతోంది. సినీ ఇండస్ట్రీ నుంచి నిర్మాత ఎమ్మెస్‌ రాజు, అక్కినేని నాగేశ్వరరావు గారి పెద్ద కోడలు జ్యోత్స్న, కూతురు నాగసుశీల రెగ్యులర్‌గా నాతో, మా అమ్మాయి రాజ్యలక్ష్మీ అనురాధా దేవితోనూ మాట్లాడుతుంటారు. మొక్కల పెంపకం అంటే నాకు ఇష్టం. రోజులో కాసేపైనా మొక్కలను చూస్తూ, అలా మౌనంగా కూర్చుండిపోతా.! ఇంటికొచ్చిన అతిథులకు భోజనం వడ్డించడమంటే చాలా ఇష్టం. ఈ జ్వరాల వల్ల ఇప్పుడు బంధు, మిత్రులెవరూ రావడం లేదు. 


దాసరితో కార్డ్స్‌ ఆట..

‘సతీ అనసూయ’ సినిమాలో నటిస్తున్నప్పుడు నాకు పదేళ్లు. అప్పుడే గాయని బాలసరస్వతి పరిచయం. ఆ సినిమా షూటింగు కోల్‌కతాలో జరిగింది. అందులో అనసూయ పాత్రధారిగా నేను పాడిన పాటలు, పద్యాల సీడీని మొన్నీమధ్య వీఏకే రంగారావు నాకు కానుకగా ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నేను అందుకున్న అరుదైన బహుమతి అంటే అదే.! ఇప్పుడు ఆ పాటలు వింటుంటే, అవి పాడింది నేనేనా అని ఆశ్చర్యమేస్తోంది. ‘‘మనదేశం’’ సినిమా సబ్జెక్టు... జాతీయోద్యమం నాటి కాంగ్రెస్‌ రాజకీయాలకు కాస్త రిలేటెడ్‌గా ఉంటుంది. కనుక ఆ సినిమా తీయడం మీర్జాపురం రాజాగారికి ఇష్టం లేదు. దాంతో ఆ సినిమా నిర్మాణం అంతా నా ఆసక్తి, చొరవ మేరకు సాగాయి. ఆ చిత్రంలో పోలీసు పాత్రకి ఎల్వీ ప్రసాదు గారు నందమూరి తారక రామారావుని ఎంపిక చేశారు.


అప్పుడు ఎన్టీఆర్‌కి నేను రూ.250 అడ్వాన్సుగా ఇవ్వడం నాకు బాగా జ్ఞాపకం. నా జీవితంలో అదొక అరుదైన సందర్భం. తర్వాత రామారావు ఉన్నత స్థాయికి ఎదిగినా నన్ను ఎప్పుడూ ‘‘మా మొదటి ప్రొడ్యూసర్‌ గారు’’ అని గౌరవించేవారు. ఆయన చాలా మర్యాదస్థుడు. దాసరి నారాయణరావుకి నేనంటే చాలా అభిమానం. మేము తల్లీబిడ్డల్లా ఉండేవాళ్లం. మా బ్యానర్‌లో ఆయన రెండు సినిమాలు చేశారు. నాకు ప్లేయింగ్‌ కార్డ్స్‌ ఆడడం ఇష్టం. అప్పుడప్పుడు నేనూ నారాయణరావు కలిసి కార్డ్స్‌ ఆడేవాళ్లం. 


నా రోజూవారీ ఆహారంలో...!

నాకు ఆరోగ్యసమస్యలు పెద్దగా లేవు. కనుక ఆహారం విషయంలో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవడమంటూ ఏమీలేదు. మొదటి నుంచి నా ఆహార అలవాట్లు ఎలా ఉన్నాయో, ఇప్పుడూ అవే.! ఉదయం ఏడుగంటలకు కప్పు కాఫీ తాగుతా. తొమ్మిదింటికి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తాను. అందులో పెసరట్టు, దోస, ఇడ్లీ, పూరి, పొంగల్‌, ఎగ్‌రోస్ట్‌ ఇలా రోజుకి ఒక ఐటెం ఉంటుంది. తర్వాత ఒక గ్లాసు యాపిల్‌తో చేసిన మిల్క్‌షేక్‌ తాగుతాను. మధ్యాహ్నం ఒంటి గంటకి భోజనం అయిపోతుంది. నాకు చికెన్‌, ఫిష్‌ వంటకాలు చాలా ఇష్టం. కనుక వారంలో గురు, శని వారాలు మినహా మిగతారోజుల్లో మాంసాహారం ఎక్కువగా తింటాను. వెజిటేబుల్‌ కర్రీస్‌ తినడం తక్కువే. సాయంత్రం నాలుగింటికి కప్పు టీ తాగుతాను. ఐదు గంటలకు పకోడి, బజ్జీలు, ఆలు చిప్స్‌ వంటివేవైనా తింటాను.


