వారం కిందట జమునకు బాలయ్య ఫోన్ చేసి..
ABN , First Publish Date - 2020-05-25T08:18:17+05:30 IST
నా ఆరోగ్యం పట్ల మా అమ్మాయి స్రవంతి చాలా స్ట్రిక్ట్. మేముండేది గేటెడ్ కమ్యూనిటీలో.! మాయదారి వైరస్ ఎక్కడ ..

అమ్మా.. బాగున్నారా
లాక్‌డౌన్ కాలంలో జమున జ్ఞాపకాలు
‘‘తెలుగు సినిమా స్వర్ణయుగానికి ప్రతినిధి ప్రముఖ నటి జమున.
వెండితెర సత్యభామగా ప్రేక్షకుల మదిలో సుస్థిరమైన ఆమె
వయసు 84ఏళ్లు. ‘‘మిస్సమ్మ’’ సినిమాలోని
‘బాలనురా మదనా’ పాట తాలూకూ జ్ఞాపకాన్ని నెమరేసు
కొంటూ సరదాగా సాగే జమున డ్యాన్స్ వీడియో సామాజిక
మాధ్యమాల్లో ఇప్పుడొక సంచలనం. అందులో ఆమె హుషారు
చూసినవారెవరైనా ‘వావ్’ అంటూ కళ్లప్పగించాల్సిందే.!
లాక్‌డౌన్‌తో జమున రోజువారీ జీవితంలో వచ్చిన మార్పులు,
తీసుకొంటున్న ఆరోగ్య జాగ్రత్తల గురించి ఆమె మాటల్లోనే..!
హైదరాబాద్ సిటీ, మే24 (ఆంధ్రజ్యోతి):నా ఆరోగ్యం పట్ల మా అమ్మాయి స్రవంతి చాలా స్ట్రిక్ట్. మేముండేది గేటెడ్ కమ్యూనిటీలో.! మాయదారి వైరస్ ఎక్కడ పొంచివుందోనని భయంతో నా కూతురు నన్ను లిఫ్టు కూడా తాకనివ్వడం లేదు. దాంతో నేను మా ఫ్లాట్ దాటి బయటకొచ్చి రెండు నెలలు అవుతోంది. ఇప్పుడైనా అపార్టుమెంట్ లాంజ్ వరకూ వచ్చానంటే అదీ ‘ఆంధ్రజ్యోతి’ కోసమే..! రోజూ తెల్లవారు జామున ఆరింటికి నిద్రలేస్తాను. ‘పక్కదుప్పట్లు మడతపెట్టడం కూడా శరీరానికి ఒక విధమైన వ్యాయామమే’ అని ‘‘గుండమ్మ కథ’’ సినిమా షూటింగ్ టైంలో మా హీరో అక్కినేని నాగేశ్వరరావు గారు చెప్పారు. అప్పటి నుంచి నా పక్కదుప్పట్లు నేనే సర్ధుకుంటా.! ఒక రకంగా ఈ పనితోనే నా దినచర్య ప్రారంభమవుతుంది. తర్వాత కొద్దిసేపు యోగా, సూర్యనమస్కారాలు చేస్తాను. ఆపై పూజా కార్యాక్రమాలు ముగించుకొని, బ్రేక్‌ఫాస్ట్ చేయడం కొన్నేళ్లుగా అలవాటు. ఇక ప్రతిరోజూ ఏదో ఒక సాంస్కృతిక కార్యక్రమానికి హాజరవడంతో కాస్త కాలక్షేపమయ్యేది. లాక్‌డౌన్‌తో నా డైలీ ప్లాన్ పూర్తిగా మారిపోయింది.
