కోపమే కాదు.. నాకు తిక్క కూడా ఎక్కువే: కంగనా రనౌత్‌

ABN , First Publish Date - 2020-02-26T17:10:53+05:30 IST

సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. తన కామెంట్స్‌తో టాప్‌ స్టార్స్‌ను కూడా కంగారు పెట్టే ఈ భామ

కోపమే కాదు.. నాకు తిక్క కూడా ఎక్కువే: కంగనా రనౌత్‌

సినిమాలతో కన్నా వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో ఉండే బాలీవుడ్‌ హీరోయిన్‌ కంగనా రనౌత్‌. తన కామెంట్స్‌తో టాప్‌ స్టార్స్‌ను కూడా కంగారు పెట్టే ఈ భామ నటిగా అదే స్థాయిలో పేరు తెచ్చుకుంది. ఛాలెంజింగ్ రోల్స్‌లో నటిస్తూ బాలీవుడ్ బెస్ట్ హీరోయిన్‌లలో ఒకరుగా గుర్తింపు తెచ్చుకుంది. కాగా, ఇటీవల కంగనాకి.. ‘ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లలో కంగనాకి కోపం ఎక్కువ అని అంటున్నారు నిజమేనా?’ అనే ప్రశ్న ఎదురైనప్పుడు ‘కోపం ఒక్కటే కాదు, నాకు తిక్క కూడా ఎక్కువే’ అని సమాధానం ఇచ్చిందట. ఆ వివరాల్లోకి వెళితే..


ఇటీవల హీరోయిన్‌గా గ్లామర్‌ పాత్రల కన్నా, తల్లి పాత్రలకే ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడానికి కారణం?

‘మణికర్ణిక’ తరువాత ‘పంగా’లోనే తల్లి పాత్ర చేశాను. పంగా కథ వింటున్నప్పుడే కళ్ళల్లోంచి నీళ్ళు వచ్చేశాయి. నా మనసుని అంతగా కదిలించింది ఈ సినిమా కథ. నేను తల్లిని కాకపోయినా ఈ సినిమాల ద్వారా తల్లి పడే బాధలు స్వయంగా తెలుసుకునే అవకాశం కలిగింది. 


పెళ్ళి చేసుకోబోతున్నారట, నిజమేనా?

గతంలో నాకు పెళ్ళి మీద అంత మంచి అభిప్రాయం లేదు. అందుకే అసలు జీవితంలో పెళ్ళి చేసుకోకూడదని డిసైడ్‌ అయ్యా.. కానీ ఇప్పుడు నా అభిప్రాయం మారిపోయింది. అందుకు కారణం ‘పంగా’ దర్శకురాలు అశ్వినీ అయ్యర్‌, ఆమె భర్త నితేష్‌ తివారి. ఎంతో అన్యోన్యంగా ఉండే వారిని చూసిన తరువాత పెళ్లి మీద నా అభిప్రాయం మారింది. అందుకే త్వరలో పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నా. 


సోషల్‌ మీడియాకు దూరంగా ఎందుకుంటారు?

సోషల్‌ మీడియా అనేది ఒక అంతులేని ప్రపంచం. నేను ఇప్పటికే ఒక ప్రపంచంలో నిలదొక్కుకోవడానికి తంటాలు పడుతున్నా. రెండు ప్రపంచాలు ఒకేసారి నేను మేనేజ్‌ చేయలేను. అంతేకాదు సోషల్‌ మీడియా కోసం చాలా సమయం వెచ్చించాల్సి ఉంటుంది. అది నా వల్ల కాదు. అందుకే సోషల్‌ మీడియాలో నేను మీకు కనిపించను. దీని గురించి ఎవరేమనుకున్నా పట్టించుకోను.


ఉన్నట్టుండి దర్శకత్వం మీద మనసు మళ్ళడానికి కారణం?

నేను రచనలో శిక్షణ పొందినా దర్శకత్వం అంటేనే నాకిష్టం. డైరెక్టర్‌కి ఆల్‌ రౌండ్‌ లీడర్‌ షిప్‌ లక్షణాలు కావాలి. అది చాలా ఛాలెంజింగ్‌ రోల్‌. ఐ లవ్‌ డైరెక్టర్‌ జాబ్‌. అవి నాలో ఉన్నాయనే అనుకుంటున్నాను. టైటానిక్, జురాసిక్‌ పార్క్‌ వంటి బ్లాక్‌ బస్టర్స్‌ని కూడా పాశ్చాత్యులు కేవలం 70, 80 రోజుల్లో తీసేస్తున్నారు. కాని బాలీవుడ్‌లో ఏదైనా భారీ చిత్రం అంటే ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఎంతకాలం మనం సెట్స్‌ మీద ఉంటే అంత ఎక్కువగా నిర్మాణ వ్యయం పెరుగుతుంది. మన దగ్గర మార్పురావాల్సి ఉందనిపిస్తుంది. 


మీకు కోపం ఎక్కువంటారు?

నాకు కోపం ఒక్కటే కాదు, తిక్క కూడా ఎక్కువంటారు. నా విషయంలో ఆ రెండింటికీ ఓ లెక్క ఉంది. నాకు పట్టరాని కోపం వచ్చినా అది నిర్మాణాత్మకంగా ఉంటుంది. ప్రతి పనికీ నాకో విజన్‌, ప్రణాళిక ఉంటుంది. నేను ఎప్పుడు ఆగ్రహం వ్యక్తం చేసినా అది నా మంచికే దారితీసింది. నాలో చిన్న పిల్లల మనస్తత్వం ఉంది అది ఎవరి లాజిక్‌కూ అందదు. 


మీరు డబ్బును లెక్క తెలియకుండా ఖర్చు చేస్తారంటారు ఎంత వరకు నిజం?

డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తానని అందరూ అనుకుంటారు. కానీ నేను డబ్బును తెలివిగా వెచ్చిస్తాను. నన్ను ప్రేమించే వారి కోసం ఖర్చు చేసేందుకు వెనుకాడను.. అంతే కాకుండా సామాజిక కార్యక్రమాల కోసం ఖర్చు  చేసే వాటి గురించి లెక్కలు వేసుకోను. ఇవన్నీ చూసి కంగనా ఖర్చు మనిషి అనుకుంటారని నాకు తెలుసు. అలాంటి మాటలకు నేనేమీ భయపడను. బాధపడను. నేనేమిటో, నాకూ, నా వారికి తెలుసు మిగతా వారికి తెలియాల్సిన అవసరం లేదు. 

–భరత్‌ కుమార్‌

Updated Date - 2020-02-26T17:10:53+05:30 IST