‘ఈవీపీ స్టూడియోస్‌లో షూటింగ్ వద్దు బాబోయ్’

ABN , First Publish Date - 2020-02-21T02:22:07+05:30 IST

ఇది @యాక్టర్_అమృత భావోద్వేగం. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ‘భారతీయుడు-2’ చిత్రీకరణలో ఈ నెల 20న జరిగిన విషాదంపై ఆమె ఈ విధంగా స్పందించారు. ఆమె మాటలు నిజమేనేమో అని అనిపిస్తుంది.

‘ఈవీపీ స్టూడియోస్‌లో షూటింగ్ వద్దు బాబోయ్’

‘‘ఇది నిజంగా విషాదకరం! అది చాలా భయానక ప్రదేశం, ‘బిగిల్’ చిత్రీకరణ సమయంలో కూడా ఇలాంటిదే ఓ లైటు ఓ వ్యక్తి మీద పడింది, మేం ఇప్పటిలాగానే చాలా వణికిపోయాం!! మళ్ళీ షూటింగ్‌కి కానీ, మామూలుగా కానీ అక్కడికి ఎవరూ వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. చాలా ప్రతికూల వాతావరణం (ఉంటుంది). (మరణించినవారి) ఆత్మకు శాంతి కలగాలి’’ 


ఇది @యాక్టర్_అమృత భావోద్వేగం. చెన్నైలోని ఈవీపీ స్టూడియోలో ‘భారతీయుడు-2’ చిత్రీకరణలో బుధవారం జరిగిన విషాదంపై ఆమె ఈ విధంగా ఓ ట్వీట్ ద్వారా స్పందించారు. ఆమె మాటలు నిజమేనేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే గత పదేళ్ళలో ఈ స్టూడియోలో జరిగిన ప్రమాదాల్లో సుమారు 10 మంది ప్రాణాలు కోల్పోయారు.


ఈవీపీ స్టూడియోస్ మొదట్లో ఓ అమ్యూజ్‌మెంట్ పార్క్. 2012 అక్టోబరులో అఫియా మాఘ్ అనే  22 ఏళ్ళ ఫ్లైట్ అటెండెంట్ ‘ఆక్టోపస్ రైడ్’ చేస్తుండగా ప్రమాదం జరిగింది. 10 అడుగుల ఎత్తు నుంచి ఆమె కారుపై పడటంతో తలకు బలంగా గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తరలిస్తూండగా, తుది శ్వాస విడిచారు. అప్పట్లో ఆ స్టూడియో యాజమాన్యం తమ లైసెన్సు గురించి మాత్రమే ఆందోళన చెందారు కానీ, ప్రజల భద్రత గురించి పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి. ఈ కేసును ఆదరాబాదరాగా మూసేయడానికి ఈవీపీ స్టూడియోస్ ప్రయత్నించింది. చివరికి మూడేళ్ళపాటు అమ్యూజ్‌‌మెంట్ పార్క్‌ను మూసేశారు. 


అనంతరం దీనిని చలన చిత్రాల చిత్రీకరణల కోసం అద్దెకు ఇవ్వడంతో ఈవీపీ ఫిలిం సిటీ ఆవిర్భవించింది. ఈ కొత్త వెంచర్‌లో కూడా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇక్కడ భారీ బడ్జెట్ చిత్రాలకు అతి భారీ సెట్టింగులతో చిత్రీకరణ జరుగుతూ ఉంటుంది. 


‘కాలా’ :

పూనమల్లేలోని ఈవీపీ స్టూడియోస్‌లో 2017లో ‘కాలా’ కోసం రూ.5 కోట్లతో భారీ సెట్టింగ్ వేశారు. ఆ సమయంలో మైఖేల్ అనే టెక్నీషియన్ విద్యుదాఘాతంతో మరణించారు. 


బిగ్ బాస్ తమిళ్ సీజన్-2 :

తమిళ బిగ్ బాస్ కోసం ఈవీపీ స్టూడియోస్‌లో భారీ సెట్టింగ్ వేశారు. సెకండ్ సీజన్ బిగ్ బాస్ 2018లో ప్రసారమైంది. రెండో అంతస్థులో ఏసీని మరమ్మతు చేస్తున్న గుణశేఖరన్ ప్రమాదవశాత్తూ జారి పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది.


‘బిగిల్’ : 

ఈ చిత్రం కోసం ఈవీపీ స్టూడియోస్‌లో భారీ ఫుట్‌బాల్ స్టేడియం సెట్‌ను నిర్మించారు. ఓ క్రేన్‌పై ఉన్న ఫోకస్ లైట్ పడిపోవడంతో ఎలక్ట్రీషియన్ సెల్వరాజ్ తీవ్రంగా గాయపడ్డారు. 


‘ఇండియన్-2’ :

ఫిబ్రవరి 19న ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగా ఓ క్రేన్ విరిగి, కుప్పకూలడంతో ముగ్గురు సాంకేతిక నిపుణులు ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 10 మంది గాయపడ్డారు. 


అనేక రంగాలకు చెందినవారు నిరంతరం శ్రమించి పని చేసే చోట కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఎప్పటికప్పుడు వస్తున్నా, పరిస్థితుల్లో మార్పు రావడం లేదు.


Updated Date - 2020-02-21T02:22:07+05:30 IST