పొద్దస్తమానం ఎయిర్‌కండీషనర్ రూమ్‌లో ఉండడం వల్ల కాస్త బద్దకం పెరిగింది. ఇప్పుడు ఆలస్యంగా నిద్రలేస్తున్నా. దాంతో వ్యాయామమూ చేయలేకపోతున్నా. కానీ కొద్దిసేపు ప్రాణాయామం మాత్రం చేస్తా. ఒంట్లో ఓపిక తగ్గడంతో బ్రేక్‌ఫాస్ట్ తిన్నాకే, పూజలో కూర్చుంటున్నా. ఉబుసుపోక కొన్ని పాత సినిమాలు, వార్తా చానళ్లు ఈ మధ్య ఎక్కువ చూస్తున్నా. కొంతకాలం రాజకీయాల్లోనూ ఉన్నాను కనుక, పొలిటికల్ న్యూస్ బాగా ఫాలో అవుతుంటా. తెలంగాణలో పరిపాలన కొంత మెరుగ్గా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఏమీ బాగాలేవు అని అర్థమవుతోంది. ప్చ్! ఇప్పుడంతా డబ్బు ఆధారిత రాజకీయాలు కదా.!
పాత జ్ఞాపకాల తలపులో...
ఈ మధ్య ఎందుకో ఒక సంఘటన గుర్తొచ్చి, పొట్ట పట్టుకొనిమరీ నవ్వుకున్నా. అదేంటంటే, ‘‘గుండమ్మ కథ’’ సినిమా నాటికే నాగేశ్వరరావు గారు విగ్గు వాడుతున్నారు. సరే, ఆ సినిమాలో ఆయన ఒక వాటర్ ఫౌంటైన్‌లో సరదాగా ఈతకొట్టే సన్నివేశం షూటింగ్ జరుగుతోంది. అందులో హీరో నీళ్లలో మునిగి, పైకి లేచే సన్నివేశం తీస్తున్నారు. అప్పుడు నాగేశ్వరరావు గారు నీళ్లలో అలా ఒక సారి మునిగి పైకి లేచారో లేదో తలపై విగ్గు పక్కకి కొట్టుకుపోయి, ఆయన గుండు బయటపడింది. దాంతో సెట్లోని వాళ్లంతా పగలపడి నవ్వారు. నేనూ నవ్వుతుంటే, ‘ఊరుకోమ్మాయ్.. ఊరుకో.. అలా నవ్వుతావేంటి’ అని నన్ను ఆయన అన్నారు(నవ్వుతూ..). అప్పటి జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటే, ఆ రోజులే వేరనిపిస్తుంటుంది. కొద్ది రోజుల క్రితం టెలివిజన్‌లో ‘‘మిస్సమ్మ’’ సినిమా చూ స్తూ, అందులో ‘‘బాలనురా మదనా’’ పాటకి అప్పుడు నేను ఎలా డ్యాన్స్ చేశానో నా మనుమడు (కూతురు, కొడుకు)కి సరదాగా చూపించాను. ఆ వీడియో వైరల్ అయింది.!(నవ్వుతూ..) అలా పాత జ్ఞాపకాలను తలచుకోవడంతో కొంత కాలక్షేపం అవుతోంది.
మరికొన్ని వ్యాపకాలు..
ఇంటి, వంట పనులేవీ నన్ను చేయనివ్వరు. దాంతో రోజంతా ఖాళీనే కదా.! అందులో కొంత సమయం టీవీలోని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చూడడంతో గడిచిపోతుంది. ఇదివరకు పుస్తకాలు విపరీతంగా చదివేదాన్ని. ఏదో ఒక పుస్తకం చదవనిదే నిద్రకూడా పట్టేది కాదు. నా గదిలోని కబోర్డు నిండా పుస్తకాలే.! అయితే ఇప్పుడు ఎక్కువ చదవలేకపోతున్నా. ఈ మధ్య యూట్యూబ్ చూడడం అలవాటైంది. ఇప్పుడు రాత్రిపూట యూట్యూబ్‌లో వైల్డ్‌లైఫ్ వీడియోలు చూస్తూ నిద్రపోతున్నా. నాకు జంతువులు, పక్షులంటే చాలా ఇష్టం. నేను పూర్తి శాకాహారిని. నాకు మొదట నుంచి ప్రత్యేకమైన డైట్ ప్లాన్లంటూ ఏమీ లేవు. రోజుకొకసారి కాఫీ తాగుతా, అదీ పెద్ద కప్పులో. లంచ్, డిన్నర్‌లో అన్నం మాత్రమే తింటాను. చపాతీ, సూప్‌లు నాకు పెద్దగా పడవు. కనుక వాటికి నేను దూరం. ఉదయం 11గంటలప్పుడు ఒక గ్లాసు మజ్జిగ లేదా పండ్ల రసం తీసుకొంటా. సాయంత్రం నాలుగు గంటలప్పుడు ఒక పండు తింటా. సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడూ నా మెనూ ఇదే.!
