సుశాంత్ గురించి ఆ విషయం అప్పుడే తెలిసింది: రియా చక్రవర్తి

ABN , First Publish Date - 2020-08-27T21:50:56+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌‌పుత్ గురించి నటి రియాచక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించింది.

సుశాంత్ గురించి ఆ విషయం అప్పుడే తెలిసింది: రియా చక్రవర్తి

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్‌ రాజ్‌‌పుత్ గురించి నటి రియాచక్రవర్తి సంచలన విషయాలు వెల్లడించింది. సుశాంత్ మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తనకు గతేడాది తెలిసిందని చెప్పుకొచ్చింది. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించింది.


ఓ షూటింగ్ కోసం తాను పారిస్ వెళ్లాలనుకున్నానని, కానీ అదే సమయంలో సుశాంత్ యూరప్ ట్రిప్ ప్లాన్ చేసి తన ట్రిప్ రద్దు చేశాడని పేర్కొంది. దీంతో గతేడాది అక్టోబరులో యూరప్ ట్రిప్‌కు వెళ్లాల్సి వచ్చిందని, ఈ సందర్భంగానే అతడు మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు తనకు తెలిసిందని వివరించింది. 


తనకు క్లాస్ట్రోఫోబియా (పైకప్పు కలిగిన స్థలాలంటే భయం)తో బాధపడుతున్నట్టు సుశాంత్ చెప్పాడని, దీని కోసం డాక్టర్ ప్రిస్కిప్షన్ లేకుండానే మెడాఫినిల్ అనే మందులు తీసుకున్నట్టు రియా పేర్కొంది. విమాన ప్రయాణమంటే భయపడిపోయేవాడని, విచిత్రమైన బొమ్మలు, చిత్రాలు చూస్తే వింతగా ప్రవర్తించేవాడని తెలిపింది. పారిస్ వెళ్లాక మూడు రోజులపాటు తన గదిని విడిచిపెట్టి బయటకు రాలేదని, యూరప్ వీధుల్లో తన చేయి పట్టుకుని తిరగాలని ఉందని చెప్పాడని రియా గుర్తు చేసుకుంది.


ఇటలీ చేరుకున్నాక సుశాంత్ ఆరోగ్యం క్షీణించిందన్నాడు. ఈ సందర్భంగా 2013లో రేష్‌శెట్టి అనే సైకాలజిస్ట్ ఇచ్చిన సూచన మేరకే తాను మెడాఫినిల్ మందులు వాడుతున్నట్టు తనకు చెప్పాడని పేర్కొంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇండియా తిరిగి వచ్చినట్టు రియా చక్రవర్తి వివరించింది. 

Updated Date - 2020-08-27T21:50:56+05:30 IST