ఆయనంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం: మృణాళిని రవి

ABN , First Publish Date - 2020-02-04T18:24:04+05:30 IST

బ్యాక్‌గ్రౌండ్‌ అంటూ ఏమీ లేకుండా కేవలం సోషల్‌ మీడియా ద్వారా హీరోయిన్లు అయిన వారి సంఖ్య చాలా తక్కువ. తాజాగా అలాంటి జాబితాలో చేరింది మృణాళిని రవి

ఆయనంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం: మృణాళిని రవి

బ్యాక్‌గ్రౌండ్‌ అంటూ ఏమీ లేకుండా కేవలం సోషల్‌ మీడియా ద్వారా హీరోయిన్లు అయిన వారి సంఖ్య చాలా తక్కువ. తాజాగా అలాంటి జాబితాలో చేరింది మృణాళిని రవి. ఓ పక్క సాఫ్ట్‌వేర్‌ జాబ్‌, మరో పక్క డబ్‌స్మాష్‌ వీడియోలు చేస్తూ వాటిని సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తూ బిజీ బిజీగా ఉండే మృణాళినికి ఒక్కసారిగా మోడలింగ్‌లో అవకాశం వచ్చింది. ఇక ఆ తరువాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. తొలుత కోలీవుడ్‌లోనూ, ఆ తరువాత టాలీవుడ్‌లోనూ బిజీ అవుతున్న మృణాళినితో....

 

మీ గురించి...

పాండిచ్చేరిలో పుట్టాను. బెంగళూరులో పెరిగాను. మా పేరెంట్స్‌ బెంగళూరులోనే స్థిరపడ్డారు. ఇంజినీరింగ్‌ పూర్తిచేసిన తరువాత ప్రముఖ ఎంఎన్‌సిలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా జాబ్‌ వచ్చింది. సినిమాల్లోకి వస్తానని అస్సలు ఊహించలేదు. ఏదో సరదాగా డ్యాన్స్‌ చేయడం, డబ్‌స్మాష్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసేదాన్ని. అయితే నేను పోస్టు చేసిన వీడియోలు వైరల్‌ కావడంతో మోడలింగ్‌ అవకాశాలు వచ్చాయి. వాటిని చేస్తూ సినిమా చాన్స్‌ కోసం ప్రయత్నించాను.

 

సినిమాల్లోకి వస్తానంటే మీ పేరెంట్స్‌ ఏమనలేదా?

సినిమాల్లో నటిస్తానంటే ముందు మా పేరెంట్స్‌ అస్సలు ఒప్పుకోలేదు. చాలా కష్టపడి వారిని ఒప్పించాల్సి వచ్చింది. సినిమాల్లో సక్సెస్ కాకుంటే మళ్ళీ వచ్చి జాబ్లో చేరతానని మా పేరెంట్స్‌కి మాట ఇచ్చి, సినిమాల్లోకి వచ్చాను. కోలీవుడ్‌లో నా మొదటి సినిమా సూపర్ డీలక్స్ కోసం జాబ్‌కి లీవ్ పెట్టి షూటింగ్‌కు హాజరయ్యాను. మొదటి సినిమా తర్వాత ఒకేసారి తెలుగు, తమిళ సినిమాల్లో ఛాన్స్ రావడంతో ఇక జాబ్ చేస్తూ నటన కష్టం అనుకున్నాను. వెంటనే జాబ్‌కి రిజైన్‌ చేసి పూర్తిస్థాయి నటిగా మారిపోయాను. ఇప్పటికైనా సినిమాలకు నేను అన్‌ఫిట్‌ అనుకున్నప్పుడు వెంటనే నా చదువుకు తగిన ఉద్యోగం సంపాదించుకోగలను అన్న నమ్మకం నాకుంది.

 

మొదటిసారి కెమెరా ముందు నిలబడి నటించడం ఎలా అనిపించింది?

నేను ఒక్కదాన్నే ఉన్న సమయంలో డబ్‌స్మాష్‌ వీడియోలు చేయడం వేరు వందలాదిమంది జనం మధ్య కెమెరా ముందు నిలబడి నటించడం వేరు. ముందు చాలా భయంగా, సిగ్గుగా అనిపించేది. కొద్దిరోజులకే ఆ భయం, సిగ్గూ పోయాయి. ముఖ్యంగా ‘గద్దలకొండ గణేష్‌’ చేసే సమయంలో హరీష్‌ శంకర్‌గారు ఇచ్చిన సపోర్ట్‌ ఎప్పటికీ మరచిపోలేను. కానీ, ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఓణి రూపంలో నాకు కష్టం ఎదురైంది. దాదాపు 40రోజులు ఓణి మీదే షూటింగ్‌ చేయాల్సి వచ్చింది. ఏదో శుభకార్యాలు, ఫంక్షన్ల సమయంలో ఓణి వేసుకోవడం అలవాటు కానీ, అదేపనిగా ఓణి వేసుకోవడం కష్టమనిపించింది.

 

‘గద్దలకొండ గణేష్‌’ తమిళ్‌ డబ్బింగ్‌ కదా... తమిళ సినిమా చూశారా?

ఈ సినిమా ఒప్పుకునే ముందే ‘జిగర్తాండా’ చూశాను. అందులో లక్ష్మీరాయ్‌ చేసిన పాత్ర నేను తెలుగులో చేశాను. తెలుగులో నేను పోషించిన బుజ్జమ్మ పాత్రకీ చాలా తేడా ఉంది. తెలుగుకు వచ్చేసరికి నా పాత్రలో చాలా మార్పులు చేర్పులు చేశారు. సో...లక్ష్మీరాయ్‌ పాత్రకీ, నా పాత్రకీ పోలికే లేదని చెప్పగలను.

 

మొదటిసారి తెలుగు సినిమా చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది?

భాష ఇబ్బంది అవుతుందని బాగా భయపడ్డాను. కానీ హరీష్‌ శంకర్‌గారూ, నిర్మాతగారు, యూనిట్‌ సభ్యులు ఇచ్చిన సపోర్టు ఎప్పటికీ మరచిపోలేను. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకోవడం మొదలుపెడుతున్నాను. నా తరువాతి సినిమాకి బాగా అర్ధంచేసుకోగలనని అనుకుంటున్నాను.

 

తెలుగు హీరోలలో ఎవరు బాగా ఎక్కువ ఇష్టం?

అందరూ ఇష్టమే. కాకపోతే విజయ్‌దేవరకొండ అంటే కొద్దిగా ఎక్కువ ఇష్టం. ‘అర్జున్‌రెడ్డి’ చూసి ఆయన వీరాభిమానినైపోయాను.

                                                                         –కె.రామకృష్ణ

Updated Date - 2020-02-04T18:24:04+05:30 IST