కరోనా అంటే భయం లేదు
ఏ వస్తువు ముట్టుకున్నా, తర్వాత సోప్ లిక్విడ్‌తో చేతులు కడుక్కోవడం నాకు మొదటి నుంచీ అలవాటే. ఊహ తెలిసినప్పటి నుంచి కలరా, మలేరియా, అమ్మవారు వంటి ప్రాణాంతక రోగాల గురించి విన్నాను. ఇప్పుడు కరోనా గురించి వింటున్నాను. దీనిపట్ల నాకు భయమేమీ లేదు. కాకపోతే ప్రకృతిలోని మిగతా జీవజాలం మానవాళికి శాపం పెట్టిందేమో అనిపిస్తుంది. మనిషి గొప్పవాడు. ఎలాంటి ఉపద్రవాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలడు. కరోనా అత్యంత త్వరలోనే ఒక గతంగా మిగలాలని మనమంతా కోరుకుందాం.
ఆ మహనీయుడి తీరే వేరు..!
మా అబ్బాయి వంశీకృష్ణ అమెరికాలో స్థిరపడ్డాడు. తాను శాన్ ఫ్రాన్సిస్కో యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ ప్రొఫెసర్. దేశంకాని దేశంలో ఉన్నా, రోజూ ఫోన్ చేసి జాగ్రత్తలు చెబుతుంటాడు. మా బంధువులందరికీ తరచుగా ఫోన్లు చేసి, వాళ్ల క్షేమ సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు నా దినచర్యలో భాగమైంది. ఇండస్ట్రీ ఫ్రెండ్స్ అంటే ఇది వరకు గీతాంజలితో ఎక్కువ ఫోన్ కాంటాక్టు ఉండేది. ఇప్పుడు రోజారమణి, కవితతో రెగ్యులర్‌గా మాట్లాడుతుంటా. అప్పుడప్పుడు చెన్నై నుంచి శారద ఫోన్ చేస్తుంటారు. వారం క్రితం బాలయ్య బాబు (నందమూరి బాలకృష్ణ) ఫోన్ చేసి ‘‘అమ్మా ఎలా ఉన్నారు’’ అని నా యోగక్షేమాలన్నీ అడిగారు. ఆయన నన్ను ఒక తల్లిలా గౌరవిస్తారు. బాలయ్యకి పెద్దలంటే ఎంతో మర్యాద. కాబట్టే కదా, ఈ ఆపద సమయంలో నేను ఎలా ఉన్నానో అని ఫోన్ చేసి మరీ పలకరించారు. వాళ్ల నాన్న సంస్కారాన్నంతా బాలయ్య పుణికిపుచ్చుకున్నాడు. ఎన్టీఆర్ గారు కూడా అంతే, లేడీ్‌సని ఎంతో గౌరవించేవారు. సెట్‌లో లైట్‌బాయ్, టీ, కాఫీలు అందించే ప్రొడక్షన్ బాయ్‌ని కూడా ‘మీరు’ అని పిలిచేవారు. ఆ మహనీయుడి తీరే వేరు.