వినాయక చవితి జరుపుకున్న షారూక్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ABN , First Publish Date - 2020-08-25T02:32:56+05:30 IST

వినాయక చవితి జరుపుకున్న బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌పై నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు.

వినాయక చవితి జరుపుకున్న షారూక్.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!

ముంబై: వినాయక చవితి జరుపుకున్న బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్‌పై నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. షారూక్ ఖాన్ ప్రతి సంవత్సరం కుటుంబంతో కలిసి వినాయక చవితి ఉత్సవాలు జరుపుకుంటాడు. ఈసారి కూడా జరుపుకున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను షేర్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్‌లో ఉన్న ఈ ఫొటోలో షారూక్ నుదుటన బొట్టు కనిపిస్తోంది. ‘‘ప్రార్థనలు, విసర్జన పూర్తయ్యాయి. ఈ గణేశ్ చతుర్థి నాడు వినాయకుడు మీకు, మీ ప్రియమైన వారికి దీవెనలు, ఆనందాన్ని ప్రసాదించాలి. గణపతి బప్పా మోరియా’’ అని ఆ ఫొటో కింద షారూక్ రాసుకొచ్చాడు.

 

 ఇది చూసిన నెటిజన్లు ట్రోల్స్‌తో విరుచుకుపడుతున్నారు. ఓ ముస్లిం అయి ఉండి హిందూ పండుగను జరుపుకోవడం ఏంటని ప్రశ్నిస్తూ కామెంట్లు చేస్తున్నారు. కొందరు మాత్రం షారూక్‌కు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు. షారూక్ అన్ని పండుగలను చేసుకుంటాడని, అతడు నిజమైన భారతీయుడని కామెంట్ చేస్తున్నారు.  


షారూక్ హిందూ అయిన గౌరీని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు ఆర్యన్, సుహానా, అబ్‌రామ్ ఉన్నారు. రెండు మతాలను వీరు పాటిస్తారు. గణేశ్ చతుర్థితోపాటు దీపావళి, ఈద్, హోలీ వంటి పండుగలను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. కాగా, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, శిల్పాశెట్టి, అనన్యపాండే, శ్రద్ధా కపూర్ వంటి వారు కూడా గణేశ్ పండుగ జరుపుకున్నారు. 

Updated Date - 2020-08-25T02:32:56+05:30 IST