ఆయిల్‌ ఫుడ్‌ బాగానే తీసుకుంటా. నూనె పదార్థాలు శరీరానికి మంచిది కాదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ నూనెలేని వంటకాలను తినలేను. నా చిన్నతనం నుంచి నూనెతో వండినవాటిని ఎక్కువగా తినడమే నాకు అలవాటు. రాత్రి తొమ్మిదిగంటలకు రెండు చపాతీలు, ఒక అరటిపండు తింటాను. ఒక గంట తర్వాత గ్లాసు పాలు తాగి నిద్రపోతాను. నా భోజనంలో ఫ్రూట్స్‌ తప్పనిసరిగా ఉంటాయి. అన్ని పండ్లూ తింటాను. దానిమ్మజ్యూస్‌ ఎక్కువగా తీసుకుంటా. ఒక్కోసారి లంచ్‌, డిన్నర్‌లోనూ నాన్‌వెజ్‌ తింటాను. మితంగా తినడం, ఆస్వాదిస్తూ తినడం మొదటి నుంచి నాకు అలవాటు’’ అని కృష్ణవేణి చెబుతున్నారు.


నా జ్ఞాపకాల్లో గాంధీ...

పెద్ద వయసు వల్ల జ్ఞాపకశక్తి తగ్గింది. అప్పుడప్పుడు కొన్ని విషయాలు మాత్రం గుర్తొస్తుంటాయి. మద్రాసులోని మా శోభనాచల స్టూడియోలో బ్రేక్‌ఫాస్ట్‌, మధ్యాహ్నం భోజనం, టీ అందరికీ ఉచితంగా అందించేవాళ్లం. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో మద్రాసులోని స్టూడియోకి తాళం వేసి, విజయవాడ వెళ్లాం. అక్కడ బందరురోడ్డు, సత్యనారాయణ పురం ప్రాంతాల్లో రెండు పెద్ద బిల్డింగులను లీజుకి తీసుకొని స్టూడియో నిర్వహించాం. అప్పుడే ‘‘నారద నారది’’ సినిమా విజయవాడలో తీశాం. అందులో సూర్యకాంతంకి సహాయనటిగా అవకాశం ఇచ్చాం. మేము విజయవాడలో ఉన్నప్పుడు సినిమా షూటింగులు లేకపోతే, నా భర్త మీర్జాపురం రాజా వెంకట రామయ్య అప్పారావు బహదూర్‌ గారు, నేనూ కలిసి కొండపల్లి అడవుల్లో తుఫాకీ షూటింగ్‌కి వెళ్లేవాళ్లం.


వారు తుఫాకీ ఎక్కుపెట్టగానే, నేను కళ్లు మూసుకొనేదాన్ని. ఒకసారి ఆయన చిరుతపులిని వేటాడడం నాకు బాగా గుర్తు. ఆ దృశ్యం ఇప్పటికీ నా కళ్లముందు మెదులుతుంది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో మా వారు జస్టిస్‌ పార్టీ నాయకుడు. నేను కాంగ్రెస్‌ అభిమానిని. ‘తిలక్‌ స్వరాజ్య నిధి’ సేకరణ కోసం మద్రాసు వచ్చిన మహాత్మాగాంధీ కోడంబాక్కంలోని మా బంగ్లా ముందుగా ఊరేగింపుగా వెళ్తున్నారు. నిధికి రూ.500 విరాళమిస్తే, ఆయన ఇంటిలోకి వస్తారు. మా వారికి ఇష్టం లేకపోవడంతో గాంధీ గారిని మా ఇంటికి ఆహ్వానించలేక పోయాం. 

Updated Date - 2020-05-26T09:25:18+05:30 IST