వావ్‌! నవాబ్‌

ABN , First Publish Date - 2020-10-25T06:03:00+05:30 IST

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 800 కోట్ల విలువైన ప్యాలెస్‌ అది. తన తండ్రి మన్సూర్‌ పటౌడీ ఆలీఖాన్‌ మరణాంతరం నటుడు సైఫ్‌ ఆలీ ఖాన్‌కు వారసత్వంగా దక్కవలసిన ఆ ప్యాలెస్‌ హోటల్‌ రూపం దాల్చింది...

వావ్‌! నవాబ్‌

ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 800 కోట్ల విలువైన ప్యాలెస్‌ అది. తన తండ్రి మన్సూర్‌ పటౌడీ ఆలీఖాన్‌ మరణాంతరం  నటుడు సైఫ్‌ ఆలీ ఖాన్‌కు వారసత్వంగా దక్కవలసిన ఆ ప్యాలెస్‌ హోటల్‌ రూపం దాల్చింది. అంతటి విలువైన వారసత్వ సంపద లీజు రూపంలో, పరాయి వ్యక్తుల చేతుల్లో ఉండిపోవడం సైఫ్‌కు నచ్చలే దు. దాంతో తన తండ్రిగారి జ్ఞాపకమైన ఆ భవంతిని తన కష్టార్జితంతో తిరిగి సొంతం చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సైఫ్‌ బయటపెట్టాడు...


సైఫ్‌ అలీ ఖాన్‌, కరీనా కపూర్‌లు హర్యాణాలోని సైఫ్‌ పూర్వీకుల నివాసమైన పటౌడీ ప్యాలెస్‌ను తరచుగా సందర్శిస్తూ ఉంటారు. ఈ ప్యాలెస్‌ వెనక ఓ ఆసక్తికరమైన కథ ఉంది. ఈ రాజభవనం సైఫ్‌కు వంశపారంపర్యంగా దక్కింది కాదు. అలా దక్కవలసిన ప్యాలెస్‌ను, సైఫ్‌ సినిమాల్లో నటించడం ద్వారా ఏళ్లతరబడి కూడబెట్టుకున్న తన కష్టార్జితంతో కొనుక్కున్నాడు. పది ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్యాలెస్‌లోని 150 గదుల్లో ఏడు డ్రెస్సింగ్‌ రూమ్‌లు, ఏడు పడక గదులు, ఏడు బిలియర్డ్‌ గదులు ఉన్నాయి. సైఫ్‌ తండ్రి, అలనాటి మేటి క్రికెటర్‌ మన్సూర్‌ అలీ ఖాన్‌ పటౌడీ ఈ ప్యాలెస్‌ను నీమ్రనా హోటల్‌కు లీజుకు ఇచ్చారు. 2014 వరకూ లగ్జరీ హోటల్‌గా ఈ ప్యాలెస్‌ నడిచింది. అయితే కుటుంబ వారసత్వ సంపద అలా పరాయి మనుషుల చేతుల్లోకి వెళ్లిపోవడం నచ్చని సైఫ్‌ ఆ ప్యాలెస్‌ను కోట్ల రూపాయలు ఎదురిచ్చి తిరిగి సొంతం చేసుకున్నాడు. 


సినిమాల్లో సంపాదించినదంతా...

‘‘తండ్రి తరువాత ఆస్తి కొడుక్కి వారసత్వంగా దక్కుతుంది’ అని అందరూ అనుకుంటారు. కానీ నిజానికి అలా దక్కవలసిన ఆస్తిని నా కష్టార్జితంతో సొంతం చేసుకున్నాను. మా నాన్న పటౌడీ ఆలీఖాన్‌ చనిపోయినప్పుడు, ప్యాలెస్‌ను నీమ్రానా హోటల్‌కు లీజుకు ఇచ్చారు. అమన్‌, ఫ్రాన్సిస్‌ అనే ఇద్దరు వ్యక్తులు ఆ హోటల్‌ను నడిపేవారు. ‘తిరిగి ఆ ప్యాలెస్‌ను దక్కించుకోవాలనుకుంటే నాతో చెప్పు’అని అప్పట్లో ఫ్రాన్సిస్‌ నాతో అన్నాడు. ఓ సందర్భంలో ‘ఆ ప్యాలెస్‌ నాకు కావాలి’ అని అడిగేశాను. దాంతో ఓ సమావేశం ఏర్పాటు చేసి, ‘ప్యాలెస్‌ దక్కించుకోవాలంటే చాలా ఎక్కువ డబ్బు ఎదురివ్వాలి‘ అని ప్రకటించారు. ఆ తర్వాత అంత డబ్బును నేను సినిమాల ద్వారా సంపాదించి ఈ మధ్యే ప్యాలెస్‌ను సొంతం చేసుకున్నాను. ఆ ప్యాలెస్‌కు ఒక చరిత్ర ఉంది, సంస్కృతి ఉంది, దానిలో అందమైన ఫొటోలు ఉన్నాయి. పటౌడీ కుటుంబంలో పుట్టడం నాకు కచ్చితంగా గర్వకారణమే! అంతకుమించి వారసత్వంగా కుటుంబం నుంచి పొందింది ఏమీ లేదు.’’ అని పటౌడీ ప్యాలెన్‌ను తిరిగి దక్కించుకున్న విషయాన్ని పంచుకున్నాడు సైఫ్‌ ఆలీఖాన్‌.

Updated Date - 2020-10-25T06:03:00+05:30 IST